Monday, January 25, 2016

Deva Asura Conflictsమన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని
దేవాసురయుద్ధం

గత సంచికలో తొలి హరప్పా యుగారంభంలో ఐక్ష్వాకుల రాజ్యవిస్తరణ ప్రక్రియని పురాతత్వ కోట్‍దిజి సంస్కృతి నేపధ్యంలో పరిశీలించాం. భౌగోళికంగా సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్లు, ప్రపంచంలోనే అతిపెద్ద పురాతత్వ సాంస్కృతిక స్తరంగా విస్తరించిన కోట్‍దిజి సంస్కృతిలో, సామాన్యుల జీవన విధానంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనుపించదు. ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినా వాటికి తగిన ప్రతిఫలం కింది వర్గాల ప్రజలకు అందలేదని అనుమానించక తప్పదు. అసురుల అసమాన వాణిజ్య వ్యవస్థ దీనికి ముఖ్యకారణం.
క్రీపూ. 2900 నాటికి స్థానిక మేధావి వర్గంలో ఈ వ్యవస్థ పట్ల నిరసన ఉద్యమరూపం దాల్చింది. ఆ ఉద్యమానికి నడుంకట్టిన ప్రజాసమూహం తమని తాము దేవుళ్లు (దివి వాస్తవ్యులు), అంటే స్థానికులుగా పిలుచుకొన్నారు. వారి నాయక స్థానంలో ధ్వజ చిహ్నంగా ఒక కొత్త శక్తి ఉదయించింది. అనాటి సమకాలీన మెసొపొటేమియాలోని మర్దుక్వలెనే ఇతడు కూడా ఒక కొత్త దేవుడు. సుమేరియా తొలి సంప్రదాయంలోని అను’, ‘ఎల్వంటి దైవాలు, మన సంప్రదాయంలో వరుణుడు, ద్యస్సుల వలె పితృ చిహ్నాలైతే, ‘మర్దుక్’, ‘బాల్వంటి కొత్తతరానికి చెందిన దైవాలు దేవుని కుమారులు’ (Sons of God). ప్రాచీన నాగరికలన్నింటిలో ఈ కొత్తతరం దైవాలు, యుద్ధానికి, వీరత్వానికి చిహ్నాలుగా నిలిచారు. మన సంప్రదాయంలో అగ్ని (సూర్యుడు), ఇంద్రుడు, ఆదిత్యులు, స్కంథుడు అదే కోవకి చెందుతారు. వేదవాజ్ఞ్మయంలో దాదాపు ముప్పాతిక వంతు ఈ కోవకు చెందిన దేవుళ్లకే కేటాయించబడింది. ఇది ప్రాచీన నాగరికతలో సంభవించిన అతిముఖ్య పరిణామాన్ని సూచిస్తుంది.
వేదాల్లో ఇంద్రునికి విరోధులైన అసురులతో బాటు, దాస, దశ్యు, పణ్య మొదలైన జాతినామాలు ప్రముఖంగా కనిపిస్తాయి. ముందు సంచికల్లో అమ్రీ సంస్కృతిని అసురుల ఆధిపత్యానికి కేంద్రంగా ఊహించడం జరిగింది. వాజ్ఞ్మయంలోని ఆధారాలతో తొలి హరప్పాయుగంలోని అమ్రీ సంస్కృతి ప్రాంతంలోని సామాజిక నేపధ్యాన్ని మరోసారి పరిశీలించడం అవసరం. మ్యాక్స్ మ్యూల్లర్ వంటి చరిత్రకారులు, దాసదశ్యులను, ఆర్యుల దండయాత్రల్లో అణిచివేయబడ్డ స్థానిక జనజాతులుగా సిద్ధాంతీకరించారు. ఆర్యుల దండయాత్ర అనే సిద్ధాంతం అవాస్తవమైనా, వారి సూచనలో కొంత నిజం లేకపోలేదు. ఇంద్రుని నాయకత్వంలోని దేవతల దాడులకు బలియైన వారిలో దాసులు, దశ్యులు అనే జనజాతులు ముఖ్యమైనవిగా వాజ్ఞ్మయం కోడైకూస్తుంది. మరి ఈ దాసదశ్యులు ఎవరు? వీరికీ అసురులకూ ఉన్న సంబంధం ఏమిటి? వాజ్ఞ్మయంలో ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు దొరకవు. కానీ కొన్ని ఊహలకు అవకాశం ఉంది. ఉదాహరణకి, ఋగ్వేదంలోని ఆరవ మండలంలోని (VI.10..4-13) సూక్తం, ఇంద్రునిచే వధించబడ్ద అనేకమంది దాసదశ్యుల పేర్లను వివరిస్తుంది. వీరందరినీ సాయనాచార్యుడు అసురులుగా సంబోధించాడు. .V.29.9 లోని దశ్యూనసురాన్అనే పదబంధానికి భాష్యం చెబుతూ దశ్యులే అసురులనితీర్మానించాడు. మహాభారత కాలానికి దశ్యు, దాస అనే పదాలు అసురపదానికి పర్యాయాలుగా వాడబడ్డాయి. ఋగ్వేదంలో దాస దశ్యులుగా పిలువబడ్డ అసురుల పేర్లు కొన్ని పట్టికలో చూడవచ్చు. (పట్టిక) ఇది దాసదశ్యులు అసుర సామాజిక వ్యవస్థలో భాగస్వాములనే ఊహను బలపరుస్తుంది.
దాసులు: దాస, దాశ పదాలు నదీ పరివాహక ప్రదేశాల్లో నీటిపై ఆధారపడిన జీవన వ్యవస్థను సూచిస్తాయి. నదీజలాలు, పడవలు, బల్లకట్లు, చేపలవేట, ఆనకట్టలు, కాలువలు, సరస్సులు వీరి వర్ణనల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. పై పట్టికలోని అసురులను దాసులుగా సంబోధించడం, అసురులకూ, నదీ పరివాహక క్షేత్రానికీ ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. దాసుడు అనే పదానికున్న బానిస లేదా సేవకుడు అనే అర్థంలో, అసురుల పరాజయం తరువాత వారి ఆశ్రిత జాతుల హోదాలో వచ్చిన మార్పును ఊహించవచ్చు.
దశ్యులు: భాషా శాస్త్రం ప్రకారం, దశ్యు పదానికి, ఇతర ఇండోయూరోపియన్ భాషల్లోని ద్రక్మ, దచావ్ (Drachma, Dachau) పదాలకూ సామ్యం ఉంది. సంస్కృతంలోని  గ్రామ, దమ (ఇల్లు) పదాలకు మూలాలను, దశ్యు పదంలో వెదకవచ్చు. కనుక దశ్యులు అసుర నేపధ్యానికి చెందిన గ్రామీణ వ్యావసాయిక జనజాతులనే ఊహకు అవకాశముంది.
