Thursday, October 29, 2015

The Story of DelugeThe Story of Deluge


మన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని

ముంపుకథ

గత సంచికల్లో హరప్పా నాగరికత పుట్టుకకి దారితీసిన కొన్ని పురాచారిత్రక, భౌగోళిక, వాతావరణ పరిస్థితులను వివరించాం. వేదవాజ్ఞ్మయంలోని సూచనల ఆధారంగా ప్రాగ్‌హరప్పా యుగాలకి చెందిన పురాతత్వ సంస్కృతుల భౌగోళిక, సాంస్కృతిక నేపధ్యాన్ని వివరించే ప్రయత్నం చేసాం. పర్జిటర్ పొందుపర్చిన రాజుల పట్టికల ద్వారా క్షత్రియ వంశావళుల్లో కృత, త్రేతా, ద్వాపర యుగాలకి చెందిన రాజులు క్రీపూ. 3200 నుంచీ 1400 వరకూ సాగిన తొలి, పరిణత, తుది హరప్పా యుగాలకు చెందినవనే ఉద్దేశ్యాన్ని ఇంతకు ముందే ప్రకటించాం. కనుక తొలిహరప్పా యుగానికి చెందిన సాంస్కృతిక, చారిత్రక పరిణామాలను, మన ఇతిహాసపురాణ సంప్రదాయంలోని గాథలూ, వృత్తాంతాల ద్వారా వివరించవచ్చు. అవసరమైనంత మేరకూ ఈజిప్ట్, మెసొపొటేమియా వంటి సమకాలీన నాగరికతల్లో దొరికిన చారిత్రక సమాచారాన్ని, ఆధునిక సాంకేతిక నేపధ్యంలో కొత్తగా వెలుగుచూసిన భౌగోళిక, వాస్తు పరిజ్ఞానాన్ని కలుపుకొని, ముందుకెళుతూ, క్షత్రియ సంప్రదాయంలోని చారిత్రకతని నిరూపించే ప్రయత్నం చేస్తాం.
 కోట్‌దిజి సంస్కృతి
తొలిహరప్పా యుగారంభానికి (క్రీపూ. 3200) హరప్పా నాగరికతాక్షేత్రంలో ఒక ప్రత్యేకమైన స్థానిక పురాతత్వ సంస్కృతి కనిపిస్తుంది. క్రీపూ. 3000 కి ఈ సంస్కృతి నాగరికతాక్షేత్రం అంతటా విస్తరించింది. దీనిని పురాతత్వవేత్తలు మొదట గుర్తించిన స్థావరాన్ని బట్టి కోట్‌దిజి సంస్కృతి అని నామకరణం చేసారు. (పటం). దక్షిణాన తీరప్రాంతాల్లో అమ్రీ సంస్కృతితో, తూర్పున సరస్వతి ఎగువ మైదానాల్లోని హక్రా సంస్కృతితో వీరికి పరస్పర సంబంధాలు కొనసాగాయి అనేందుకు, ఆ ప్రాంతాల్లోని కలగలిసిన వస్తు సముదాయమే తార్కాణం. హరప్పా, గనేరివాల్, కోట్‌దిజి స్థావరాలు, ఈ సంస్కృతికి ముఖ్యకేంద్రాలుగా కనిపిస్తాయి. వీటిలో రావీ నది ఒడ్డున సప్తసింధు ప్రాంతానికి కేంద్రంగా ఉన్న హరప్పాను, ఇక్ష్వాకుల రాజధాని అయోధ్యగా ఊహించడం జరిగింది. అప్పటికి మొహెంజొదారో నగరనిర్మాణం ఇంక మొదలవలేదు. పక్కనే ఉన్న కోట్‌దిజి సింధు, సరస్వతి నదుల మధ్య కీలకమైన స్థానంలో ఉంది. చోలిస్తాన్ ఎడారిలోని గనేరివాల్, మధ్యసరస్వతి తీరాన, హక్రా సంస్కృతి ఎల్లలో కనిపిస్తుంది. ఇక హక్రా సంస్కృతికి సరస్వతి ఎగువ మైదానంలోని బన్వాలి, కాలిబంగన్ ముఖ్య స్థానాలు. తీరప్రాంతంలో ప్రబలంగా కనిపించే అమ్రీ సంస్కృతికి చెందిన బాలాకోట్, ధోలవీర, సుర్కొటడ ముఖ్య రేవులుగా కొనసాగాయి.
