Monday, January 25, 2016

Deva Asura Conflictsమన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని
దేవాసురయుద్ధం

గత సంచికలో తొలి హరప్పా యుగారంభంలో ఐక్ష్వాకుల రాజ్యవిస్తరణ ప్రక్రియని పురాతత్వ కోట్‍దిజి సంస్కృతి నేపధ్యంలో పరిశీలించాం. భౌగోళికంగా సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్లు, ప్రపంచంలోనే అతిపెద్ద పురాతత్వ సాంస్కృతిక స్తరంగా విస్తరించిన కోట్‍దిజి సంస్కృతిలో, సామాన్యుల జీవన విధానంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనుపించదు. ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినా వాటికి తగిన ప్రతిఫలం కింది వర్గాల ప్రజలకు అందలేదని అనుమానించక తప్పదు. అసురుల అసమాన వాణిజ్య వ్యవస్థ దీనికి ముఖ్యకారణం.
క్రీపూ. 2900 నాటికి స్థానిక మేధావి వర్గంలో ఈ వ్యవస్థ పట్ల నిరసన ఉద్యమరూపం దాల్చింది. ఆ ఉద్యమానికి నడుంకట్టిన ప్రజాసమూహం తమని తాము దేవుళ్లు (దివి వాస్తవ్యులు), అంటే స్థానికులుగా పిలుచుకొన్నారు. వారి నాయక స్థానంలో ధ్వజ చిహ్నంగా ఒక కొత్త శక్తి ఉదయించింది. అనాటి సమకాలీన మెసొపొటేమియాలోని మర్దుక్వలెనే ఇతడు కూడా ఒక కొత్త దేవుడు. సుమేరియా తొలి సంప్రదాయంలోని అను’, ‘ఎల్వంటి దైవాలు, మన సంప్రదాయంలో వరుణుడు, ద్యస్సుల వలె పితృ చిహ్నాలైతే, ‘మర్దుక్’, ‘బాల్వంటి కొత్తతరానికి చెందిన దైవాలు దేవుని కుమారులు’ (Sons of God). ప్రాచీన నాగరికలన్నింటిలో ఈ కొత్తతరం దైవాలు, యుద్ధానికి, వీరత్వానికి చిహ్నాలుగా నిలిచారు. మన సంప్రదాయంలో అగ్ని (సూర్యుడు), ఇంద్రుడు, ఆదిత్యులు, స్కంథుడు అదే కోవకి చెందుతారు. వేదవాజ్ఞ్మయంలో దాదాపు ముప్పాతిక వంతు ఈ కోవకు చెందిన దేవుళ్లకే కేటాయించబడింది. ఇది ప్రాచీన నాగరికతలో సంభవించిన అతిముఖ్య పరిణామాన్ని సూచిస్తుంది.
వేదాల్లో ఇంద్రునికి విరోధులైన అసురులతో బాటు, దాస, దశ్యు, పణ్య మొదలైన జాతినామాలు ప్రముఖంగా కనిపిస్తాయి. ముందు సంచికల్లో అమ్రీ సంస్కృతిని అసురుల ఆధిపత్యానికి కేంద్రంగా ఊహించడం జరిగింది. వాజ్ఞ్మయంలోని ఆధారాలతో తొలి హరప్పాయుగంలోని అమ్రీ సంస్కృతి ప్రాంతంలోని సామాజిక నేపధ్యాన్ని మరోసారి పరిశీలించడం అవసరం. మ్యాక్స్ మ్యూల్లర్ వంటి చరిత్రకారులు, దాసదశ్యులను, ఆర్యుల దండయాత్రల్లో అణిచివేయబడ్డ స్థానిక జనజాతులుగా సిద్ధాంతీకరించారు. ఆర్యుల దండయాత్ర అనే సిద్ధాంతం అవాస్తవమైనా, వారి సూచనలో కొంత నిజం లేకపోలేదు. ఇంద్రుని నాయకత్వంలోని దేవతల దాడులకు బలియైన వారిలో దాసులు, దశ్యులు అనే జనజాతులు ముఖ్యమైనవిగా వాజ్ఞ్మయం కోడైకూస్తుంది. మరి ఈ దాసదశ్యులు ఎవరు? వీరికీ అసురులకూ ఉన్న సంబంధం ఏమిటి? వాజ్ఞ్మయంలో ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు దొరకవు. కానీ కొన్ని ఊహలకు అవకాశం ఉంది. ఉదాహరణకి, ఋగ్వేదంలోని ఆరవ మండలంలోని (VI.10..4-13) సూక్తం, ఇంద్రునిచే వధించబడ్ద అనేకమంది దాసదశ్యుల పేర్లను వివరిస్తుంది. వీరందరినీ సాయనాచార్యుడు అసురులుగా సంబోధించాడు. .V.29.9 లోని దశ్యూనసురాన్అనే పదబంధానికి భాష్యం చెబుతూ దశ్యులే అసురులనితీర్మానించాడు. మహాభారత కాలానికి దశ్యు, దాస అనే పదాలు అసురపదానికి పర్యాయాలుగా వాడబడ్డాయి. ఋగ్వేదంలో దాస దశ్యులుగా పిలువబడ్డ అసురుల పేర్లు కొన్ని పట్టికలో చూడవచ్చు. (పట్టిక) ఇది దాసదశ్యులు అసుర సామాజిక వ్యవస్థలో భాగస్వాములనే ఊహను బలపరుస్తుంది.
