Wednesday, August 26, 2015

The Original Inhabitantsపురాణాల్లో నిజం- 7
సాయి పాపినేని
జయశ్రీ నాయని
మూలవాసులు

‘ఓం భూర్ భువర్ సువః’ అంటూ మొదలయ్యే గాయత్రి మంత్రం సమాజంలోకి ఆర్యుల ప్రవేశాన్ని సూచిస్తుంది. ఈనాటికీ విశ్వామిత్రుడు రచించిన ఈ మంత్రోచ్ఛారణతోనే బాల్యంలో జంతుప్రకృతితో ఉన్న మానవుడు వడుగై ఒక వ్యక్తిగా సమాజంలో కాలుపెట్టడం జరుగుతుంది. పర్జిటర్ పొందుపర్చిన పురాణ వంశానుక్రమణికల్లో విశ్వామిత్రుడు కృతయుగాంతానికి, త్రేతాయుగం మొదటి స్తరానికి చెందుతాడు. అంటే మన కాల నిర్ణయాన్ని అనుసరించి క్రీపూ. 2600 ప్రాంతం. అది పరిణత హరప్పా నాగరికత ఆరంభ దశ. క్రీపూ. 2600 నుంచీ ఒక ఆరొందల యేళ్లు వాయవ్య భారతదేశమంతా ఒకే సంస్కృతి ఛత్రం నీడలో కనిపిస్తుంది. ఈ గాయత్రి మొదటిపాదంలో ఆ నాగరిక సమాజ నిర్మాణ ప్రక్రియకి కీలకమైన సమాచారం దాగివుంది.
భూ, భువర్, స్వ అనే మూడు పదాలు, మూడు భిన్న నేపధ్యాల కలయికని సూచిస్తాయి. అవి భూలోకం, భువర్లోకం, స్వర్లోకం. మనుసంహిత, మానవులకు ఆద్యుడైన మనువు మూడు వేదాల్లో దాగివున్న మూడు వ్యాహృతులను పితికి, ఈ మూడు లోకాలను సృజించాడని చెబుతుంది. ఇక్కడ లోకం అనే పదానికి (ఇంగ్లీషులోని Locus, Location వంటి పదాల్లా) ఒక ‘ప్రదేశం’ అనే తాత్పర్యం చెప్పాలా? లేక హిందీలో ‘లోగ్’ పదంలా ఒక ప్రజ అని అర్థం చేసుకోవచ్చా? లోకులు ఉన్న లోకంగా కానీ, ఒక ప్రదేశంలో ప్రజలుగా కానీ, ఎలా అర్థం చేసుకున్నా ప్రస్తుత చర్చకి సరిపోతుంది.
వాజ్ఞ్మయంలో ఈ మూడులోకాల ప్రసక్తులు గమనిస్తే, వాటి భౌతిక సామాజిక పరమైన అంశాల్లో, ఆ లోకవాసుల్లో కొన్ని నిర్దిష్టమైన తేడాలు కనపడుతాయి. క్రీపూ. 3500 నుంచీ 3100 వరకూ మనువుకి ముందు, పురాతత్వ సంస్కృతుల ఆనవాళ్లను ఆ తేడాల ఆధారంతో మరో కోణంలో చూడవచ్చు. ముల్లోకాలలో భూమి మనుషులకు మూలస్థానమైతే, స్వర్గ భువర్లోకాలు ఎక్కడో ఆకాశంలో మానవేతరులు మాత్రమే నివసించేవిగా వర్ణించబడ్డాయి. వారిని భూలోకానికి వెలుపల నివసించే భిన్న సాంస్కృతిక నేపధ్యం గల జాతులుగా పరిగణించటం హేతుబద్దం. మొదట మన భూలోకం ఎక్కడో తెలిస్తే మిగిలిన లోకాలను కిందకు దింపవచ్చు.