పర్జిటర్ పరిశోధనల ఆధారంగా మనం ముందు చూపిన వంశానుక్రమణికలోని తొలి రాజుల తేదీలు, తొలి హరప్పా యుగారంభానికి సరితూగుతాయి. కనుక క్షత్రియ సంప్రదాయంలోని గాధల ఆధారంగా, తొలి హరప్పా యుగంలో వచ్చిన పరిణామాలను పరిశీలిద్దాం.
వంశావళుల్లోని మొదటి రాజు మనువు’.
పురాణాల్లో ప్రస్తుత మన్వంతరం 3893116 సంవత్సారాల (1728000+1296000+3102+2014) క్రిందట ఆరంభమైందని చెప్పారు. మానవ పరిణామ సిద్ధాంతం ప్రకారం, ఇప్పటికి లక్ష యేళ్ల ముందు భూమిపై మానవుడింకా పుట్టనేలేదు. ఆ సంఖ్యలు ఆమోదించలేము. క్షత్రియ వంశావళుల్లోని లెక్కల ప్రకారం సూచించబడ్డ క్రీపూ. 3200 కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంది.
ఇక కథలోకి వస్తే, మన ఆదిపురుషుడు వరదలో కొట్టుకొచ్చి రాజ్యస్థాపన చేసాడని ఉంది. ఈ వరద ఉదంతం ఒక్క మన పురాణాలకే స్వంతం కాదు. మనువు గాథలో చారిత్రక వాస్తవాలు అర్థం చేసుకోవాలంటే, ఇతర సంస్కృతుల్లోని ఈ ప్రాచీనుల ముంపుకథలని కూడా పరిశీలించాలి

మెసొపొటేమియా గాథ
1914లో ఆర్నో పీబెల్ అనే శాస్త్రవేత్త బాబిలోనియాలో క్రీపూ. 17వ శతాబ్దానికి చెందిన ఒక మృణ్మయఫలకంపై దొరికిన చారిత్రక గాథని అనువదించి ప్రచురించాడు. అందులో మొట్టమొదటిసారిగా శురుప్పాక్అనే నగరంలో వచ్చిన ముంపు ప్రసక్తి వుంది. క్రామర్ మొదలైన పురాతత్వవేత్తలు శురుప్పాక్ గాథ క్రీపూ. 3100 - 3000 కాలానికి చెందినదని, క్రీపూ. 2500కి ఆనాటి పశ్చిమాసియాలో అంతటా ప్రాచుర్యం పొందిందని ప్రతిపాదించారు. ఆ కథ క్లుప్తంగా ఇలా ఉంది:
సుమేరియా దేవతల నాయకుడు ఎన్కి’. ముందుగా శురుప్పాక్ మొదలైన నగరాలను నిర్మించి, వాటిని మనుషులతో జీవరాసుల్తో నింపాడు. కొన్నాళ్లకి దేవుళ్లంతా చేరి మనుష్యులను నిర్మూలించేందుకు ఒక పెద్ద వరదని సృష్టించి ఆ నగరాలను ముంచేందుకు నిర్ణయించుకున్నారు. అది తెలిసిన ఎన్కి, శురుప్పాక్ రాజు ఝుసుద్రను ముందుగా హెచ్చరించాడు. ఒక పెద్ద పడవను నిర్మించమని సలహా ఇచ్చాడు. ఏడు పగళ్లు, ఏడు రాత్రులు తెరిపిలేని తుఫాను, ఝుసుద్ర పడవ వరదలో కొట్టుకొని పోయి అంతులేని అఘాతంలోకి విసిరివేయబడింది. ఏడు రోజుల తరువాత ఉటు’ (సూర్యుడు) కనిపించాడు. ఇంకొన్నాళ్లకి పడవ తీరం చేరింది. అక్కడ సుమేరియా దేవుళ్లు అన్’ (ఆకాశం), ‘ఎన్లిల్’ (ఊపిరి) ప్రత్యక్షమై, సూర్యుడు ఉదయించే దేశంలోని దిల్మున్తీరంలో ఝుసుద్రకి పునర్జన్మనిచ్చారు.’