పణ్యులు: డి. డి. కోశాంబి వంటి చరిత్రకారులు, నేటి వణిజ’, ‘బనియాపదాలకు పణి లేదా పణ్య పదమే మూలమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బలిజ అనే తెలుగు జాతినామానికి కూడా అదే నిరుక్తార్థం. ఋగ్వేదంలో పణ్యులు వర్తకులుగా, వడ్డీ వ్యాపారులుగా, ధనికులుగా, పిసినారులుగా వర్ణించబడ్డారు. పణం, పెన్నీ (Penny) వంటి నాణాలకూ, పణం (తాకట్టు, జూదంలో ఒడ్డు) పాన్ (Pawn) వంటి పదాలకు కూడా మూలమదే. ప్రాచీన ఐరోపా, మధ్యఅసియా దేశాల్లో, వర్తకానికీ సముద్రయానానికి పేరెన్నిక గన్న Phoenician జాతులకు, పణి పదానికి ఉన్న సామ్యం గుర్తించదగినదే. కనుక పణ్యులు వాణిజులుగా, అసుర వ్యవస్థపై ఆధారపడి వారికి సహాయ సహకారాలు అందించిన జనజాతిగా భావించవచ్చు.
పురాణాల్లోని కృత, త్రేతాయుగాల రాజుల కథల్లో ప్రముఖంగా కనిపించే దేవాసుర సంగ్రామాల్లో, పై జాతులు అసురుల పక్షం వహించినట్లు కానవస్తుంది. మన పర్జిటార్ పట్టికలో క్రీపూ 2900 - 2500 మధ్య ఐక్ష్వాకుల చరిత్రల్లో ఈ దేవాసురుల స్పర్థ ముఖ్యాంశం. దీనిలో మూడు నిర్దిష్టమైన పరిణామ దశలు కనిపిస్తాయి.
1)   స్థానిక శక్తుల సమీకరణ, అసురుల పరాజయం
2)   ప్రాంతీయ తిరుగుబాట్లు, రాజకీయ అనిశ్చిత పరిస్థితి
3)   ఐక్ష్వాకుల ఆధిపత్యం, అసురుల వలసలు
దాదాపు ఐదొందల యేళ్లు సాగిన ఈ దేవాసురుల స్పర్థ, వైదిక వాజ్ఞ్మయంలోనేగాక. హిందూ సంప్రదాయంలోని అనేక గాథల్లో, అద్భుతాల్లో, అవతారాల్లోనూ, ఆనాటి వాస్తవ చారిత్రక సంఘటనల నేపధ్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సంస్కృత భాషలో మనకు అందుబాటులో ఉన్న వేదాల సంకలనం, ఆదిపురాణం మహాభారత యుద్ధకాలం అంటే క్రీపూ. 1500 కాలానికి చెందినవి. మిగిలిన వైదిక, ఇతిహాస పురాణ సంప్రదాయం ఆ తరువాత రచింపబడింది. అంటే, కృత త్రేతాయుగాలుగా వర్ణింపబడ్డ కాలంలోని వాస్తవ సంఘటనలకు, మనకి లభిస్తున్న వాజ్ఞ్మయంలోని వర్ణనలకూ మధ్య వెయ్యి సంవత్సరాలకు పైగా అంతరం ఉంది. భాషలో, మతంలో, ఆర్థిక సామాజిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల, వ్యక్తుల కథల్లో సంఘటనల వర్ణనల్లో మార్పు చేర్పులు ఉండటం అనివార్యం. కనుక వాజ్ఞ్మయమే ఆధారంగా మనం చేసే పరిశీలనలో ఆనాటి వ్యక్తులూ వారి కథలే చరిత్రగా భావించక, ఆ గాథల్లో దాగివున్న నేపధ్యాన్ని, ఆ నేపధ్యంలో ఏర్పడ్డ సామాజిక, రాజకీయ, సంప్రదాయక పరిణామాలపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం.

స్థానిక శక్తుల సమీకరణం, అసురుల పరాజయం
క్రీపూ. 2800 నాటికి అయోధ్యలో ఐక్ష్వాకులు ప్రముఖ రాజకీయ శక్తిగా ఎదిగారు. ఎగువ సరస్వతి మైదానంలోని ప్రతిష్ఠానంలో పౌరవుల ముఖ్య శాఖ ఉంటే, మరో రెండు కాశీ, కన్యాకుబ్జాల్లో స్థానిక రాచరికాలుగా కనిపిస్తాయి. దిగువ సింధు, గుజరాత్ ప్రాంతాల్లో యాదవులవి రెండు శాఖలు, వీరిలో కోష్టువు సంతతి ముఖ్యమైనదైతే, హైహేయులు మరో శాఖ. అసురులకు ప్రత్యామ్నాయంగా పెరిగేందుకు ఐక్ష్వాకులకు ఈ స్థానిక రాచరికాలను కూడగట్టుకోక తప్పలేదు. ఆనాటి సమకాలీన రాజవంశాల మధ్య వైవాహిక సంబంధాలు, ఐక్ష్వాకులు ఆ దిశలో చేసిన ప్రయత్నాలను ఎత్తిచూపుతాయి. (పటం.)
పురాణాల్లో ప్రసేనజిత్తు (క్రీపూ. 2828) కుమారుడు యువనాశ్వుడి భార్య పేరు గౌరి, వారి కుమారుడు మాంధాత. పౌరవ వంశంలో మతినారుడి కుమార్తె గౌరియే మాంధాత తల్లి. ఇది పౌరవుల ముఖ్య శాఖకి, ఐక్ష్వాకులకూ మధ్య రాజకీయ సమీకరణాలను తెలుపుతుంది. యాదవుల్లో చిత్రరథుని కుమారుడు శశబిందు కుమార్తె, బిందుమతి, మాంధాత భార్య అని సంప్రదాయం. అంటే తరువాతి తరంలో ఐక్ష్వాకులు యాదవులతో బాంధవ్యం నెరపారని తెలుస్తుంది. అంతేగాక కాన్యాకుబ్జులలో జహ్నువు అనే రాజు, యౌవనాశ్వుని (మాంధాత) మనుమరాలు, అంటే పురుకుత్సుని కుమార్తెను పెండ్లాడాడు. దేవాసురయుద్ధంలో మొదటి ఘట్టం - శుష్ణ, శంబరుల వృత్తాంతం పురుకుత్సుని కాలంలో (క్రీపూ. 2750) సంభవించింది. ఋగ్వేదంలో ఇంద్రుడు కుత్సుని కొరకు శుష్ణుడిని, దివోదాసుని కొరకు శంబరుడినీ సంహరించాడని నిర్ద్వంద్వంగా చెప్పబడింది. కనుక ఈ వైవాహిక సంబంధాలతో ఒనగూడిన రాజకీయ సమీకరణాలను, అసురులపై స్థానిక శక్తుల తిరుగుబాటు ప్రక్రియలో భాగంగా ఊహించవచ్చు.