భూలోకం
ఆ లోకాల ఆనవాళ్లు కనుగొనేందుకు, వాజ్ఞ్మయంలో ఆ ప్రదేశాలకు చెందిన నదులూ, పర్వతాల వంటి భౌతిక భౌగోళిక వర్ణనలు తోడ్పడుతాయి. ఋగ్వేదంలో (X.64. 8-9) నదుల ప్రసక్తి మరో 21 చిన్ననదులలో చేరి  సింధూ, సరయూ, సరస్వతి అనబడే నదులను భూలోకానికి ముఖ్యమైనవిగా చెబుతుంది. ఋగ్వేదంలోని నదుల్లో యమునకి తూర్పున ఉన్న నదుల ప్రస్తావన కనిపించదు. తరువాతి కాలాల్లో భారతీయ సంస్కృతికి ఆయువుపట్టుగా నిలిచిన గంగానది ప్రసక్తి కూడా ఋగ్వేదంలో కనుపించదు. ఋగ్వేదంలో ఒకచోట (III.59.6) ‘జాహ్నవులు’ అనే పదం, మరోచోట (VI.45.31) ‘గాంగ్యులు’ అనే పదం కనిపిస్తాయి. ఇవి జహ్నువు సంతతి వారికి, నీటిపై అధారపడి జీవనం సాగించే ప్రజలకు పర్యాయపదాలుగా వాడబడ్డాయి. అంతేగానీ ఋగ్వేదకాలపు నాగరికులు గంగానది ప్రాంతానికి విస్తరించారని చెప్పడం కష్టం. ఋగ్వేదంలోని మరో ముఖ్య ఘట్టం ‘దాశరాజ్ఞయుద్ధం’ కూడా ఆనాటి చక్రవర్తి సుదాసుడి సామ్రాజ్యాన్ని అశికిని, యమునల మధ్యప్రాంతంగానే సూచిస్తుంది. కనుక సింధూ, సరయూ, సరస్వతి అనబడే ఈ మూడు మహానదుల పరివాహక క్షేత్రాన్ని భూమి, లేదా భూలోకంగా గుర్తించవచ్చు.
వీటిలో సింధూనది మనకి తెలిసినదే. సరస్వతి అనే మహానది ఒకప్పుడు సత్లూజ్, యమునల ప్రవాహాలు కలుపుకొని సింధునదికి సమాంతరంగా పారిందని ముందు వ్యాసంలో చెప్పుకున్నాం (మిసిమి, జూన్ 2015).
ఇక గంగా యమునల కంటే గొప్పదిగా వర్ణించబడ్డ సరయూ నది ఆచూకీ దొరికితే ఆనాటి భూలోకం ఎక్కడో నిర్ధారించవచ్చు. నేటి భౌగోళిక పటంలో సరయూనది నేపాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గంగకి ఉపనదియైన గోగ్రా లేదా సర్జూ నదిగా చూపడం జరుగుతుంది. గోగ్రా ప్రాంతంలో క్రీపూ. 1వ సహస్రాబ్దికి ముందు నాగరికత ఆనవాళ్లు కనిపించవు. కనుక సరయూ నదిని వాయవ్య భారతదేశంలో సింధు, సరస్వతి లోయల మధ్య వెదకక తప్పదు. ఇక్ష్వాకుని నుంచి శ్రీరాముని వరకూ గల రాజుల కాలంలో (మన పట్టికలో క్రీపూ. 3100 - 2000) ఆనాటి నాగరికతకు మూలస్థానం సరయూనదీ తీరంలోని అయోధ్య. ఋగ్వేదంలోని అతి ప్రాచీనభాగాల్లో, అంటే III నుంచీ VI మండలాల్లోని ఋక్కుల్లో, సరయూనది కేంద్రస్థానంగా కనిపిస్తుంది. కనుక ఆనాటి సరయూనదిని హరప్పా నాగరికత క్షేత్రంలో వెదకడంలో తప్పులేదు.
అయోధ్య రాజులకు పురోహితుడు వశిష్టుడు. వశిష్టః అంటే గొప్ప సంపద గలవాడు అని అర్థం. రాజాశ్రయమూ, అశేష సంపదనిచ్చే గోవు, ‘నందిని అతడి సంపదకి ఆధారాలుగా చెప్పబడ్డాయి. పురానికి హితంగూర్చే పురోహితుడు  పురానికి దూరంగా నివసించడం సాధ్యం కాదు. అందువల్ల అతడి నివాసం అయోధ్య వద్దనే ఉందనుకోవాలి.
