Wednesday, August 5, 2015

Aryans – Language & Cultureమన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని
ఆర్యులు: భాష - సంస్కృతి
క్రీపూ. రెండవ సహస్రాబ్దిలో ఆర్యులు అనే అనాగరిక దండ్లు హిందుకుష్ పర్వతాల్లోని లోయల ద్వారా భారత ఉపఖండంలోని వాయవ్య ప్రాంతంలో ప్రవేశించేటప్పడికి, అక్కడి హరప్పా నాగరికత పతనావస్థలో ఉందని, అలా వచ్చిన ఆర్యులు అంతకు పూర్వం మన దేశంలో పరిఢవిల్లిన నాగరికత ఆనవాళ్ళన్నీ తుడిపేసి తమ మతాన్ని, వ్యవహారాలనీ స్థానికులపై రుద్దారని మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. ఆ ఆర్యుల ఆధిపత్యం కింద మరో నూతన నాగరికత రూపుదిద్దుకొనేందుకు మరో వెయ్యేళ్ళు పట్టిందని, ఆ నూతన వ్యవస్థలో స్థానిక జాతులని అణచివేసేందుకు వర్ణవ్యవస్థ సృష్ఠించబడిందనే అభిప్రాయం నేటి రాజకీయ, కులతత్వ సిద్ధాంతాలకి పునాది అయింది.
అలా పాతుకుపోయిన అభిప్రాయాలని మార్చడం కష్టమే.
కానీ పెరుగుతున్న శాస్త్రీయ వాతావరణంలో పురాతత్వశాస్త్రంలో, మానవ జన్యుశాస్త్రంలో వచ్చిన అభివృద్ధివల్ల, కొత్తకొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సింధునాగరికత అనంతరం ఆర్యుల దండయాత్ర, అంటే పెద్దపెట్టున కొత్తజాతులు వలస వచ్చిన ఆధారాలు దొరకలేదు. క్రీపూ. 6000 యేళ్ళకి పూర్వం నవీనశిలాయుగారంభంలో వ్యవసాయం, పశుపోషణ టెక్నాలజీకి సంబంధించి, కొంతవరకూ భాషాపరమైన మార్పులు వచ్చి ఉండవచ్చు. క్రీస్తు శకారంభంలో యవన, పాహ్లవ, శక, హూణ జాతుల, ఆ పిమ్మట మధ్యయుగంలో ముస్లిం దాడులవల్ల కొంత జన్యుమిశ్రణం జరిగిన మాట వాస్తవమే. సింధు నాగరికతకి చెందిన మానవ కళేబరాల్లోని జన్యుపదార్థానికి, నేడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజల్లోని జన్యునిర్మాణానికి తేడా లేదని తేలింది. అంతేగాక ఆర్యులు అంటే ఒక భౌతికమైన జాతి (Race) అనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు. ఆర్య పదం ఒక సంస్కృతిక నిర్మాణాన్ని సూచిస్తుందేగానీ ఒక జాతిని కాదు. అందువల్ల ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం మిధ్య మాత్రమే అని అంగీకరించాల్సి వస్తుంది.
ప్రకృతి వైపరీత్యాలు, అవగాహన లేని మానవ తప్పిదాల కారణంగా, ఆ కాలంలో వాయవ్య భారత ఉపఖండం భౌగోళికంగా అనేక మార్పులకు గురయ్యింది. ఉదాహరణకి గత పదేళ్ళలోనే బీహార్‌లో కోసీ నది కట్టలు తెంచుకొని దారిమళ్ళి ముప్పై కిలోమీటర్ల అవతలి గ్రామాలపై పడటం చూసాం. 21వ శతాబ్దంలో ఆధునిక పరికరాలు, ఇంజనీరింగ్ పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాకూడా వరదనష్టం అదుపు చేయడం మనవల్ల కాలేదు. హిమాలయాల్లో పుట్టిన నదులకి ఇలాంటి వరదలు రావడం కొత్తేమీ కాదు. కరకట్టలు, ఆనకట్టలు లేని ప్రాచీన యుగంలో ఆ నదీపరివాహక ప్రాంతాల్లో వరదలు ఎలాంటి భీభత్సాన్ని సృష్టించి వుంటాయో అంచనా వేయవచ్చు.