ఈ రాజకీయ సమీకరణాలకు తోడుగా సంప్రదాయక వర్గాల్లో కూడా అసురుల పట్ల తిరుగుబాటు ధోరణిని సూచించే ఇతివృత్తాలు, సాహిత్యంలో కనిపిస్తాయి. సాంప్రదాయకంగా పౌరవుల పురోహితులైన ఆంగీరసులు, ఐక్ష్వాకుల పురోహితులైన వాశిష్టుల తోడుగా నిలిచారనేందుకు వాజ్ఞ్మయంలో ఆధారాలు ఉన్నాయి. మరోముఖ్యమైన పరిణామం, అసురుల పురోహితులైన భార్గవుల తిరుగుబాటు. కావ్య ఉశానుడు ఇంద్రునికి వజ్రాయుధం నిర్మించిన వృత్తాంతంలో, అసురులకు వ్యతిరేకంగా, భార్గవ ఋషులను చూస్తాం. కవి, ఉశానులు భార్గవులు, అసుర గురువులైన శుక్రాచార్యుని సంతతికి చెందినవారు. ఈ యుద్ధానికి కాశీ లేదా వారణాశి కేంద్రంగా కనిపిస్తుంది. క్షత్రియ సంప్రదాయంలోని కాశేయుల వృత్తాంతాలు ఆనాటి రాజకీయాల్లో నెలకొన్న ఆటుపోట్లను సూచిస్తాయి.

ప్రాంతీయ తిరుగుబాట్లు, రాజకీయ అనిశ్చిత స్థితి
తొలి తరాల్లో కాశీని పాలించిన రాజులు పౌరవులుగా కాక వారి దాయాదులుగా చెప్పుకొన్నట్లు తోస్తుంది. ఈ వంశానికి కశుడు (క్రీపూ. 2900) మూలపురుషుడు. అతడి పేరున నిర్మించబడ్డ నగరానికి కాశి అని పేరువచ్చింది. ఈ తేదీ మొహెంజొదారో తొలిదశను సూచించడం, ప్రాచీన మొహెంజొదారో నగరమే కాశీ అనే వాదనను బలపరుస్తుంది. కాశేయుల్లో ముఖ్యుడు దివోదాసుడు, పురుకుత్సుని సమకాలినుడు (క్రీపూ. 2750). శంబరాసురునిపై విజయంలో ఇతడికి పురుకుత్సుని సహాయ సహకారాలు అందాయి. శంబరుని నూరు పురాలపై (గ్రామాలు?) దివోదాసుడి గెలుపు దిగువ సరస్వతీ మైదానంలో మొహెంజొదారో ఆధిపత్యాన్ని సూచిస్తే, శుష్ణుని కదిలే నగరంపై (చరిష్ణు) కుత్సుని విజయం, అసురుల నౌకాదళంపై స్థానిక శక్తుల గెలుపుగా ఊహించాలి.
అయితే కాశేయుల ఆధిపత్యం ఎంతోకాలం సాగలేదు.
అసురుల పరాజయంతో ఏర్పడిన శూన్యతలో మరో కొత్త శక్తి పుట్టుకొచ్చింది. క్షేమకుడనే పుణ్యజన రాక్షసుల నాయకుని సహకారంతో, యాదవుల్లోని ఒక శాఖయైన హైహేయులు, దివోదాసుని పారద్రోలి కాశీపై ఆధిపత్యం సాధిస్తారు. రామాయణంలో బ్రహ్మ సముద్రజలాల రక్షణకై రాక్షసులను ప్రత్యేకంగా సృజించాడని చెప్పబడింది. ‘పుణ్యజన రాక్షసపదబంధంలో ప్యూనిక్ జాతులకు చెందిన నావికదళం అనే అర్థం ఊహించవచ్చు. పాణిని అష్టాధ్యాయిలో రాక్షసులను మూరదేవ, మూఢదేవ అనే పేర్లతో సంబోధించాడు. మూఢ, మూర్ద పదాలు, రాక్షసులకు అనాటి మెసొపొటేమియాలో ప్రాముఖ్యం ఉన్న మర్దుక్సంప్రదాయంతో సంబంధాన్ని సూచిస్తాయి. అసురులపై యుద్ధం శ్రమదోపిడీ వ్యవస్థపై స్థానికుల తిరుగుబాటు అనుకుంటే, హైహేయులకు రాక్షసుల సహకారం, వలసవాదుల ప్రతిచర్యగా భావించవచ్చు.
దివోదాసుని తరువాతి తరంతో కాశేయుల వంశం అంతరిస్తుంది. విదేహ వంశావళిలో కూడా ఈ కాలంలో తరాల మధ్య కొంత ఎడం కనబడుతుంది. పురుకుత్సుని కొడుకు త్రాసదశ్యుని (క్రీపూ. 2738) తరువాత త్రిశంకుని (క్రీపూ. 2600) వరకూ ఎనిమిది తరాల ఐక్ష్వాకుల్లో కూడా ప్రముఖులు కనపడరు. అంతేగాక త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, రోహితాశ్యుల కథల్లో అంతర్లీనంగా వినిపించే రాజ్యం కోల్పోవడం’, ‘దేశబహిష్కారంవంటి ఇతివృత్తాలు హైహేయుల ఆధిపత్యాన్ని, ఐక్ష్వాకుల బలహీనతనూ సూచిస్తాయి. ఈ హైహేయులలో ముఖ్యుడు కార్తవీర్యార్జునుడు (క్రీపూ. 2600). హైహేయుల ఆధిపత్యంపై ప్రతిఘటనలో ఆనాటి సాంప్రదాయక వర్గాలకు చెందిన విశ్వామిత్రుడు, భార్గవులలో ఔర్వుడు, జమదగ్ని, పరశురాముల పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. (పటం.)
హైహేయుల పతనంతో ఏర్పడిన ఐక్ష్వాకుల ఆధిపత్యం, నాగరికత ఉత్కృష్ట దశకి నాంది పలికింది. పురాతత్వ శాస్త్రం చూపే పరిణత హరప్పాయుగం, సంప్రదాయంలోని త్రేతాయుగాలు (క్రీపూ. 2600 - 2000) సామాన్య నాగరికుల జీవన వ్యవస్థలో వచ్చిన అద్వితీయమైన అభివృద్ధికి అద్దంపడతాయి. ఇది అసుర వ్యవస్థ అంతాన్ని, స్థానిక పాలనలో మెరుగైన ఉత్పత్తి-ప్రతిఫలాల నిష్పత్తిని సూచిస్తుంది.

ఐక్ష్వాకుల ఆధిపత్యం, అసురుల వలసలు
భారతీయ ఇతిహాసపురాణ వాజ్ఞ్మయంలో దేవాసురయుద్ధాలు, ఆధునిక ప్రపంచమంతటా, వలసరాజ్యాల్లో స్వాతంత్రం కోసం స్థానికుల తిరుగుబాట్లను తలపిస్తుంది. వైదిక వాజ్ఞ్మయంలోని యుద్ధ షడ్యంత్ర వర్ణనలు మోసపూరితమైన దేవతల వ్యూహాలను తలపిస్తాయి. దేవతల విజయాల్లో అగ్ని పాత్ర, నదుల కరకట్టలూ ఆనకట్టలు తెంచడం (నముచి, వృత్తాసుర వధ) వంటి విద్రోహ చర్యల్లో, దేవతల వ్యూహాలకూ, నేటి గెరిల్లా యుద్ధరచనకూ పోలిక అనివార్యం. జొరాస్ట్రియన్ సంప్రదాయం (జెండ్ అవెస్తా) కూడా అహుర మౙదాకు, దేవతల (Daeva) నాయకుడు ఆంగ్రమైన్యుకు మధ్య యుద్ధం వారెణ అనబడే ప్రాంతంలో జరిగిందని, అందులో దేవతలు మోసంతో జయించారనీ చెప్తుంది.