అదే సుమేరియాకి చెందిన మరో గాథ ఉరుక్నగర నిర్మాత గిల్గమేష్ అనే రాజుది. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి కావ్యంగా ప్రసిద్ధిగాంచింది. ఈ కథ కూడా బాబిలోనియా మృణ్ఫాలకాలపై నిక్షిప్తం చేయబడింది. వీటిలో 11వ ఫలకంలోని ముంపుకథలో ముఖ్యపాత్ర పేరు ఉట్నపిష్టిమ్’. మొదటి కథలోని ఝుసుద్ర ఈ కథలో ఉట్నపిష్టిమ్‍గా కనిపిస్తాడు:
ఎన్లిల్ పంపిన వరదలో ప్రపంచం మునిగిపోయింది. భూగర్భానికి చెందిన దేవుడు ఇయాముందే హెచ్చరించడం వల్ల ఉట్నపిష్టిమ్ ఒక పెద్ద ఓడని నిర్మించాడు. ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జంతువుని  ఓడలోకి ఎక్కించాడు. అతడు భార్యతో సహా,  ఏడు రోజుల వరద తరువాత నిసిర్అనే పర్వతంపైన నేలతాకాడు. కొన్నాళ్ల తరువాత వరద తగ్గుమొహం పట్టాక దేవుళ్లు అతడికి చిరాయువునిచ్చారు. ‘నదుల ముఖద్వారం వద్ద సుదూరమైన దేశంలోఉట్నపిష్టిమ్ కలకాలం జీవించాడు.’
అక్కడియన్ ముంపుకథ కొన్ని తేడాలతో ఇదే కథ చెబుతుంది. అందులో ఉట్నపిష్టిమ్ పేరు అర్తహక్సిస్‌గా కనిపిస్తుంది.

మత్స్యపురాణం
శతపథ బ్రాహ్మణంలోనూ, పిమ్మట మత్స్యపురాణంలోనూ కనిపించే మనువు కథ మనకి చిరపరిచితమే:
వివస్వతుడి (సూర్యుడి) కొడుకు, వైవస్వత మనువుకి విష్ణువు ఒక చేప రూపంలో ప్రత్యక్షమై రానున్న జలప్రళయం గురించి హెచ్చరించాడు. మనువు ఒక నావను నిర్మించి, వేదాలనూ, సప్త ప్రజాపతులను కూడగట్టుకొని పడవెక్కాడు. విష్ణువు ఝషంఅంటే ఒక పెద్ద చేప రూపంలో ఆ నావని అనంతమైన తిమిరంలో, సుడులు తిరిగే నీళ్లమధ్య కాపుగాసి సురక్షితంగా మలయపర్వతంపై దించాడు. ఆ మనువు సంతతే మానవులు. ఒక వంక చంద్రవంశపు ఐలులకూ, మరోవంక సూర్యవంశపు ఐక్ష్వాకులకూ అతడే మూలపురుషుడు.’
ఈ కథల ఇతివృత్తాల్లో పోలిక గురించి చెప్పనవసరం లేదు. ఇవన్నీ ఒకే సంఘటనను ప్రతిబింబిస్తాయి అనడంలో సందేహం లేదు. కథలు ఎంత ప్రాచీనమైనవైనా, రాతపరంగా అవి ఆ సంఘటనకి కొన్ని శతాబ్దాల తరువాత కాలానికి చెందుతాయి. కనుక వాస్తవ గాథలో కొన్ని ప్రక్షిప్తాలు జొరబడి ఉండవచ్చు. ఈ కథలు కూడా వేరువేరు భాషల, సాంస్కృతిక నేపధ్యాల్లో రచించబడ్డాయి. అనువాదాల్లో, దేవుళ్ల పేర్లలో తేడాలు సహజం. కానీ పేర్లు, స్థలాల వర్ణనల్లో కొంచెం లోతుగా వెదికితే సంఘటనలోని వాస్తవిక అంశాలు కొన్ని బయటకొస్తాయి.