కొన్ని నదులు దిశలు మార్చుకొని పూర్తిగా అదృశ్యమవడం, మరికొన్ని నదులు కొత్త ఉపనదులను  తమలో కలుపుకొని జనావాసాలను ముంచెత్తడం జరిగింది. ఒకవంక కొత్తభూములు సాగులోకి వచ్చాయి, మరోవంక వృక్షసంపదతో పాడిపంటలతో తులతూగిన ప్రాంతాలు శుష్కమైన ఎడారులుగా మారాయి. తీరప్రాంతాలు ముంపుకి గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో జనాభా పెరిగితే, కొన్ని నిర్మానుష్యమయ్యాయి. నాగరికత అభివృద్ధికి, పతనానికి వాతావరణంలో, భౌగోళిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఒక ముఖ్యమైన కారణం.
ఆధునిక సాంకేతిక పద్ధతులద్వారా, పురాతత్వ గవేషణల వల్లా వెలుగులోకి వచ్చిన వాతావరణ భౌగోళిక పరిస్థితులు, నాటి మానవ జీవనాధార వ్యవస్థలో, నాగరికత దశలలో వచ్చిన మార్పులపై కొంతవరకు అవగాహన కలుగజేస్తాయి.
భారత ఉపఖండ వాయవ్య ప్ర్రాంతంలో క్రీపూ. 7వ సహస్రాబ్దిలో ఒక ప్రత్యేకమైన ప్రాచీన నాగరికతకి బీజం పడింది. తరువాతి 4 వేల యేళ్ళలో అది ప్రపంచంలోనే అతిపెద్ద కాంశ్యయుగ నాగరికతగా అభివృద్ధి చెందింది. క్రీపూ. 2వ సహస్రాబ్ది మధ్య కాలానికి పతనమై దాదాపు అదృశ్యమయింది. చివరి మంచుయుగం (క్రీపూ. 8000) అనంతరం ప్రాచీన మానవుడి జీవనవిధానాల్లో వచ్చిన మార్పులతో మొదలైన ఈ ప్రక్రియ, హరప్పా నాగరికత పతనం వరకూ దాదాపు 6వేల సంవత్సరాలు సాగింది.  
నవీనశిలాయుగం క్రీపూ. 7000-4500
క్రీపూ. 8000 ప్రాంతంలో ఆఖరి మంచుయుగం అంతమయింది. భూమిపై వాతావరణంలో పెనుమార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ పెరిగడం వలన, కొన్ని వృక్షజాతులు వృద్ధి చెందాయి. వాటిలో ముఖ్యమైనవి లెగ్యూమినస్, గ్రామినై జాతులు. నేటికీ మన ఆహారంలో అత్యావశ్యకమైన కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, కొవ్వుపదార్థాలు అందించే ధాన్యాలు, పప్పు, నూనె దినుసులు, ఈ జాతుల నుండే లభ్యమవుతాయి. అంతేగాక, ఈ గడ్డినేలల వల్ల పశువుల పెంపకం కూడా సులభమైంది. అప్పటికే మధ్యశిలాయుగానికి చెందిన మానవుడిలో వృక్ష, జంతు జాతులపై పెరిగిన అవగాహన, ఆ కొత్త ప్రపంచంలో ప్రకృతిపై ఆధిక్యత సాధించేందుకు దోహదంచేసింది.

వ్యవసాయం, పశువుల పెంపకంపై అధారపడిన మొట్టమొదటి స్థిరనివాసాలు బోలాన్ కనుమ దిగువన ‘మెహర్‌ఘఢ్ ‘వద్ద వెలుగు చూసాయి. కార్బన్ 14 పరీక్షలు, మెహర్‌ఘఢ్ సంస్కృతి తొలిదశకి, కాస్త అటూయిటుగా క్రీపూ. 7300 తేదీని సూచించాయి.
సమకాలీన ప్రపంచంలో జోర్డాన్‌లోని జెరికో, ఇరాన్‌లోని ఆలికోష్, టర్కీలోని చటల్‌హ్యూయుక్ వంటి కొన్ని ప్రాంతాల్లో కూడా వ్యావసాయిక జీవనపు ఆనవాళ్లు కనుగొన్నారు. క్రీపూ. 7వ సహస్రాబ్ది మధ్యకాలానికి అవన్నీ గ్రామీణ ఆవాసాలుగా వృద్ధిచెందాయి.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలిన్ రెన్‌ఫ్రా వంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయంలో వ్యావసాయిక జీవనవిధానం మొదట టర్కీలో పుట్టి మిగిలిన ప్రాంతాలకు విస్తరించింది. మానవ జన్యుపదార్థంలో మంచుయుగం అనంతరం వచ్చిన కొన్ని మార్పుల (మ్యుటేషన్స్) ఆధారంగా, ఇండోయూరోపియన్ భాషలు  టర్కీ ప్రాంతంలో మొట్టమొదట వ్యవసాయం చేబట్టిన కాకేసియన్ జాతుల వలసల వల్ల విస్తరించాయని ప్రతిపాదించారు. ఒక భాష మాట్లాడే మూలవాసులు, మరోభాషలో పదాలు స్వీకరించాలంటే, ఆ కొత్త భాష సాంకేతిక పరంగా ఒక మెట్టు పైన ఉండాలి అని వారి వాదన.. అంటే వేదాల్లోని ‘వాక్కు’ అనబడే భాషకీ, వివిధ ప్రాకృతాలకి, మూలభాష ఆ మొట్టమొదటి వ్యావసాయిక జనజాతులకి చెందినది అనుకోవాలి.