ఋగ్వేదంలోని ప్రసక్తుల్లో శుష్ణ, శంబరులు, ఇలీబిశుడనే అసుర రాజుకు సమకాలీనులుగా కనిపిస్తారు. వీరందరూ ఒకే సమయంలో పరాజయం పాలయ్యారు. పట్టికల్లోని తేదీలను బట్టి పురుకుత్సుని కాలంలో (క్రీపూ. 2775-50) అసురుల ఆధిపత్యానికి తిరుగులేని దెబ్బ తగిలినట్లు భావించాలి. పరశురాముని వృత్తాంతం, హైహేయుల పతనం (క్రీపూ. 2600) ఈ తిరుగుబాటు బాటలో మరో ముఖ్యఘట్టం. దాదాపు మూడు శతాబ్దాలు సాగిన ఈ ఉద్యమానికి క్లైమాక్స్ సగరుని (క్రీపూ. 2400) కాలానికి చెందింది. నముచి, వృత్రాసురులపై ఇంద్రుని విజయం, సింధ్, గుజరాత్ సాగరంపై పరిణత హరప్పా సంస్కృతి విస్తరణ, ఇరాన్ పీఠభూమిలో, గంగా మైదానంలో కనిపించే మొట్టమొదటి హరప్పా స్థావరాలు సగరుని దిగ్విజయం అనే అంశంలో చూడవచ్చు. (పటం). అదే నాణానికి మరోపక్క అసురుల పరాజయం, వారి వలసల క్రమంలో మధ్యఅసియా ఈజిప్ట్‌ల వరకూ విస్తరించిన ఇండోఆర్యన్ సంస్కృతుల, రాచరికాల మూలాలు కనిపిస్తాయి. వీటిని త్వరలో పరిశీలిద్దాం.
ముగింపు
సగరుని సమకాలీనుల చరిత్రలో, వైశాలిలో తుర్వసుల రాజ్యస్థాపన, దుష్యంతుని వృత్తాంతంలో భరతవంశపు తొలి రాచరికం వంటి ఇతివృత్తాలు ఎగువ గంగా మైదానానికి హరప్పా నాగరికత విస్తరణను సూచిస్తే, యాదవుల్లో భీమ, విదర్భ వంటి పేర్లలో, వింధ్యపర్వత ప్రాంతంలో క్రీపూ 2400 ప్రాంతంలో పుట్టిన హరప్పా స్థావరాల మూలాలను వెదకొచ్చు. మక్రాన్ తీరంలో, కచ్, కొంకణ్, సౌరాష్ట్ర తీరాల్లో కొత్తగా వెలసిన పరిణత హరప్పా రేవు పట్టణాలు సాగరంపై సగరుని ఆధిపత్యాన్ని సూచిస్తాయి. క్రీపూ. 2600లో 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కనిపించే భారతీయ కాంశ్యయుగ నాగరికత, క్రీపూ. 2400 నాటికి దాదాపు రెట్టింపై 9 లక్షల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. బాబిలోనియా ఫలకాల్లోని ఎన్‍మెర్కర్ కథలో అరట్ట రాజు అల్ సుగ్యుర్ (సగరుడు) సుమేరియా నగరాలను కప్పం కట్టమని ఆదేశించే వృత్తాంతం, మధ్య ఆసియాపై ఐక్ష్వాకుల ప్రభావాన్ని సూచిస్తుంది. పురాతత్వ శాస్త్రరీత్యా కూడా హరప్పా నాగరికతా క్షేత్రానికి వెలుపల ఇరాన్ పీఠభూమిలో, మధ్య ఆసియాలో ప్రత్యక్షమైన హరప్పా నాగరికతకు చెందిన వర్తక కేంద్రాలు, వాణిజ్యరంగంలో భారతీయుల వలస వ్యవస్థను సమర్ధిస్తాయి. భారతీయ ఇతిహాసంలో అత్యంత ఉత్కృష్టమైన త్రేతాయుగానికి చెందిన క్షత్రియ వంశనుక్రమణికల్లోని వివరాలు వచ్చే సంచికలో చూద్దాం. 
*


Thursday, December 10, 2015

IKSHVAKUS

మన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని
ఐక్ష్వాకులు
గత సంచికలో ఐల వంశపు తొలిరాజుల గాథలను వాస్తవిక కోణంలో చూసాం. మనువు సంతతిలో చంద్రవంశపు ఐలులు ఒక శాఖైతే సూర్యవంశానికి చెందిన ఐక్ష్వాకులు మరో ముఖ్య శాఖ. కృత, త్రేతాయుగాలకు చెందిన క్షత్రియ వంశావళుల్లో ఐలుల కంటే ఐక్ష్వాకులు ప్రముఖంగా కనిపిస్తారు. భారతీయ సంప్రదాయంలో ఐక్ష్వాకులకున్న ప్రతిష్ఠ అప్రతిమానం. మనువు నుంచి చారిత్రక యుగంలోని రాజుల వరకూ 130 తరాలు అవిచ్ఛిన్నంగా సాగిన వంశావళి. బౌద్ధ వాజ్ఞ్మయంలో ‘మహావంశ’ శాక్యులను కూడా ఐక్ష్వాకులుగా చూపుతుంది. శాక్యముని ‘ఒక్కాక’ (ఇక్ష్వాకు) అనే వంశనామంతో పిలువబడ్డాడు. ఐక్ష్వాకు వంశానికి చెందిన ఋషభుడు జైన సంప్రదాయంలో మొదటి తీర్థంకరుడు. అంతేగాదు, చారిత్రక యుగంలో శాతవాహనుల అనంతరం నాగార్జునికొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన శ్రీపర్వతీయులే గాక అనేక రాజవంశాలు కూడా ఐక్ష్వాకుల సంతతిగా చెప్పుకున్నారు.
ఐక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాలపై పురాణాలలో ఏకాభిప్రాయం లేదు. ‘ఇక్ష్వాకు’ అనే పేరును వివరించేందుకు అనేక కథలు అల్లబడ్డాయి. ప్రజాపతి తుమ్మితే అతడి ముక్కునుండి ఊడిపడ్డాడు కనుక ఇక్ష్వాకుడనే పేరు వచ్చిందని వాయుపురాణం చెప్పింది. ఇక్షు అంటే చెరుకు వెన్ను నుండి పుట్టాడు కనుక ఇక్ష్వాకుడనే నిరుక్తార్థం మరొకటి. భాషాపరంగా చూస్తే ఇక్ష్వాకు శబ్దం అన్యదేశంగా కనిపిస్తుంది. వంశావళుల్లో ఇక్ష్వాకుడు మనువు కుమారుడు, అయోధ్య, విదేహ రాజులకు మూలపురుషుడు. మన పర్జిటార్ పట్టికలోని కాలనిర్ణయాన్ని బట్టి అతడు క్రీపూ. 3134 అంటే హరప్పా తొలియుగానికి చెందుతాడు. ఇక్ష్వాకుని కొడుకు, వికుక్షి అయోధ్య రాజధానిగా పాలించిన తొలి ఏలిక. వశిష్టుడు వారి పురోహితుడు.