ఉదాహరణకి ఉట్నపిష్టమ్ అనే పేరుకి అక్కడియన్ భాషలో సుదూరముఅని అర్థం. ‘ఉటుసుమేరియన్ భాషలో సూర్యుడికి పేరు. అదే భాషలో పిసలేదా పిసిటఅంటే కొడుకు లేదా మాటఅని అర్థం. ‘ఉటు-పిసఅంటే సూర్యుని కొడుకు అనే అర్థం వస్తుంది. వైవస్వతమనువు కూడా వివస్వతుని కొడుకు అంటే సూర్యుని కుమారుడే. కాబట్టి సుమేరియన్ గాథకి మూలాలు, మనువు కథలో కనిపిస్తాయి.
కానీ మన వాజ్ఞ్మయంలో (.IV.21.11) కనిపించే ఝషంఅనే పేరు మరో కోణాన్ని సూచిస్తుంది. ఝు-శుద్ర అనే సుమేరియా పేరులో కూడా ఝషం లీలగా తోస్తుంది. ఋగ్వేదం మనువుకి తోవజూపిన ఝషం ఒక దాశుడు లేక దాసుడు అని చెప్తుంది. దాశ జాతికి, నదిపై పడవలు నడిపే గంగపుత్రులకీ ఉన్న సంబంధం తెలిసినదే. దాస, శూద్ర అనే పదాలకి సేవకుడు అనే అర్థం. కనుక ఝష-శూద్ర పదబంధం, ఝుశుద్ర అనే సుమేరియా పదానికి మూలమని వాదించవచ్చు. కానీ, భారతీయ భాషల్లో అక్షరంతో మొదలయ్యే పదాలు ఎక్కడో కానీ కనిపించవు. ఉన్న కొన్ని ఝుంకారం, ఝుంజామారుతం, ఝర్ఝర, ఝరి వంటి ధ్వన్యనుకరణ (onomatopoetic ) పదాలే. కనుక ఋగ్వేదంలోని ఝషం అన్యదేశం అనే అనుమానానికి తావు లేకపోలేదు.
ఇక సుమేరియా ముంపుకథల్లోని భౌగోళిక వర్ణనలను బట్టి, కథ మూలాలు మెసొపొటేమియాకి తూర్పుదిశగా సుదూర తీరాల్లో వెదకక తప్పదు. ఝుసుద్ర కథలోని దిల్మున్‍ను, ‘పర్షియా గల్ఫ్’లోని బహ్రయిన్ దేశంగా ఊహించారు. సుమేరియా మట్టిపలకల్లో దిల్మున్’, ‘మేలుహ్హలు సూర్యుడు ఉదయించే దిశలోని దూరదేశాలు. కొందరు చరిత్రకారులు మేలుహ్హను హరప్పా నాగరికతగా ఊహించినందువల్ల, దిల్మున్ దేశాన్ని మెసొపొటేమియా, ఇండియాల మధ్య ప్రాంతంలో వెదకడం జరిగింది. కానీ, ఉట్నపిష్టిమ్ కథలో అతడు చేరిన ప్రదేశం ఒక నదీ ముఖంగా వర్ణించబడింది. మెసొపొటేమియాలో యూఫ్రేటస్ నదీ ముఖం నుంచి తూర్పుగా ప్రయాణిస్తే మొట్టమొదటి నదీ ముఖద్వారం సింధూనదికి చెందినదే. కనుక దిల్మున్‌ను సింధ్ తీరంగా భావించవచ్చు. సింధు ముఖద్వారంలోని బాలాకోట్తవ్వకాల్లో అమ్రీ సంస్కృతి క్రీపూ. 3400 నాటికే కనిపిస్తుంది. కనుక సుమేరియా ముంపుకథ, హరప్పా నాగరికతా క్షేత్రం నుంచి ఎగుమతి అయిందని భావించవచ్చు.