కానీ మెహర్‍గఢ్ ప్రాంతంలో నవీన శిలాయుగం వేళ్లూనిన కాలానికీ (క్రీపూ. 6500), వేదాలనూ ఆదిపురాణాన్నీ సంకలనం చేసిన వేదవ్యాసుడి కాలానికీ (క్రీపూ. 1500) మధ్య ఐదు సహస్రాబ్దుల అంతరం ఉంది. పైగా మెహర్‌ఘఢ్ సంస్కృతి, టర్కీ జోర్డాన్ ప్రాంతాల స్థావరాలూ ఇవన్నీ కాస్త అటూయిటుగా ఒకే కాలానికి చెందినవి.
కనుక ఆ పురాసాంస్కృతిక భాష పుట్టుక ఎక్కడో నిర్దిష్టంగా చెప్పలేము.

రౌద్రబ్రాహ్మణం
కానీ ఈ వైదీక పౌరాణిక సంప్రదాయాల్లో కొన్ని అతిప్రాచిన కాలపు వాస్తవ సంఘటనల తాలూకు జ్ఞాపకాలు పొందుపర్చబడ్డాయి. అందువల్ల మన పురాణాల్లో, ఋగ్వేదంలో ఆనాటి వ్యావసాయిక సమాజాల పుట్టుక గురించి కొన్ని సూచనలు కనిపిస్తాయి.
ఋగ్వేదంలో అగ్నిదేవుని ఉద్దేశ్యించి చెప్పిన రౌద్రబ్రాహ్మణం అనే సంకలనంలో, రుద్రుడు వేసిన బాణం దెబ్బకి, ప్రజాపతి శుక్లం నేలబడటం వల్ల, సృష్ఠి జరిగిందని చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలో బీజం భూమిపై పడటంవల్ల కొత్త జీవం పుడుతుందనే అవగాహన మొట్టమొదటగా ఇక్కడే కనిపిస్తుంది. ఇది వ్యావసాయిక జీవనవిధానాన్ని సూచిస్తుంది. ఆ సంఘటనలో ముఖ్యపాత్ర, అగ్నికి పర్యాయమైన రుద్రునిది. తరువాతి కాలంలో, ఋగ్వేదంలోని రుద్ర-అగ్ని, పురాణాల్లోని శివుడికి ప్రతిరూపంగా కనిపిస్తాడు. పాడిపంటలు సంతానాభివృద్ధి కారకులైన హిందూ దేవుళ్లూ, దేవతలూ ఎందరున్నా వారిలో అగ్రతాంబూలం పశుపతి, వాస్తోత్పతి అయిన శివుడిది. రౌద్రబ్రాహ్మణం కూడా అగ్నిని, ‘వాస్తోస్పతి’గా (వాస్తుపురుషుడు) సంభోధిస్తుంది. ఈ సంఘటన మొట్టమొదటి వ్యావసాయిక సమాజ నేపధ్యాన్ని సూచిస్తుంది. మేరువు మరోపేరు వసుస్థలి అని ముందు వివరించాం.  
గ్రీక్ దేవుడు ‘డైయొనిసస్‌’ను శివుడికి ప్రతిరూపంగా భావించడం కూడా ముందు ప్రస్తావించాం. డైయొనిసస్‌ వ్యావసాయిక పశుపాలక సమాజాల దైవం. మెగస్తనీస్ ఇండికలో డైయొనిసస్‌ చంద్రగుప్తునికి 6040 సంవత్సరాల ముందు ఇండియాలో అడుగుపెట్టాడనే స్థానికుల సమాచారాన్ని రాసాడు. అంటే క్రీపూ. 6363లో మొట్టమొదటి వ్యావసాయిక సమాజాలు, భారత ఉపఖండంలో ఆవిర్భవించాయని పరోక్షంగా చెప్పడమే. కనుక రౌద్రబ్రాహ్మణంలోని  గాథ క్రీపూ. 7వ సహస్రాబ్ది మధ్యకాలంలో మెహర్‌ఘఢ్ ప్రాంతంలో మొదలైన వ్యావసాయిక సమాజాల నేపధ్యానికి చెంది వుండవచ్చు. అంటే మన సంప్రదాయక వాజ్ఞ్మయంలోని వాస్తవికని పురాతత్వ గవేషణలు, గ్రీకు చారిత్రకాధారాల ద్వారా మరో కోణంలో చూడవచ్చు.