కృతయుగం తొలిదశలోని ఇక్ష్వాకుని నుంచి త్రేతాయుగాంతంలో దశరథుని వరకూ వశిష్టుడు 65 తరాల రాజులకు పురోహితుడిగా కనిపిస్తాడు. కోశాంబి మొదలైన చరిత్రకారులు వశిష్ట, విశ్వామిత్ర అనే పేర్లు వ్యక్తినామాలు గాక గోత్రనామాలనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ వశిష్టుడిని ఒకే వ్యక్తిగా గాక ఒక వ్యవస్థలోని గురుశిష్య పరంపరగా గుర్తించడం హేతుబద్ధం. ఆదిశంకరునిచే స్థాపించబడ్డ వివిధ పీఠాల నాయకులు శంకరాచార్యులగా పిలువబడటం ఈ సంప్రదాయానికి ఒక ఉదాహరణగా చూపవచ్చు. ఇతిహాసపురాణ సంప్రదాయం శుక్రాచార్యుడు, వశిష్టుడు, అగస్త్యుడు మొదలైన ఋషులను భార్గవులుగా సంబోధిస్తుంది. భార్గవులు అంటే భృగువు సంతతి. భృహత్-గవ పదబంధంలో ‘సుదూరప్రయాణం’ అనే నిరుక్తార్థం దాగివుంది. తొలితరాల ఐక్ష్వాకులు, ఋషుల పేర్లకు, కొన్ని సుమేరియా అక్కడియన్ మృణ్ఫలకాలలో లభ్యమైన పదాలకు మధ్య పోలికలను గతంలో కూడా ప్రస్తావించాము. (పట్టిక.) 
పై పట్టిక ఆధారంగా చూస్తే, ఐక్ష్వాకుల, వారి పురోహితులైన భార్గవుల సాంస్కృతిక వారసత్వం పశ్చిమాసియా నుంచి సంక్రమించినదేమో అనే అనుమానానికి తావులేకపోలేదు.
ఇక్ష్వాకుడు
సుమేరియాలో రాచరికపు ఆరంభానికి ముందు, నగరాల అధ్యక్షుడిని పాచికల ద్వారా ఎన్నుకొనే ఆచారం ఉండేది. ఆ విధంగా ఎన్నికైన అధికారి ‘లిమ్ము’ అని పిలువబడేవాడు, సుమేరియా దైవం ‘అను’ ప్రతినిధిగా పరిపాలించేవాడు. తరువాతి యుగంలో లిమ్ము రాచరికానికి పర్యాయపదంగా కనిపిస్తుంది. అదే ఆచారం అక్కడియన్ పాత రాజధానియైన అషుర్ నగరంలో కూడా ప్రాచుర్యంలో ఉండేది. అక్కడియన్ భాషలో నగరాధ్యక్షుని ‘ఇక్-శ్-శి-వా-క్-కుమ్’ అనే పేరుతో పిలిచారు. ఇక్-శ్-శి-వా-క్-కుమ్ అనే పదవికి అషుర్ యొక్క ప్రతినిధి అని అర్థం చెప్పబడింది. ఈ పదానికీ సంస్కృతంలోని ఇక్ష్వాకు పదానికి ఉచ్ఛారణలో ఎంతో సామ్యం ఉంది. అక్కడియన్లు సుమేరియాను ఆక్రమించిన పిదప సుమేరియాలోని వివిధ నగరాల గవర్నర్‌లను ఎన్-శి-యాక్ అని పిలిచారు. కనుక సుమేరియాలో కూడా ఈ పదం అన్యదేశంగా భావించాల్సి వస్తుంది. హరప్పా, మెసొపొటేమియా సంస్కృతుల తొలి దశల్లో ప్రముఖంగా కనిపించే ఈ పదం ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలనే గాక, తొలిహరప్పా యుగంలో ఈ ప్రాంతాల మధ్య వారధిగా నిలిచిన ఈలం సాంస్కృతిక వారసత్వాన్ని కూడా సూచిస్తుంది. వేదవాజ్ఞ్మయంలోని అసురులకు, తొలి హరప్పాయుగానికి చెందిన అమ్రీ సంస్కృతికి గల సంబంధాన్ని ముందు సంచికలో వివరించాము. ఋగ్వేదంలో ఇక్ష్వాకు పదం ఒకేసారి కనిపిస్తుంది. అదికూడా ఇక్ష్వాకులు అనే అర్థంతో ఒక వంశానికి ప్రత్యామ్నాయంగా వాడబడింది. కనుక ఇక్ష్వాకుడు అసురుల విజయానంతరం వారిచే నియమించబడ్డ గవర్నర్‍గా భావించవచ్చు. ఇక్ష్వాకుడి పేరుకు ఒక అర్థం చేకూర్చేందుకు అల్లిన పుక్కిటి పురాణాల్లోని జన్మవృత్తాంతాలు, ఈ వాదానికి మరింత బలం చేకూరుస్తాయి.
కానీ ఐక్ష్వాకుల ప్రాబల్యంతో బాటూ సమకాలీనంగా ఎదిగి హరప్పా నాగరికతా క్షేత్రమంతటా ప్రముఖంగా కనిపించే ‘కోట్‍దిజి’ సంస్కృతి నిర్ద్వంద్వంగా స్థానిక సంస్కృతే. భౌగోళికంగా ఇతిహాసపురాణ సంప్రదాయంలోని ఐక్ష్వకుల రాజ్యం కోట్‍దిజి సంస్కృతి విస్తరించిన ప్రాంతానికి సరితూగుతుంది. అంతేగాక పురాణాలు, ఇక్ష్వాకుడికి వైవస్వత మనువు వారసత్వం ఆపాదించడం కూడా వారు స్థానిక రాజవంశంగా ఎదగడాన్ని సూచిస్తుంది. ఐక్ష్వాకుల రాజ్యపు పునాదుల్లో వారిపై అసుర ఆధిపత్యం సూచించబడినా, తొలి తరాల్లోనే వారు స్థానిక సాంస్కృతిక సమ్మేళనంలో విలీనమై స్వతంత్రించినట్లు కనిపిస్తుంది. ఇక్ష్వాకుడి నుంచి పృధువు వరకూ గల ఐదు తరాల రాజుల గాథలు ఈ పరిణామాన్నే చూపుతాయి.
ఆనాటి సంప్రదాయక నేపధ్యంలో వచ్చిన మార్పే ఈ పరిణామానికి కీలకం. ఇక్ష్వాకుల వలెనే వైదిక సంప్రదాయంలోని తొలి ఋషుల మూలాల్లో కూడా కొంత మెసొపొటేమియా సంస్కృతుల ప్రభావం ఉంది. ఆ మార్పుకు కారణాలు, సంప్రదాయంలోని చారిత్రక వాస్తవాలు, వివరించే ముందు, వైదిక వాజ్ఞ్మయంలోని తొలి ఋషి పరంపరల మూలాలపై ఒకసారి దృష్టి సారించడం అవసరం.