జొరాస్ట్రియన్ మతగ్రంధం, అవెస్తాలోని ముంపుకథకీ, మన పురాణాల్లోని ముంపుకథకి పెద్ద తేడాలేదు. అవెస్తాలో వివహ్వంత్కొడుకు యిమముఖ్యపాత్రలో కనిపిస్తాడు. మన వాజ్ఞ్మయంలో యముడు, యమి (లేదా యమున) సూర్యుడి కవలపిల్లలు. యమున (జెమిని) అంటే కవల అని అర్థం. యమున నదిపేరు. అలాగే పురాణాల్లో ఇలుడు/ఇలా మనువు సంతతి. ‘ఇలాసరస్వతికి మరోపేరు. యమున ఎగువ ప్రవాహం ఆనాటి సరస్వతి యొక్క మఖ్య ఉపనది. కనుక మూలకథ సరస్వతీ తీరవాసులైన ఐల వంశస్థులకు సంబంధించినదేమో అని అనుమానించక తప్పదు.

నోవా
క్రీపూ 2500 నాటికే పశ్చిమాసియా నాగరికతల్లో ఈ ముంపుకథ ప్రాచుర్యానికి వచ్చిందని ముందే చెప్పుకున్నాం. ఆ తరువాతి కాలాలకి చెందిన మతగ్రంధాలు (తోరాహ్, బైబిల్, ఖురాన్) అన్నింటిలో, మానవుని సృష్టి, పరిణామాల అవగాహనలో ‘నోవా’ అనబడే ప్రవక్త కథ ప్రముఖంగా కనిపిస్తుంది. అంతేగాక, ఐల వంశపు తొలితరాల్లోని రాజులకూ, పశ్చిమాసియాలో అత్యంత ప్రచారంలో ఉన్న ముంపుకథలోని నోవాకథకూ పోలికలు చాలా ఉన్నాయి. బైబిల్, ఖురాన్లలోని నోవా కథలోని మూడు ముఖ్యఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం:
1        ముంపు: రాబోయే జలప్రళయం గురించి దేవుని హెచ్చరిక మేరకు నోవా ఒక పెద్ద నావను (ఆర్క్) నిర్మించాడు. అందులో జీవరాశిలోని అన్ని రకాల జంతువులను పక్షులను రకానికి రెండు చొప్పున వాటి జీవనానికి కావలసిన ఆహారంతో సహా ఉండేందుకు స్థానం కల్పించాడు. వరదలో నోవా నావలోని జీవాలు తప్ప ప్రపంచంలోని అన్ని ప్రాణులూ నాశనమయ్యాయి. నోవా, అతడి కుటుంబం ఆర్క్‌లో ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ప్రయాణించాక వరద తగ్గుమొగంపట్టింది. ప్రతిరోజూ నోవా రెండు పావురాలను విడిచిపెట్టేవాడు. అవి తిరిగి వస్తే దగ్గరలో నేల కనపడలేదని అర్థం. మొహెంజొదారోలో దొరికిన ఒక ముద్రలో నావపై నిలిచిన రెండు పక్షుల చిత్రం, ఈ కథకు హరప్పా సంస్కృతిలో ఉన్న ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. (పటం).
2        సంతానం: ప్రళయంలో మానవులంతా అంతమవగా, నోవా కొడుకులు - హామ్, శెమ్, యెపెత్ - వారివారి సంతానం, వివిధ మానవ జాతులకు మూలపురుషులయ్యారు. యెఫెత్ సంతానం ఐరోపా వాసులకు, శెమ్ సంతానం ఆసియాలోని సెమెటిక్ జాతులకు, హామ్ సంతానం ఆఫ్రికా జాతులకూ మూలపురుషులుగా భావించడం జరిగింది. ఐరోపాలో మధ్యయుగంలో ప్రాచుర్యంలో ఉన్న మరో సిద్ధాంతం ప్రకారం, శెమ్ సంతానం బ్రాహ్మణులుగా (ప్రీస్ట్), యఫెత్ సంతానం క్షత్రియులుగా (వారియర్), హామ్ సంతానం శూద్రులుగా (పెసంట్), ఆనాటి సమాజంలోని మూడు ముఖ్య వర్గాలను విభజించారు.