ఆ అయోధ్య ఎక్కడ?
ఇంద్రుడు వృచివంతులనబడే నూరుమంది బ్రాహ్మణులను ‘హరయూపీయ’ వద్ద చంపాడని ఋగ్వేదంలో ఉంది. విశ్వామిత్రుడు ‘హరియూప’ వద్ద వాలశిఖులనే వందమంది వశిష్టుని కొడుకులను చంపినట్లు రామాయణం చెప్తుంది. కాళిదాసు రఘువంశంలో కల్మషపాదుడనే ఇక్ష్వాకు చక్రవర్తి బ్రహ్మరాక్షసుడై వశిష్టుడి కొడుకు శక్తిని అతడి అన్నదమ్ములనూ సరయూ తీరంలో మింగేసాడని రాసాడు. ఇక సుదాసుడు పరుష్ణీనది తీరంలో వైకరణేయులను చంపినట్లు కూడా పురాణాల్లో కనిపిస్తుంది. ఇవన్నీ చరిత్రలో జరిగిన ఒకే సంఘటనను సూచిస్తాయి. వరశిఖులు, వాలశిఖులు, వైకర్ణేయులు అనబడే పేర్లు వశిష్ట గోత్రానికి చెందిన ప్రవరాల్లోవే. పైన ఉదాహరించిన సంఘటనల్లోని పరుష్ణీ, హరయూపీయ, హరియూప, సరయూ అనబడే భౌగోళిక ప్రదేశాలకూ వశిష్టుడి నివాసమైన అయోధ్యకూ సంబంధం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పరుష్ణి పంజాబ్‌లోని రావి నదికి మరోపేరు. హరప్పా శిధిలనగరం ఆ నదీతీరంలోనే ఉంది. ఋగ్వేదంలోని హరయూపియ, రామాయణంలోని హరియూప పేర్లకు, నేటి హరప్పాకు ఉన్న సామ్యంగురించి చెప్పనవసరం లేదు.
నేటి హరప్పా శిధిలాల వైశాల్యం బట్టి ఆనాటి హరప్పా ఒక మహానగరంగా పరిఢవిల్లింది అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. అంతేగాక పురాతత్వవేత్తల అంచనాల ప్రకారం ప్రాచీన హరప్పా నగరం ప్రస్తుతం శిధిలాలకు దక్షిణాన ఉన్న హరప్పా పట్టణం మునిసిపాలిటీ ఏరియా కింద కూడా విస్తరించి ఉంది. ప్రజలు నివాసం ఉండటంచేత అక్కడ తవ్వకాలు జరిపేందుకు వీలులేదు.
ఉత్తరప్రదేశ్‌లో ఫైజాబాద్ వద్దనున్న అయోధ్య ప్రాంతంలో క్రీపూ. 1000కి ముందునాటికి నాగరికత విస్తరించలేదని తెలిసిందే. కనుక ‘నేటి పాకిస్తాన్‌‌లోని పంజాబ్ ప్రాంతంలో, రావీ నది తీరంలోని, హరప్పా శిధిల సముదాయమే ఒకనాటి అయోధ్యానగరం’ అనేందుకు పై అధారాలు చాలు.
మనువు సంతతిచే పాలించబడ్డ అయోధ్య ఆనాటి మానవలోకం అంటే భూలోకానికి కేంద్రస్థానంలో ఉందనుకుంటే, దానికి పశ్చిమ ఎల్లగా సింధూనది ప్రాంతం, తూర్పు ఎల్ల సరస్వతీ ప్రాంతంగా భావించాలి. ఇక భువర్లోకం, స్వర్గలోకాల ఆనవాళ్లు ఆనాటి వాజ్ఞ్మయంలో చూడవచ్చు.