దాసులు: దాస, దాశ పదాలు నదీ పరివాహక ప్రదేశాల్లో నీటిపై ఆధారపడిన జీవన వ్యవస్థను సూచిస్తాయి. నదీజలాలు, పడవలు, బల్లకట్లు, చేపలవేట, ఆనకట్టలు, కాలువలు, సరస్సులు వీరి వర్ణనల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. పై పట్టికలోని అసురులను దాసులుగా సంబోధించడం, అసురులకూ, నదీ పరివాహక క్షేత్రానికీ ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. దాసుడు అనే పదానికున్న బానిస లేదా సేవకుడు అనే అర్థంలో, అసురుల పరాజయం తరువాత వారి ఆశ్రిత జాతుల హోదాలో వచ్చిన మార్పును ఊహించవచ్చు.
దశ్యులు: భాషా శాస్త్రం ప్రకారం, దశ్యు పదానికి, ఇతర ఇండోయూరోపియన్ భాషల్లోని ద్రక్మ, దచావ్ (Drachma, Dachau) పదాలకూ సామ్యం ఉంది. సంస్కృతంలోని  గ్రామ, దమ (ఇల్లు) పదాలకు మూలాలను, దశ్యు పదంలో వెదకవచ్చు. కనుక దశ్యులు అసుర నేపధ్యానికి చెందిన గ్రామీణ వ్యావసాయిక జనజాతులనే ఊహకు అవకాశముంది.
పణ్యులు: డి. డి. కోశాంబి వంటి చరిత్రకారులు, నేటి వణిజ’, ‘బనియాపదాలకు పణి లేదా పణ్య పదమే మూలమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బలిజ అనే తెలుగు జాతినామానికి కూడా అదే నిరుక్తార్థం. ఋగ్వేదంలో పణ్యులు వర్తకులుగా, వడ్డీ వ్యాపారులుగా, ధనికులుగా, పిసినారులుగా వర్ణించబడ్డారు. పణం, పెన్నీ (Penny) వంటి నాణాలకూ, పణం (తాకట్టు, జూదంలో ఒడ్డు) పాన్ (Pawn) వంటి పదాలకు కూడా మూలమదే. ప్రాచీన ఐరోపా, మధ్యఅసియా దేశాల్లో, వర్తకానికీ సముద్రయానానికి పేరెన్నిక గన్న Phoenician జాతులకు, పణి పదానికి ఉన్న సామ్యం గుర్తించదగినదే. కనుక పణ్యులు వాణిజులుగా, అసుర వ్యవస్థపై ఆధారపడి వారికి సహాయ సహకారాలు అందించిన జనజాతిగా భావించవచ్చు.
పురాణాల్లోని కృత, త్రేతాయుగాల రాజుల కథల్లో ప్రముఖంగా కనిపించే దేవాసుర సంగ్రామాల్లో, పై జాతులు అసురుల పక్షం వహించినట్లు కానవస్తుంది. మన పర్జిటార్ పట్టికలో క్రీపూ 2900 - 2500 మధ్య ఐక్ష్వాకుల చరిత్రల్లో ఈ దేవాసురుల స్పర్థ ముఖ్యాంశం. దీనిలో మూడు నిర్దిష్టమైన పరిణామ దశలు కనిపిస్తాయి.