భార్గవులు
పురాణాల్లోని పట్టికల్లో సప్తమహర్షుల, ప్రజాపతుల పేర్లలో కొన్ని తేడాలున్నా, తొలి ఋషుల విషయంలో ఏకాభిప్రాయం ఉంది. మరీచి, కశ్యప, క్రతు, పులహులు కొన్ని స్థానిక జనజాతుల మూల పురుషులు. అత్రి, భృగువు, అంగీరసులు వివిధ బ్రాహ్మణ పరంపరలకు ఆద్యులుగా కనిపిస్తారు. వీరిలో అంగీరసులు, వారి వారసులైన భారధ్వాజుల మూలాల్లో అన్యదేశ ప్రభావం కనిపించదు. అయితే, భార్గవులుగా పిలువబడ్డ తొలి ఋషుల పేర్లలోనే గాక వారి కథలలో కూడా అసుర సంస్కృతి నేపధ్యం తెలుస్తుంది. వివిధ ఋషిపరంపరల మధ్య వారసత్వ, వైవాహిక సంబంధాల బ్రహ్మముడులు విడదీసి వివరించడం ప్రస్తుత చర్చకు అనావశ్యకమే గాక, అసాధ్యం కూడా. తొలి ఋషులకూ స్థూలంగా వారి పారంపరిక వారసత్వాలను సూచించే పటం మాత్రం అందిస్తున్నాం. (పటం.)
మెసొపొటేమియా తవ్వకాల్లో ప్రతి నగరానికీ ఒక దేవుడు, జిగ్గురాట్ అనబడే మానవ నిర్మితమైన శిఖరం, దానిపై దేవాలయం వెలుగుచూసాయి. నగర, సామాజిక ఆర్థిక వ్యవస్థకి ఈ దేవాలయాలు జీవగర్రలుగా  పనిచేసాయి. అటువంటి దేవాలయాల ప్రధానాధికారిని అక్కడి భాషల్లో ‘అబర్రాకు’ లేదా ‘ఆబ్రిగ్’ అని పిలిచారు. మతపరమైన విషయాలలోనే గాక పాలనలో రాజుకు ముఖ్య సలహాదారుగా ఉండేవాడు. మెసొపొటేమియాలోని ఈ వ్యవస్థకు, వైదిక సంస్కృతిలోని రాజన్య-పురోహిత సంప్రదాయానికి సామ్యం గోచరిస్తుంది. మెసొపొటేమియాలోని ‘అబర్రాకు’ను, మన వాజ్ఞ్మయంలో భృగువుగా, అసురులకు గురువులైన భార్గవులుగా చూస్తాం. భార్గవులలో ముఖ్యుడైన శుక్రాచార్యునికి, అంగీరసుడి సంతతిలోని బృహస్పతికి మధ్య వైరం, స్థానిక సంప్రదాయాలకు, అసుర వ్యవస్థకు మధ్య వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. సాంప్రదాయకంగా ఆంగీరస, భారధ్వాజ పరంపరలు, ఐల వంశపు రాజులకు పురోహితులు. అంటే వారు ఎగువ సరస్వతీ తీరంలో, హక్రా సంస్కృతి నేపధ్యానికి, భార్గవులు అసురులకు పురోహితులుగా అంటే సింధ్, గుజరాత్ ప్రాంతాల్లోని అమ్రీ సంస్కృతి నేపధ్యానికి చెందినవారుగా భావించవచ్చు. అయితే, భార్గవులుగా పిలువబడినా, అయోధ్య పురోహితులైన వశిష్టులకూ, అసుర గురువులైన భార్గవులకూ కొన్ని మౌలికమైన తేడాలున్నాయి.
వశిష్టుడు
వశిష్టులలో ఆద్యుడైన మైత్రావరుణి కథలో, వశిష్టుడి జన్మవృత్తాంతం పరిశీలిస్తే వారి మూలాలపై కొంత అవగాహనకు అవకాశం ఉంది. మిత్రవరుణులు ఒకానొకప్పుడు అప్సర ఊర్వశిని చూసి కామోద్రేకానికి లోనై తమ శుక్లాన్ని జారవిడుచుకొన్నారట. ఆ శుక్లం అనేక ప్రదేశాల్లో పడింది. నేలపై బడ్డ శుక్లం నుండి వశిష్టుడు, కలశంలో పడిన బిందువు నుండి జానెడు శిశువుగా అగస్త్యుడు పుట్టారు. వశిష్టుడు భూతలానికి రాజులైన ఐక్ష్వాకులకు పురోహితుడైతే, అగస్త్యుడు సముద్ర తీరప్రాంతాలకు వలస పోయాడు. ఆవిధంగా అగస్త్యుడూ, వశిష్టుడూ తోడబుట్టినవారయ్యారు, మైత్రావరుణి, ఔర్వశీయ అనే పేర్లు ఇద్దరికీ చెందుతాయి. వరుణుడి మరోపేరు అసురుడు అని ముందే చెప్పుకున్నాం. పురాణాల్లో నరనారాయణుల వలెనే ఋగ్వేదంలో మిత్రవరుణుల జంట ఎన్నోసార్లు ప్రస్తావించబడింది. ఋగ్వేదంలో మొదట్లో ఎంతో ప్రాముఖ్యత గల్గిన మిత్రవరుణులు కాలక్రమేణా మలివేదాల్లో, పురాణాల్లో పక్కవాద్యాలకే పరిమితమయ్యారు. అయితే, అదే ప్రాచీన మూలాలనుండి విడివడిన జొరాస్ట్రియన్ సంప్రదాయంలో మిత్రవరుణులు ముఖ్యపాత్రలో కనిపిస్తారు. కనుక వశిష్టుని మూలాలు అసుర వ్యవస్థలో వెదకాలి.
అక్కడియన్ భాషలో ‘ప-శి-శు-టు’ పదానికి తెల్లని పదార్థాలకు, చరాస్తులకు సంబంధించిన దేవాలయాధికారి అనే అర్థం ఉంది. పురాణాల్లోని వశిష్టునికి కూడా పశుసంపదతో సంబంధం ఉంది. తొలి ఆర్యసంస్కృతిలో గోవు ముఖ్యమైన చరాస్తి అనే విషయం తెలిసిందే. పేరు మాత్రమే ఆధారంగా వశిష్టుని మూలాలు నిరూపించజాలము గానీ, ఋగ్వేదంలోని మరో కథ (ఋ. IV. 121) కూడా వశిష్టుని మూలాలను పశ్చిమాసియాలోని ఈలం ప్రాంతంగా సూచిస్తుంది:
‘మూడు రోజుల ఉపవాసంతో ఆకలిని తాళలేక ‘సుసా’ నగరంలోని వరుణుని ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించాడు. ఆ సువర్ణమయమైన ఆలయానికి కావలిగా ఒక భయానకమైన కుక్క అతడిని గమనించి అరవసాగింది. వశిష్టుడు తన మంత్రోచ్చారణతో ఆ కుక్కని నిదురింపజేసి ఆహారాన్ని తీసుకొన్నాడు. ఈనాటికీ ఆ మంత్రం కన్నపు దొంగలకు తప్పక పఠించదగినది.’