భువర్లోకం
భువర్లోకం వసువులది. ఇది మేరువు సానువుల్లో మనకి ఒక మెట్టు పైన ఉంటుందని పురాణాలు చెప్తాయి. హిందుకుష్, కిర్తార్ పాదపీఠంలోని ఝోబ్, స్వాత్ కనుమలలో క్రీపూ. 4500 నాటికే వ్యావసాయిక, పట్టణ సముదాయాలు వెలసిన విషయాన్ని, మేరువుకూ వసువులకూ గల సంబంధాన్ని ముందే ప్రస్తావించాము (మిసిమి, ఏప్రిల్ 2015). ఈ భువర్లోకాన్నే పురాణాలు పితృలోకం అంటాయి. ‘పితృ’ అంటే పూర్వీకులు. క్రీపూ. 7000 నాటికే ఆ ప్రాంతాల్లో వికసించిన వ్యావసాయక సమాజాలే కొండదిగి నదీలోయల్లోకి వలసవచ్చాయని ముందే చెప్పుకున్నాం (మిసిమి, జూన్ 2015). కనుక సింధూనదికి పశ్చిమాన హిందుకుష్ కనుమల్లోకి సాగే ఎగువ మైదానాల్లో క్రీపూ. 3100కి ముందుకాలానికి చెందిన ఒక ప్రత్యేక సంస్కృతిని భువర్లోకంగా గుర్తించవచ్చు. అలాంటి నిర్దిష్టమైన పురాతత్వ సంస్కృతి ఆనవాళ్లు తరువాత విచారిద్దాం.
 స్వర్గలోకం

స్వర్గం లేదా దివి దేవతల నివాసం. దీనిని దేవతలు గంధర్వుల నుంచి స్వీకరించారు. ఈ గంధర్వులు అసురులచే అక్కడనుండి తరిమివేయబడ్డారు. ఆ అసురులని నిర్జించి దేవేంద్రుడు స్వర్గాధిపతి అయ్యాడు. టూకీగా ఇది స్వర్గలోకపు చరిత్ర. అమరావతి స్వర్గానికి రాజధాని. దీనిని అసురులు ఆశించడం, ఇంద్రుడు, అతడి తమ్ముడు విష్ణువు వారిని తిప్పికొట్టడం, ఆ యుద్ధాల్లో వివిధ అయోధ్య రాజులు సహకారం అందించడం అనే అంశం చుట్టూ అనేక గాధలు మనకి వేదాల్లో, పురాణాల్లో కనిపిస్తాయి.
ఋగ్వేదంలో నారాయణుడి బిడ్డలైన గంధర్వులు స్వర్గానికి మూలవాసులుగా చెప్పబడింది. నారాయణుడంటే ‘నారా’ అనబడే నీటిపై కాపురముండేవాడు. నేడు సింధునది పాయగా కనబడే నారానది ద్వారా ఒకప్పుడు సరస్వతి సముద్రంలో కలిసివుండాలని ముందుగా చెప్పాం. ఆ నదీ ముఖమే క్షీరసాగరం అనేందుకు కొన్ని ఆధారాలు కూడా చూపబడ్డాయి. కనుక ఈ గంధర్వాప్సరుల మూలస్థానం సింధూసరస్వతుల దిగువ ప్రాంతం అనుకోవచ్చు.
ఈ గంధర్వులు ఎవరు?
ఋగ్వేదం వీరిని దివ్యగంధర్వులు అంటుంది. ఋగ్వేదంలోని వర్ణనలను బట్టి వారి సాంస్కృతిక నేపధ్యాన్ని కొంతవరకూ ఊహించవచ్చు.
‘గంధర్వులు నిశాచరులు, నారాయణుని వడిలోంచి రెక్కల పక్షులవంటి పడవలపై తేలుతూ, అమృతం, సుర అనబడే పానీయాల భాంఢాలతో, వీణా, మృదంగవాద్యాలకు తోడుగా గానంచేస్తూ, పీనస్తనాలపై ఎగిసిపడే పూలమాలలతో నాట్యమాడే అప్సరోభామినులతో సాయంసంధ్యకి ఎర్రబడే ఆకాశంలోంచి దిగి, రాత్రంతా ఆనంద పరవశాల్లో ఓలలాడించి ఉదయానికి అదృశ్యమవుతారట!’