1)   స్థానిక శక్తుల సమీకరణ, అసురుల పరాజయం
2)   ప్రాంతీయ తిరుగుబాట్లు, రాజకీయ అనిశ్చిత పరిస్థితి
3)   ఐక్ష్వాకుల ఆధిపత్యం, అసురుల వలసలు
దాదాపు ఐదొందల యేళ్లు సాగిన ఈ దేవాసురుల స్పర్థ, వైదిక వాజ్ఞ్మయంలోనేగాక. హిందూ సంప్రదాయంలోని అనేక గాథల్లో, అద్భుతాల్లో, అవతారాల్లోనూ, ఆనాటి వాస్తవ చారిత్రక సంఘటనల నేపధ్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సంస్కృత భాషలో మనకు అందుబాటులో ఉన్న వేదాల సంకలనం, ఆదిపురాణం మహాభారత యుద్ధకాలం అంటే క్రీపూ. 1500 కాలానికి చెందినవి. మిగిలిన వైదిక, ఇతిహాస పురాణ సంప్రదాయం ఆ తరువాత రచింపబడింది. అంటే, కృత త్రేతాయుగాలుగా వర్ణింపబడ్డ కాలంలోని వాస్తవ సంఘటనలకు, మనకి లభిస్తున్న వాజ్ఞ్మయంలోని వర్ణనలకూ మధ్య వెయ్యి సంవత్సరాలకు పైగా అంతరం ఉంది. భాషలో, మతంలో, ఆర్థిక సామాజిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల, వ్యక్తుల కథల్లో సంఘటనల వర్ణనల్లో మార్పు చేర్పులు ఉండటం అనివార్యం. కనుక వాజ్ఞ్మయమే ఆధారంగా మనం చేసే పరిశీలనలో ఆనాటి వ్యక్తులూ వారి కథలే చరిత్రగా భావించక, ఆ గాథల్లో దాగివున్న నేపధ్యాన్ని, ఆ నేపధ్యంలో ఏర్పడ్డ సామాజిక, రాజకీయ, సంప్రదాయక పరిణామాలపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం.

స్థానిక శక్తుల సమీకరణం, అసురుల పరాజయం
క్రీపూ. 2800 నాటికి అయోధ్యలో ఐక్ష్వాకులు ప్రముఖ రాజకీయ శక్తిగా ఎదిగారు. ఎగువ సరస్వతి మైదానంలోని ప్రతిష్ఠానంలో పౌరవుల ముఖ్య శాఖ ఉంటే, మరో రెండు కాశీ, కన్యాకుబ్జాల్లో స్థానిక రాచరికాలుగా కనిపిస్తాయి. దిగువ సింధు, గుజరాత్ ప్రాంతాల్లో యాదవులవి రెండు శాఖలు, వీరిలో కోష్టువు సంతతి ముఖ్యమైనదైతే, హైహేయులు మరో శాఖ. అసురులకు ప్రత్యామ్నాయంగా పెరిగేందుకు ఐక్ష్వాకులకు ఈ స్థానిక రాచరికాలను కూడగట్టుకోక తప్పలేదు. ఆనాటి సమకాలీన రాజవంశాల మధ్య వైవాహిక సంబంధాలు, ఐక్ష్వాకులు ఆ దిశలో చేసిన ప్రయత్నాలను ఎత్తిచూపుతాయి. (పటం.)