 క్రీపూ. 5000 నాటికి మెహర్‌ఘఢ్ సుమారు 240 హెక్టేర్ల వైశాల్యంగల పట్టణంగా కనిపిస్తుంది. వాణిజ్యం విస్తరించింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇంద్రనీలం, మక్రాన్ తీరపు గవ్వలు, రాజస్తాన్ నుండి రాగి, హర్యానా నుండి తగరం, వింధ్య పర్వత ప్రాంతం నుండి తెల్లని చాల్కడనీ, గుజరాత్ నుండి సున్నపురాయి అక్కడి వస్తు సముదాయాల్లో కనిపించాయి. అంటే అనాటి మెహర్‌ఘఢ్ వాసులు వెయ్యి కిలోమీటర్ల కంటే దూరపు ప్రాంతాలనుంచి ముడి పదార్థాల కొనుగోలు చేసారు. ఆయా ప్రాంతాల్లో వేట, ఆహారసేకరణపై జీవించే పాతరాతియుగపు సంస్కృతులతో సంబంధాలు నెరపారు.
మెహర్‌ఘఢ్ నేపధ్యానికి చెందిన మరికొన్ని స్థావరాలు క్రీపూ. 5వ సహస్రాబ్దిలో  మొట్టమొదటగా వాయవ్య ఉపఖండంలో కనిపిస్తాయి (పటం). ఈ స్థావరాల్లో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ సముద్రమట్టానికి 500 అడుగులకన్నా ఎత్తున ఉన్నాయి. హరప్పా నాగరికత నదీ మైదానాలకి చెందినది. మెహర్‌ఘఢ్‌లో ఆరంభమైన ఆ శైశవ నాగరికత కొండదిగి మైదానాలకి రావడానికి మరో వెయ్యి సంవత్సరాలు పట్టింది. అందుకు దోహదం చేసిన పరిస్థితులు పరిశీలిద్దాం.

ఆర్యులు – క్రీపూ. 4500
 ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే జనజాతులనే ‘ఆర్యులు’ అని సంబోధించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇండోయూరోపియన్ భాషలు మాట్లాడే ప్రజలు ప్రపంచమంతా విస్తరించి కనిపిస్తారు. కానీ ‘ఆర్య’ పదం భారత ఉపఖండం, జొరాస్ట్రియన్ సంస్కృతి విస్తరించిన ఇరాన్ పీఠభూమి ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. కనుక ఆర్య శబ్దాన్ని భాషాపరమైన పదంగా కాక ఒక సంస్కృతిని సూచించేదిగా భావిస్తే, ఆర్యసంస్కృతి మూలాలను భారత ఉపఖండం పరిసరాల్లో వెదకవచ్చు.
జార్జియా యూనివర్సిటీ పురాతన వాతావరణ శాఖ శాస్త్రజ్ఞులు, క్రీపూ 4500 ప్రాంతంలో భూమి ఉత్తరార్థగోళంలో రెండుమూడు శతాబ్దాల కాలం సాగిన వాతావరణ పరిణామదశకి ‘అట్లాంటికం’ అని పేరుపెట్టారు. ఆ కాలంలో కర్కాటకరేఖకి కాస్త పైన (250N) నదీతీరాల్లో అనేకచోట్ల ఒక్కసారిగా వ్యావసాయక సమాజాలు ఆవిర్భవించాయి. ఈజిప్టులో నైల్ నది, మధ్య ఆసియాలో యూఫ్రేటస్, చైనాలో యెల్లోరివర్, అమెరికాలో దిగువ మిస్సిసిపీ నదుల వద్ద వ్యావసాయక సమాజాలు ఏర్పడ్డాయి.  
ఆ సమాజాల పుట్టుకకి కారణం 3 రకాల జీవనాధార వ్యవస్థల కలయిక.