3        హామ్ శాపం: ఒకనాడు నోవా కుమారుడు హామ్, నోవా మైకంలో నిద్రిస్తున్న సమయంలో అతడి గుడారంలో ప్రవేశించి నోవా నగ్నశరీరాన్ని చూసి తన సోదరులకు చెప్పాడు. అందుకు కోపగించింన నోవా, ‘హామ్’ను అతడి కుమారుడు ‘కానన్‍’ను శపించాడు. ఆ విధంగా హామ్ సంతతి శాపగ్రస్తులయ్యారు. కానన్ సంతానాన్ని సమాజానికి వెలుపల జీవించే జనజాతులకు మూలపురుషులుగా భావించడం జరిగింది. అంతేగాక, బైబిల్‍లోని హామ్ శాపం అనే ఉదంతం, తరువాతి కాలాల్లో ‘ఆఫ్రికావాసులు బానిసత్వానికే అర్హులు’ అనే జాత్యహంకార వాదనను బలపరిచేందుకు పనికొచ్చింది.

ఐల వంశం
వంశానుక్రమణికలో ఐల వంశపు తొలి తరాల రాజుల కథలతో నోవా కథలోని ముఖ్యఘట్టాలకు కొన్ని పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. (పట్టిక).
మనువు: మనువు ముంపుకథ శతపథబ్రాహ్మణంలో మొదటిసారిగా కనిపిస్తుంది. మత్స్యపురాణంలో వరద వృత్తాంతం మరింత వివరంగా చెప్పబడింది. విలియం జోన్స్ వంటి భారతీయ చరిత్రకారులు, బైబిల్‍లోని నోవా, పురాణాల్లోని మనువు ఒక్కరే అని ప్రతిపాదించారు. అంతేగాక, ఈజిప్ట్ తొలి రాచరికానికి మూలపురుషుడైన ‘మెనెస్’ (Menes), జర్మన్ ప్రాచీన గాథల్లో వారి మూలపురుషుడు ‘మన్నుస్’ (Mannus), మినోవన్ క్రీట్ గాథల్లో జ్యయుస్ కుమారుడు, మినోవన్ల మూలపురుషుడైన మినోస్ (Minos) లకు, మనువుకు పేర్లలో పోలిక ఉంది. ఇది ప్రాచీన నాగరికతా క్షేత్రాల్లో మనువు కథకు  ఉన్న ప్రాచుర్యాన్ని నిరూపిస్తుంది.
ఇలః/ఇలా: ఇలుడు (ఇలా) ఐలవంశానికి మూలపురుషుడు (స్త్రీ కూడా). జొరాస్ట్రియన్ సంప్రదాయంలోని వివహ్వత్ కుమారుడు యిమ (Yima)కు మనువుకు ఉన్న సామ్యం ముందే ప్రస్తావించాము. వైదిక సంప్రదాయంలో యముడు, యమి (యమున) సూర్యుని సంతానం. ప్రముఖ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్, ‘ముంపుకథలోని హీరో (నోవా), గ్రీక్ సంప్రదాయంలో శాటర్న్ (శని)గా రూపాంతరం చెందాడని’ ప్రతిపాదించాడు. హిందూ సంప్రదాయంలో శనైశ్చరుడు కూడా రవిపుత్రుడే, యముడికి అగ్రజుడే.
పురూరవుడు: ఋగ్వేదంలోనే ఊర్వశీపురూరవం కథ ఉంది. ఊర్వశి అప్సరస, గంధర్వుల ఆడబడుచు. ఆమె పురూరవుని వదిలి పోవడం, ఊర్వశీపురూరవంలో ముఖ్య కథాంశం. గంధర్వులు, తరువాతి యుగంలో ముండా జనజాతులకూ, మెలనీసియన్, పాలినేసియన్ జాతులకు మూలపురుషులన్న అభిప్రాయాన్ని ముందు సంచికలో ప్రస్తావించాం. నోవాని నగ్నంగా చూసిన ‘హామ్’ సంతానం నాగరిక సమాజానికి దూరమవడమనే గాథకు, ఊర్వశి పురూరవుని నగ్నంగా చూడటంవలన అతడిని విడిచిపోవడమనే ఉదంతానికి ఇతివృత్తంలో పోలిక ఉంది.