పురాణాల్లో ప్రసేనజిత్తు (క్రీపూ. 2828) కుమారుడు యువనాశ్వుడి భార్య పేరు గౌరి, వారి కుమారుడు మాంధాత. పౌరవ వంశంలో మతినారుడి కుమార్తె గౌరియే మాంధాత తల్లి. ఇది పౌరవుల ముఖ్య శాఖకి, ఐక్ష్వాకులకూ మధ్య రాజకీయ సమీకరణాలను తెలుపుతుంది. యాదవుల్లో చిత్రరథుని కుమారుడు శశబిందు కుమార్తె, బిందుమతి, మాంధాత భార్య అని సంప్రదాయం. అంటే తరువాతి తరంలో ఐక్ష్వాకులు యాదవులతో బాంధవ్యం నెరపారని తెలుస్తుంది. అంతేగాక కాన్యాకుబ్జులలో జహ్నువు అనే రాజు, యౌవనాశ్వుని (మాంధాత) మనుమరాలు, అంటే పురుకుత్సుని కుమార్తెను పెండ్లాడాడు. దేవాసురయుద్ధంలో మొదటి ఘట్టం - శుష్ణ, శంబరుల వృత్తాంతం పురుకుత్సుని కాలంలో (క్రీపూ. 2750) సంభవించింది. ఋగ్వేదంలో ఇంద్రుడు కుత్సుని కొరకు శుష్ణుడిని, దివోదాసుని కొరకు శంబరుడినీ సంహరించాడని నిర్ద్వంద్వంగా చెప్పబడింది. కనుక ఈ వైవాహిక సంబంధాలతో ఒనగూడిన రాజకీయ సమీకరణాలను, అసురులపై స్థానిక శక్తుల తిరుగుబాటు ప్రక్రియలో భాగంగా ఊహించవచ్చు.
ఈ రాజకీయ సమీకరణాలకు తోడుగా సంప్రదాయక వర్గాల్లో కూడా అసురుల పట్ల తిరుగుబాటు ధోరణిని సూచించే ఇతివృత్తాలు, సాహిత్యంలో కనిపిస్తాయి. సాంప్రదాయకంగా పౌరవుల పురోహితులైన ఆంగీరసులు, ఐక్ష్వాకుల పురోహితులైన వాశిష్టుల తోడుగా నిలిచారనేందుకు వాజ్ఞ్మయంలో ఆధారాలు ఉన్నాయి. మరోముఖ్యమైన పరిణామం, అసురుల పురోహితులైన భార్గవుల తిరుగుబాటు. కావ్య ఉశానుడు ఇంద్రునికి వజ్రాయుధం నిర్మించిన వృత్తాంతంలో, అసురులకు వ్యతిరేకంగా, భార్గవ ఋషులను చూస్తాం. కవి, ఉశానులు భార్గవులు, అసుర గురువులైన శుక్రాచార్యుని సంతతికి చెందినవారు. ఈ యుద్ధానికి కాశీ లేదా వారణాశి కేంద్రంగా కనిపిస్తుంది. క్షత్రియ సంప్రదాయంలోని కాశేయుల వృత్తాంతాలు ఆనాటి రాజకీయాల్లో నెలకొన్న ఆటుపోట్లను సూచిస్తాయి.

ప్రాంతీయ తిరుగుబాట్లు, రాజకీయ అనిశ్చిత స్థితి
తొలి తరాల్లో కాశీని పాలించిన రాజులు పౌరవులుగా కాక వారి దాయాదులుగా చెప్పుకొన్నట్లు తోస్తుంది. ఈ వంశానికి కశుడు (క్రీపూ. 2900) మూలపురుషుడు. అతడి పేరున నిర్మించబడ్డ నగరానికి కాశి అని పేరువచ్చింది. ఈ తేదీ మొహెంజొదారో తొలిదశను సూచించడం, ప్రాచీన మొహెంజొదారో నగరమే కాశీ అనే వాదనను బలపరుస్తుంది. కాశేయుల్లో ముఖ్యుడు దివోదాసుడు, పురుకుత్సుని సమకాలినుడు (క్రీపూ. 2750). శంబరాసురునిపై విజయంలో ఇతడికి పురుకుత్సుని సహాయ సహకారాలు అందాయి. శంబరుని నూరు పురాలపై (గ్రామాలు?) దివోదాసుడి గెలుపు దిగువ సరస్వతీ మైదానంలో మొహెంజొదారో ఆధిపత్యాన్ని సూచిస్తే, శుష్ణుని కదిలే నగరంపై (చరిష్ణు) కుత్సుని విజయం, అసురుల నౌకాదళంపై స్థానిక శక్తుల గెలుపుగా ఊహించాలి.
అయితే కాశేయుల ఆధిపత్యం ఎంతోకాలం సాగలేదు.