‘సుసా’ నగరం, ఇరాన్ తీరప్రాంతంలోని ఈలంకు ముఖ్యపట్టణం. ఈలమైట్ భాషలకూ, ఇండియాలోని ద్రవిడ భాషలకూ కొన్ని మౌలికమైన పోలికలున్నాయని ముందు చెప్పుకున్నాం. తొలి హరప్పా యుగానికి చెందిన అమ్రీ సంస్కృతిపై ఈలం సంస్కృతితో సంబంధాలు కూడా ప్రస్తావించాం. పై కథ వశిష్ట పరంపరకి, ఈలమైట్ ప్రాంతానికి ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. అంతేగాక, వశిష్టుని తోడబుట్టిన అగస్త్యుడికి, ద్రవిడ భాషలకూ ఉన్న సంబంధం కూడా గమనించదగ్గది. భార్గవులు అసురుల పురోహితులుగా ముందే చెప్పుకున్నాం. పురాణాలు అగస్త్య, వశిష్టులను కూడా భార్గవులుగా సంబోధించాయి. పైన చూపిన వృత్తాంతాలను బట్టి, వశిష్టులు ముందు అసుర (భార్గవ) సంప్రదాయనికి చెంది, అసుర ప్రతినిధులైన ఐక్ష్వాకులకు పురోహితులయ్యారు అని వాదించవచ్చు. ఐక్ష్వాకుల పెరుగుదలలో వారి పురోహితులైన వశిష్టుల ప్రమేయం కానవస్తుంది. ఆ తొలి తరాల రాజుల కథలు వారికీ వశిష్టునికీ మధ్య భేదాభిప్రాయాలనూ, తదుపరి తరాల్లో వశిష్టుల ఆధ్వర్యంలోని ఐక్ష్వాకులకు, అసురులకూ మధ్య వైరాన్నీ, భార్గవులపై వశిష్టుల తిరుగుబాటును సూచిస్తాయి. పైన ఉదహరించిన దొంగతనం కథ కూడా వశిష్టుడు వరుణుడి (అసురుడు) సంప్రదాయం నుంచి వేరుపడటానికి నిదర్శనంగా చూపవచ్చు.
రాజ్య విస్తరణ
వశిష్టుని ఉనికితో సంబంధమున్న పరుష్ణీ, సరయూ నదులకూ నేటి పంజాబ్‍లోని రావినదికీ, ఆ నదీ తీరంలోని హరియూప, అయోధ్యలకూ, నేడు వెలుగు చూసిన హరప్పా శిధిల నగరంతో ఉన్న సంబంధాన్ని ముందు సంచికలో వివరించాము. అయోధ్య తొలి రాజుల చరిత్రను పరిశీలించే ముందు, హరప్పా తవ్వకాల్లోని పురాతత్వ స్తరాలపై మరొకసారి దృష్టి పెడదాం. ప్రాగ్‍హరప్పా స్తరాల్లో పంజాబ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న హక్రా సంస్కృతి క్రీపూ. 3100 కి ఎగువ సరస్వతీ మైదానాలకు పరిమితవడం, అసురుల విజయం అనే వృత్తాంతం, ఆ పిమ్మట వచ్చిన రాజకీయ పరిణామాల ద్వారా వివరించాము. అసురులచే నియమించబడిన ఇక్ష్వాకుని రాజధాని అయోధ్యలో (హరప్పా) క్రీపూ. 3200 ప్రాంతంలో మొదలైన కోట్‍దిజి సంస్కృతి, మరో శతాబ్దానికి నాగరికతా క్షేత్రమంతటా విస్తరించడం, ఐక్ష్వాకుల రాజ్యవిస్తరణను సూచిస్తుంది. ఈ ప్రక్రియలో రెండు నిర్దిష్టమైన కోణాలను పర్జిటార్ పట్టికలోని తొలి రాజుల కథలు సూచిస్తాయి.
1)   ఐక్ష్వాకులలో అంతః కలహాలు.
2)  ఐల వంశపు రాజుల వలసలు.
పురాణాలు ఇక్ష్వాకునికి నూర్గురు కొడుకులని చెబుతాయి. వారిలో అయోధ్యా నగర నిర్మాతగా పేరుగన్న ‘వికుక్షి’, మిథిలా నగరంలో మరో సూర్యవంశపు శాఖకు మూలపురుషుడైన ‘నిమి’ ముఖ్యులు. వికుక్షి మరోపేరు శశాదుడు. తండ్రి ఆజ్ఞానుసారం వశిష్టుని యాగానికి సామగ్రి సమకూర్చే విషయంలో వచ్చిన వివాదం వలన రాజ్యం నుంచి వెలివేయబడుతాడు. ఆ విధంగా ప్రవాసంలో సరయూ తీరంలో అయోధ్యని స్థాపించి, తండ్రి అనంతరం అధికారంలోకి వచ్చాడు. ఈ సంఘటనలో, అనాటి సమాజంలోని సంప్రదాయక విబేధాలను చూచాయగా చూడవచ్చు. వికుక్షి కుమారుడు కాకుత్స్థుడు. ఇతడు ఇంద్రుని వాహనంగా చేసుకొన్నాడు. ఇది వైదిక సాంప్రదాయక వర్గాలతో స్పర్థను తెలియజేస్తుంది. ఈ తండ్రీకొడుకులకు వశిష్టుడు పురోహితుడుగా కనిపించడు. ఈ గాథల్లో ఇక్ష్వాకుని సంతతి మొదటి తరంలో వైదిక పద్ధతుల పట్ల వ్యతిరేకతనూ, వారి పురోహితుడు వశిష్టునిలో స్థానిక సంప్రదాయం పట్ల మొగ్గునూ చూడవచ్చు. ఈ సంఘటనలు, స్థానిక జనజాతులను తమవైపు తిప్పుకొనేందుకు వశిష్టుని ప్రయత్నాన్ని సూచిస్తాయి.
రాజ-పురోహితుల మధ్య విబేధాలకు పరాకాష్ట ఋగ్వేదంలోని ‘వేనుడి’ కథ. వంశానుక్రమణికల్లో కాకుత్స్థుని పిమ్మట అనేనుడు, అనేనుడి తరువాత పృథువు, రాజ్యానికి వచ్చారనే విషయంలో పురాణాలన్నింటిలో ఏకాభిప్రాయం ఉంది. ‘పృథువైన్య’ అంటే వేనుడి కొడుకైన పృథువు అని ఋగ్వేదం చెబుతుంది. కనుక కాకుత్స్థుని కొడుకు అనేనుడే, వేనుడు అని అంగీకరించాలి.
వేనుడి కథ మన సంస్కృతిలో హత్యా రాజకీయాలకు (coup de etat)  మొట్టమొదటి ఉదాహరణ. వేనుడు అధార్మికుడు, యజ్ఞయాగాదులందు విముఖుడు. గత్యంతరంలేని పరిస్థితుల్లో ఋషులు, రాజును హత్య చేస్తారు. అతడి మరణాంతరం వేనుడి కళేబరపు భుజంనుండి పుట్టిన పృథువును రాజ్యాభిషిక్తుని చేస్తారు.