ఈ అద్భుత వర్ణనలను మనవశాస్త్రంలో (Anthropology) వెలుగుచూసిన కొన్ని నిజాలకు కలిపిచూస్తే ప్రాచీన జనజాతుల్లో వచ్చిన కొన్ని పరిణామాలు బోధపడతాయి.
మానవ వలస దశల్లో భారత ఉపఖండంలో మొట్టమొదట ప్రవేశించిన వాళ్ళు ఆస్ట్రిక్ జాతులు. ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవుల వరకూ కనిపించే మెలనీసియన్, పాలినేసియన్ జాతులకు భాషా సంస్కృతుల్లో మనదేశంలో నేటికీ కనిపించే ముండా జనజాతులే మూలపురుషులు. ఆఫ్రికా నుంచి, భారతదేశం రహదారిగా, సముద్రమార్గాన్న చిన్నచిన్న తెప్పల్లో వేల మైళ్ల దూరాన గల పసిఫిక్ దీవులూ, ఆస్ట్రేలియా ఖండం వరకూ వలసలు పోయి ఆయా దేశాల మూలవాసులుగా స్థిరపడ్డారు.
19వ శతాబ్దంలో క్యాప్టన్ కుక్ మొదలైన సాహసీకులు తాహితీ వంటి పసిఫిక్ దీవుల్లో కనుగొన్న స్వేచ్ఛాజీవుల సంస్కృతికీ, ఋగ్వేదంలో వర్ణించబడ్డ గంధర్వాప్సరోభామినులకూ మధ్య పోలిక కనిపిస్తుంది. ఋగ్వేదంలో ‘గాంగ్య’ అనేపదాన్ని గంగపుత్రులుగా అర్థం చేసుకుంటే వాళ్లు ఉరుకక్షని దాటి సముద్రంలో దూరతీరాలకి వలసపోయిన విషయం (VI.45.31) చూచాయగా కనిపిస్తుంది.
పురుకుత్సుడు దక్షిణానికి వలస పోయి అక్కడ నర్మదను భార్యగా గ్రహించినప్పుడు, శరణార్థులై వచ్చిన గంధర్వులకు మేరువు సానువుల్లోని అలకాపురిలో కొత్త వసతి కల్పించడం, రామాయణంలో అసురులచే తరిమివేయబడి కొండల్లో నివాసం కల్పించుకున్న గంధర్వుల వృత్తాంతం, నదీతీరాలను విడిచి కొండల్లోకి వలసపోయిన గిరిజనుల కథను చెప్తాయి. నేటికీ ముండా భాషలు మాట్లాడే జనజాతుల పేర్లలో ఖోండ్, కొండ పదాలు గంధర్వ పదానికి దగ్గరగా కనిపిస్తాయి. తెలుగు కన్నడ భాషల్లో ‘గండ’ (మనిషి)కి గంధర్వ పదం సంస్కృతీకరించిన రూపం కావచ్చు. మరో ద్రవిడ జనజాతి గోండ్లకు హరప్పా ప్రాంతపు మూలవాసులకు గల సాంస్కృతిక సంబంధం కూడా పరిశీలించడం అవసరం. మొహెంజొదారోలో వెలుగు చూసిన నృత్యాంగన కాంశ్య శిల్పంలో (Dancing Girl Bronze) ఆస్ట్రిక్ జాతుల ముఖకవళికలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.పై అధారాలను బట్టి ఈ గంధర్వుల మూలస్థానమైన దివి లేదా స్వర్గం సింధూ సరస్వతుల దిగువలోయలో నారా నది కేంద్రంగా, పురుకుత్సుని గాధను బట్టి నర్మద వరకూ ఉన్న తీర ప్రాంతంలో విస్తరించిన ప్రత్యేకమైన సంస్కృతిగా గుర్తించవచ్చు.                                                             ప్రాగ్‌హరప్పా సంస్కృతులు