అసురుల పరాజయంతో ఏర్పడిన శూన్యతలో మరో కొత్త శక్తి పుట్టుకొచ్చింది. క్షేమకుడనే పుణ్యజన రాక్షసుల నాయకుని సహకారంతో, యాదవుల్లోని ఒక శాఖయైన హైహేయులు, దివోదాసుని పారద్రోలి కాశీపై ఆధిపత్యం సాధిస్తారు. రామాయణంలో బ్రహ్మ సముద్రజలాల రక్షణకై రాక్షసులను ప్రత్యేకంగా సృజించాడని చెప్పబడింది. ‘పుణ్యజన రాక్షసపదబంధంలో ప్యూనిక్ జాతులకు చెందిన నావికదళం అనే అర్థం ఊహించవచ్చు. పాణిని అష్టాధ్యాయిలో రాక్షసులను మూరదేవ, మూఢదేవ అనే పేర్లతో సంబోధించాడు. మూఢ, మూర్ద పదాలు, రాక్షసులకు అనాటి మెసొపొటేమియాలో ప్రాముఖ్యం ఉన్న మర్దుక్సంప్రదాయంతో సంబంధాన్ని సూచిస్తాయి. అసురులపై యుద్ధం శ్రమదోపిడీ వ్యవస్థపై స్థానికుల తిరుగుబాటు అనుకుంటే, హైహేయులకు రాక్షసుల సహకారం, వలసవాదుల ప్రతిచర్యగా భావించవచ్చు.
దివోదాసుని తరువాతి తరంతో కాశేయుల వంశం అంతరిస్తుంది. విదేహ వంశావళిలో కూడా ఈ కాలంలో తరాల మధ్య కొంత ఎడం కనబడుతుంది. పురుకుత్సుని కొడుకు త్రాసదశ్యుని (క్రీపూ. 2738) తరువాత త్రిశంకుని (క్రీపూ. 2600) వరకూ ఎనిమిది తరాల ఐక్ష్వాకుల్లో కూడా ప్రముఖులు కనపడరు. అంతేగాక త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, రోహితాశ్యుల కథల్లో అంతర్లీనంగా వినిపించే రాజ్యం కోల్పోవడం’, ‘దేశబహిష్కారంవంటి ఇతివృత్తాలు హైహేయుల ఆధిపత్యాన్ని, ఐక్ష్వాకుల బలహీనతనూ సూచిస్తాయి. ఈ హైహేయులలో ముఖ్యుడు కార్తవీర్యార్జునుడు (క్రీపూ. 2600). హైహేయుల ఆధిపత్యంపై ప్రతిఘటనలో ఆనాటి సాంప్రదాయక వర్గాలకు చెందిన విశ్వామిత్రుడు, భార్గవులలో ఔర్వుడు, జమదగ్ని, పరశురాముల పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. (పటం.)
హైహేయుల పతనంతో ఏర్పడిన ఐక్ష్వాకుల ఆధిపత్యం, నాగరికత ఉత్కృష్ట దశకి నాంది పలికింది. పురాతత్వ శాస్త్రం చూపే పరిణత హరప్పాయుగం, సంప్రదాయంలోని త్రేతాయుగాలు (క్రీపూ. 2600 - 2000) సామాన్య నాగరికుల జీవన వ్యవస్థలో వచ్చిన అద్వితీయమైన అభివృద్ధికి అద్దంపడతాయి. ఇది అసుర వ్యవస్థ అంతాన్ని, స్థానిక పాలనలో మెరుగైన ఉత్పత్తి-ప్రతిఫలాల నిష్పత్తిని సూచిస్తుంది.

ఐక్ష్వాకుల ఆధిపత్యం, అసురుల వలసలు
భారతీయ ఇతిహాసపురాణ వాజ్ఞ్మయంలో దేవాసురయుద్ధాలు, ఆధునిక ప్రపంచమంతటా, వలసరాజ్యాల్లో స్వాతంత్రం కోసం స్థానికుల తిరుగుబాట్లను తలపిస్తుంది. వైదిక వాజ్ఞ్మయంలోని యుద్ధ షడ్యంత్ర వర్ణనలు మోసపూరితమైన దేవతల వ్యూహాలను తలపిస్తాయి. దేవతల విజయాల్లో అగ్ని పాత్ర, నదుల కరకట్టలూ ఆనకట్టలు తెంచడం (నముచి, వృత్తాసుర వధ) వంటి విద్రోహ చర్యల్లో, దేవతల వ్యూహాలకూ, నేటి గెరిల్లా యుద్ధరచనకూ పోలిక అనివార్యం. జొరాస్ట్రియన్ సంప్రదాయం (జెండ్ అవెస్తా) కూడా అహుర మౙదాకు, దేవతల (Daeva) నాయకుడు ఆంగ్రమైన్యుకు మధ్య యుద్ధం వారెణ అనబడే ప్రాంతంలో జరిగిందని, అందులో దేవతలు మోసంతో జయించారనీ చెప్తుంది.