నహుషుడు: భాషాశాస్త్రాన్ని బట్టి నహుష, నోవా పేర్లలో సామ్యం ఉంది. అంతేగాక, నోవాస్ ఆర్క్‌కు సంస్కృతపదం ‘నావ్’ (నావ)కు ఉన్న పోలిక గుర్తించదగినది. నోవా పేరు నావ్ యొక్క రూపాంతరంగా ఊహించవచ్చు. ఇది నోవా గాథపై భారతీయుల ముంపుకథ ప్రభావం సూచిస్తుంది.
యయాతి: పంచజన అంటే ఆర్యులుగా పిలువబడ్డ ఐదు జనజాతులకు మూలపురుషులు - పురు, యదు, తుర్వస, దృహ్యు, అను. వీరు ఐదుగురూ యయాతి కుమారులు. అదే విధంగా నోవా సంతతి - హామ్, శెమ్, యఫెత్ - ప్రపంచంలోని జనజాతులకు మూలపురుషులు.

ముగింపు
ఐల వంశపు తొలితరాల రాజుల కథలకూ, నోవా కథకూ ఉన్న సామ్యం, ‘పశ్చిమాసియా మతగ్రంధాల్లోని కొన్ని గాథలను ఇతిహాసపురాణ సంప్రదాయంలోని కథలు ప్రభావితం చేసివుండవచ్చు’ అనే అభిప్రాయాన్ని బలపరుస్తాయి. ఆనాటి సమకాలీన సమాజాల్లో వెలికివచ్చిన ముంపుకథ వృత్తాంతాలు క్రీపూ. 2500 నాటికే హరప్పా-మెసొపొటేమియా సంస్కృతుల మధ్య సాంస్కృతిక సంబంధాలను నిరూపిస్తాయి.
ఐల వంశపు తొలిరాజుల కథల్లో ఆరు తరాలకు విస్తరించి విస్తృతంగా కనిపించే కథలు కుదింపబడి ఒకే వ్యక్తికి (నోవా) చెందిన గాథగా యూదుల మతగ్రంధం ‘తోరాహ్’లో మొదటిసారిగా కనిపిస్తుంది. అంతేగాక, మెసొపొటేమియా ముంపుకథల్లోని తూర్పు దేశపు ప్రసక్తులు ఈ కథ మూలస్థానాన్ని హరప్పా నాగరికతా క్షేత్రంగా సూచిస్తాయి. ఆ గాథలకీ సరస్వతీ మైదానంలో (హాక్రా సంస్కృతి) పాలించిన ఐల వంశస్థులకూ ఉన్న సంబంధం, ఇతిహాసపురాణ సంప్రదాయంలోని చారిత్రకతను నిర్ద్వంద్వంగా నిరూపిస్తుంది.
పర్జిటర్ పట్టికల్లోని ఐల వంశపు రాజుల తేదీలను బట్టి, ఈ గాథలకు మూలమైన ముంపు ఉదంతం సరస్వతీ నదీ పరివాహక ప్రాంతంలో క్రీపూ. 3050 కి ముందు, 3150 తరువాత జరిగినదిగా ఊహించవచ్చు. ఆర్యభట్టు సూచించిన యుగారంభపు తేదీ - క్రీపూ 3102 - అదే పరిధిలో ఉంది. కనుక పురాతత్వవేత్తలు సూచించిన హరప్పా తొలియుగం, క్షత్రియ సంప్రదాయంలోని తొలి రాచరికపు ఆరంభం, ఏకకాలంలో క్రీపూ. 3102లో జరిగాయని ఊహించవచ్చు.
క్షత్రియ సంప్రదాయంలోని తొలి తరాల చరిత్రలో యయాతి సంతానం వలసలు పోవడం, దరిమిలా ఐల సామ్రాజ్యం క్షీణించడం, అదే సమయంలో సమాంతరంగా ఐక్ష్వాకు వంశాభివృద్ధి కనిపిస్తాయి. మనువు సంతానంలో ఇక్ష్వాకుడు అతడి సంతానం ఆ తరువాతి గాథల్లో ప్రముఖంగా కనిపిస్తారు. ఆ ఐక్ష్వాకుల మూలాలను వచ్చే సంచికలో పరిశీలిద్దాం.
*

No comments:

Post a Comment