పురాతత్వ శాస్త్రజ్ఞులు తవ్వకాల్లో దొరికిన వాస్తు సముదాయాలను బట్టి, వాయవ్య భారతఖండంలో మూడు నిర్దిష్టమైన ప్రాగ్‌హరప్పా సంస్కృతులను గుర్తించారు. మట్టి పింగాణి పాత్రల రంగు, డిజైన్ల ప్రత్యేకతలను, కట్టడాల నిర్మాణంలో తేడాలను పరిగణనలోకి తీసుకొని ఆ కాలపు పురాతత్వ సంస్కృతులను గుర్తించడం జరుగుతుంది. ఆ ప్రత్యేకమైన సంస్కృతిని మొదట కనుగొన్న ప్రాంతం పేరు ఆ సంస్కృతికి పెట్టడం ఆనవాయితీ. అవి ఝోబ్’, ‘కుల్లి’, ‘హక్రా సంస్కృతులు. రేడియో ధార్మిక కర్బనం 14 పరీక్షల ద్వారా క్రీపూ. 3500 - 3000 వరకూ ఈ మూడు సంస్కృతులూ మూడు ప్రత్యేక భౌగోళిక ప్రదేశాల్లో విస్తరించినట్లు తెలుస్తుంది. (పటం).
భౌగోళికంగా, వాజ్ఞ్మయంలో కనిపించే మూడు లోకాలకూ, ఈ మూడు పురాతత్వ సంస్కృతులకు గల పోలిక తేటతెల్లమవుతుంది.
కుల్లీ సంస్కృతి (స్వర్లోకం): నారానది కేంద్రంగా వృత్తలేఖినితో దక్షిణాన నర్మద నుండి పశ్చిమాన బలూచిస్తాన్‍లోని మక్రాన్ తీరం వరకూ, సింధు, సరస్వతి దిగువ డెల్టాలను కలుపుకొని ఒక సర్కిల్ గీస్తే అందులో కనిపించే 120కి పైగా స్థావరాల్లో ‘కుల్లీ’ సంస్కృతి ప్రముఖంగా కనిపిస్తుంది.
హక్రా సంస్కృతి (భూలోకం): సింధు యమునల మధ్య, హక్రా/గగ్ఘర్, రావీ నదులు కేంద్రంగా ‘హక్రా’ సంస్కృతి దాదాపు 200 పైగా స్థావరాల్లో కనిపిస్తుంది.
ఝోబ్ సంస్కృతి (భువర్లోకం): ఇక సింధునదికి పశ్చిమంగా హిందుకుష్, కిర్తార్ శ్రేణుల పాదపీఠంలో 75కి పైగా స్థావరాల్లో ‘ఝోబ్’ సంస్కృతి కొనసాగింది.
ఈ మూడు సంస్కృతులూ తొలి హరప్పా యుగానికి ముందుకాలానివి. అంటే మన రాజవంశాల పట్టిక ప్రకారం మనువు రాజ్యస్థాపనకి ముందువి. 
ముగింపు
మనువు కాలం నుండి పురాణాల్లోని రాజుల గాథలు, సంఘటనలు అ పిమ్మట స్థానిక పురాతత్వ సంస్కృతుల్లో భౌతిక భౌగోళిక స్థితుల్లో వచ్చిన మార్పులను మరింతగా తెల్లపరుస్తాయి. క్రీపూ. 3000 నుండీ మెసొపొటామియా నగరాల్లో, ఈజిప్టులో దొరికిన ఆనాటి రాతలు మనకి కొంతవరకూ సహకరిస్తాయి. దురదృష్టవశాత్తూ హరప్పా లిపి మనకింకా అంతుపట్టట్లేదు. ఇతిహాస పురాణ సంప్రదాయంలోని వివరాలే ఆధారంగా, వచ్చే సంచిక నుంచీ, తొలి హరప్పాయుగానికి చెందిన చరిత్ర చిక్కుముడులను విడదీసే ప్రయత్నం చేద్దాం.
*


No comments:

Post a Comment