పృథువు మొట్టమొదటి సారిగా వైదిక సంప్రదాయానుసారం రాజ్యాభిషిక్తుడైన రాజు. ఋగ్వేదంలోని సూక్తం పరుష్ణి నదిని గోవుగా, మనువు సంతానాన్ని లేగదూడగా, భూమిని క్షీరపాత్రగా వర్ణిస్తుంది. పృథువు మనువు అనే లేగదూడకై, పరుష్ణి అనే గోవును పితికి, భూమి అనే పాత్రను నింపాడని, దానిలో వ్యవసాయం, ధాన్యం సృజించాడని ఆ సూక్తం సారాంశం. పృథువుచే ‘పాలిం’పబడ్డ భూమి పృథ్వి అయింది, పృథువు సమస్త భూమండలానికి మొట్టమొదటి చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తిగా వశిష్టుడి ఆధ్వర్యంలో 99 అశ్వమేధయాగాలు చేసి రాజ్యాన్ని విస్తరిస్తాడు. ఈ ప్రక్రియలో ఆంగీరస ఋషులు కూడా పృథువు పక్షం వహిస్తారు. నూరవ యాగంలో ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి అతడితో యుద్ధానికి తలపడుతాడు. ఆ యుద్ధంలో విజయం పృథువునే వరిస్తుంది. ఈ సంఘటన నేపధ్యం ఐల వంశీయుల చరిత్రలో తేటతెల్లంగా కనిపిస్తుంది.
పర్జిటర్ పట్టికల ప్రకారం, ఐల వంశపు రాజు ‘యయాతి’, ఐక్ష్వాకులలో ‘పృథువు’ సమకాలీనులు. (పటం.) బృహస్పతితో వైరం, ఆ పిమ్మట అసురులతో వియ్యమొందడం యయాతి, అతడి పూర్వుల చరిత్రలో అంతర్లీనంగా కనిపించే అంశాలు. యయాతి తండ్రి నహుషుని చరిత్రలో ఇంద్రత్వాన్ని ఆశించి స్వర్గం నుండి బహిష్కరించబడే వృత్తాంతం, ఐలుల వెనుకంజకి తార్కాణంగా కనిపిస్తుంది. అతడి ఐదుగురు కొడుకుల్లో నలుగురు (ద్రుహ్యువు, తుర్వసుడు, అనువు, యదువు) దేశబహిష్కృతులై దూర ప్రాంతాలకు వలస పోవడం ఐల వంశీయుల ఆధిపత్యం క్షీణించడానికి నిదర్శనం. వారిలో పురువు ఒక్కడే సరస్వతీ మైదానంలో రాజ్యం కొనసాగించాడు. ఋగ్వేదంలో అతడి రాజ్యం పృథ్వీభాగంగా పేర్కొనబడింది. అంటే అతడు ఇక్ష్వాకుల సామంతుడిగా రాజ్యం చేసినట్లు ఊహించవచ్చు.
ముగింపు
మనువు సంతతిలోని తొలిరాజుల చరిత్రలు హరప్పా నాగరికత శైశవదశను సూచిస్తాయి. హరప్పా నాగరికత తొలి స్తరాల్లోని పురాతత్వ సంస్కృతుల్లో వచ్చిన మార్పులు ఐక్ష్వాకుల రాజ్యవిస్తరణకు, అసురుల ప్రాభవానికి, ఐల వంశపు క్షీణతకూ అద్దంపడతాయి. ఐక్ష్వాకులు స్థిరపడేందుకు ఐల వంశంపై ఆధిక్యతే గాక స్థానిక సాంప్రదాయిక శక్తుల తోడ్పాటు కూడా ముఖ్య కారణం. అడపాతడపా ధుంధుని వంటి ఐల వంశస్థులు ఎదురు తిరిగినా ఆ తిరుగుబాట్లు సులభంగానే అణచి వేయబడ్డాయి. పురువు తరువాత 6వ తరం రాజు ధుంధునిపై (క్రీపూ. 2936-18) కువలాశ్వుని (ధుంధుమారుడు) విజయం, అందుకు వరుణుడి తోడ్పాటు, మరికొన్ని తరాల వరకూ సాగిన అసురుల ప్రాభవాన్ని తెలియజేస్తుంది. వేద వాజ్ఞ్మయంలోని సంఘటనలు, పురాణ సంప్రదాయంలోని గాథలూ, ఆ మూడు సంస్కృతుల మధ్య పరస్పర స్పర్థలే గాక సహకారాన్ని కూడా సూచిస్తాయి.
క్రీపూ. 3000 నాటి పురాతత్వ ఆధారాలనుబట్టి హరప్పా క్షేత్రానికి, పశ్చిమాసియా ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు బలపడసాగాయి. ఇరాన్ పీఠభూమిలో, మధ్య ఆసియాలో, మక్రాన్, గుజరాత్ తీరాల్లో సరికొత్త హరప్పా నాగరికతకు చెందిన వాణిజ్య కేంద్రాలు వెలిసాయి. పెద్ద నగరాల నిర్మాణం ఊపందుకుంది. క్రీపూ. 2900 ప్రాంతంలో మొహెంజొదారో (కశుడు-కాశి) నిర్మాణం మొదలైంది. చేతివృత్తులలో కొత్త మెలకువలు, విలాస వస్తువులు, ఆట బొమ్మలు, గృహనిర్మాణానికి కాల్చిన ఇటుకల వాడకం, నగరాల్లో సామాన్యుల గృహాలకు కొంత ఎగువగా భారీ కట్టడాలతో ‘సిటడల్‍’ల నిర్మాణం, నూతన పాలకవర్గ వ్యవస్థని సూచిస్తాయి.
అయితే ఇతర ప్రాచీన నాగరికతలతో పోలిస్తే, హరప్పా క్షేత్రంలో వెండి, బంగారం వంటి విలువైన లోహాల వాడుక తక్కువ. చేతివృత్తుల్లో, వస్తు సముదాయంలో, ఎగుమతుల్లో ప్రగతి కనిపించినా, ఆ ఉత్పత్తులకు తగిన ప్రతిఫలం సామాన్య ప్రజలకు అందినట్లు కనపడదు. ఇది ఉత్పత్తిని దోచుకునే నిర్బంధ పాలనా వ్యవస్థను (Coercive Regime) సూచిస్తుంది.
అసురుల దోపిడీ విధానాన్ని స్ఫురింపజేసే కథలు వాజ్ఞ్మయంలో కోకొల్లలు. స్థానిక శక్తుల సహకారంతో ఎదిగిన ఐక్ష్వాకులకూ, ఈ దోపిడీ విధానానికీ మధ్య వైరం అనివార్యమయింది. అసుర వ్యవస్థపై తిరుగుబాటుకు స్థానిక రాచరికాలను సమీకరించడం తప్పనిసరి. ఈ ప్రక్రియను వివరించే గాథలను వచ్చే సంచికలో చూద్దాం. 
*