ఋగ్వేదంలోని ప్రసక్తుల్లో శుష్ణ, శంబరులు, ఇలీబిశుడనే అసుర రాజుకు సమకాలీనులుగా కనిపిస్తారు. వీరందరూ ఒకే సమయంలో పరాజయం పాలయ్యారు. పట్టికల్లోని తేదీలను బట్టి పురుకుత్సుని కాలంలో (క్రీపూ. 2775-50) అసురుల ఆధిపత్యానికి తిరుగులేని దెబ్బ తగిలినట్లు భావించాలి. పరశురాముని వృత్తాంతం, హైహేయుల పతనం (క్రీపూ. 2600) ఈ తిరుగుబాటు బాటలో మరో ముఖ్యఘట్టం. దాదాపు మూడు శతాబ్దాలు సాగిన ఈ ఉద్యమానికి క్లైమాక్స్ సగరుని (క్రీపూ. 2400) కాలానికి చెందింది. నముచి, వృత్రాసురులపై ఇంద్రుని విజయం, సింధ్, గుజరాత్ సాగరంపై పరిణత హరప్పా సంస్కృతి విస్తరణ, ఇరాన్ పీఠభూమిలో, గంగా మైదానంలో కనిపించే మొట్టమొదటి హరప్పా స్థావరాలు సగరుని దిగ్విజయం అనే అంశంలో చూడవచ్చు. (పటం). అదే నాణానికి మరోపక్క అసురుల పరాజయం, వారి వలసల క్రమంలో మధ్యఅసియా ఈజిప్ట్‌ల వరకూ విస్తరించిన ఇండోఆర్యన్ సంస్కృతుల, రాచరికాల మూలాలు కనిపిస్తాయి. వీటిని త్వరలో పరిశీలిద్దాం.
ముగింపు
సగరుని సమకాలీనుల చరిత్రలో, వైశాలిలో తుర్వసుల రాజ్యస్థాపన, దుష్యంతుని వృత్తాంతంలో భరతవంశపు తొలి రాచరికం వంటి ఇతివృత్తాలు ఎగువ గంగా మైదానానికి హరప్పా నాగరికత విస్తరణను సూచిస్తే, యాదవుల్లో భీమ, విదర్భ వంటి పేర్లలో, వింధ్యపర్వత ప్రాంతంలో క్రీపూ 2400 ప్రాంతంలో పుట్టిన హరప్పా స్థావరాల మూలాలను వెదకొచ్చు. మక్రాన్ తీరంలో, కచ్, కొంకణ్, సౌరాష్ట్ర తీరాల్లో కొత్తగా వెలసిన పరిణత హరప్పా రేవు పట్టణాలు సాగరంపై సగరుని ఆధిపత్యాన్ని సూచిస్తాయి. క్రీపూ. 2600లో 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కనిపించే భారతీయ కాంశ్యయుగ నాగరికత, క్రీపూ. 2400 నాటికి దాదాపు రెట్టింపై 9 లక్షల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. బాబిలోనియా ఫలకాల్లోని ఎన్‍మెర్కర్ కథలో అరట్ట రాజు అల్ సుగ్యుర్ (సగరుడు) సుమేరియా నగరాలను కప్పం కట్టమని ఆదేశించే వృత్తాంతం, మధ్య ఆసియాపై ఐక్ష్వాకుల ప్రభావాన్ని సూచిస్తుంది. పురాతత్వ శాస్త్రరీత్యా కూడా హరప్పా నాగరికతా క్షేత్రానికి వెలుపల ఇరాన్ పీఠభూమిలో, మధ్య ఆసియాలో ప్రత్యక్షమైన హరప్పా నాగరికతకు చెందిన వర్తక కేంద్రాలు, వాణిజ్యరంగంలో భారతీయుల వలస వ్యవస్థను సమర్ధిస్తాయి. భారతీయ ఇతిహాసంలో అత్యంత ఉత్కృష్టమైన త్రేతాయుగానికి చెందిన క్షత్రియ వంశనుక్రమణికల్లోని వివరాలు వచ్చే సంచికలో చూద్దాం. 
*