1. నదీ, సముద్ర తీరాల్లో చేపలవేట
2. కొండ దిగువ మైదానాల్లో పశువుల పెంపకం
3. ఎగువ ప్రాంతాల్లో చిన్న వాగువంకలపై అధారపడిన సేద్యం
అట్లాంటికం దశలో గాలిలో తేమ, వర్షపాతం తగ్గి, వాతావరణం చల్లబడి పోయింది. కొండల్లో ఊరే జలలు ఎండిపోయాయి. సేద్యం, పశుపాలనలపై ఆధారపడ్డ జాతులు, నీటికొరకు నదీ తీరాలకి దిగిరాక తప్పలేదు.
మూడు జీవనవిధానాలు, మూడు సాంకేతిక వ్యవస్థలు ఒకచోట చేరాయి. కొత్త వనరులు లభ్యమయ్యాయి. అప్పటికే నీటిపై కట్టలు, కాలువలూ నిర్మించి చేపల, గవ్వల పెంపకం చేసే గంగపుత్రులు, రైతుకి సాగునీటి పరిజ్ఞానం కలిగిస్తే, పశుపాలకులు, కాడికి ఎద్దులూ, పశువుల ఎరువు సమకూర్చారు. పడవలూ, ఎడ్లబండ్లూ దూరాలు తగ్గించాయి. జనాభా పెరిగింది. వనరుల స్థానిక పంపిణీ వ్యవస్థ అంకురించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన గ్రామీణ సమాజాలు రూపుదిద్దుకోసాగాయి.
భారత ఉపఖండంలో సింధూ, సరస్వతీ మైదానాల్లో వచ్చిన ఈ పరిణామాల్లో ఆర్యుల గ్రామీణ వ్యవస్థ మూలాలు కనిపిస్తాయి.
మెహర్‌ఘఢ్ సంస్కృతిలోని వసువు ఈ నవీన గ్రామీణ సంస్కృతిలో వైశ్యుడయ్యాడు. వసు’, ‘విశ్ పదాల నిరుక్తార్థం ‘సంపద’. ఈ నూతన ఆర్థిక వ్యవస్థలో సేద్యం చేసిన రైతు మిగులు సంపదకి అధిపతి అయ్యాడు.
‘అర్’ అంటే నాగలి. ఏరియా, ఎకరం, ఆగ్రేరియన్, ఏరబుల్ వంటి వ్యావసాయక నేపధ్యానికి చెందిన పదాలకు మూలం ‘అర్’ శబ్దమే! ఆ ‘అరక’ పట్టిన రైతు ఆర్యుడయ్యాడు. ఆర్య పదానికి అధిపతి అనే అర్థం సంతరించుకొంది.
వైశ్యుడు, విశ్పతి, గృహపతి అయ్యాడు. అతడి సంపదను కాపాడుకొనేందుకు అతడికి మరో రెండు వృత్తులపై ఆధారపడక తప్పలేదు. సంపదను ప్రకృతి వైపరీత్యాలనుండీ, దైవ ఘటనలనుండీ కాపాడే బ్రాహ్మణుడు, చుట్టుపక్కల వారి ఆశ, అసూయలనుండి కాపాడే క్షత్రియులకు, ఆర్యుల సమాజంలో ప్రముఖ స్థానం కల్పించాడు. చేతవచ్చిన సాయంచేస్తూ గృహపతి దయపై ఆధారపడ్డ సేవకుడు శూద్రుడయ్యాడు. ఋగ్వేదంలోని పురుషసూక్తంలో కనిపించే వర్ణవ్యవస్థకి బీజం పడింది.   
ప్రాధమికంగా ఋగ్వేదంలోని ఆర్యుల సమాజం గ్రామీణ యాజమాన్య వ్యవస్థని ప్రతిబింబిస్తుంది. గోవు లావాదేవీలకు కరెన్సీగా పనిచేసింది. అంతేగాక ముఖ్య చరాస్తియైన గోవు, సంపదకి సమానార్థకం అయింది. అందువల్ల ఋగ్వేదపు ఆర్యులది పశువులు కాచుకునే సంచార జీవనసరళి అనే అభిప్రాయాన్ని, ఒక శతాబ్దికి పైగా పాఠ్యపుస్తకాల్లో పెంచి పోషించడం జరిగింది. తరచి చూస్తే, ఋగ్వేదంలో గోసంపద, పశువుల దొంగల మందపోట్లు, ప్రకృతి వైపరీత్యాలవల్ల దిక్కు తోచని ప్రార్థనలే కాదు; నౌకా వాణిజ్యానికి, రాచరికాలకీ, రాజకీయ కుట్రలకీ, కోటలకీ, నగర జీవనానికీ సంబంధించిన ఇతివృత్తాలు అనేకం కనిపిస్తాయి.
క్రీపూ. 4500 ప్రాంతంలో నదీ మైదానాల్లోకి గ్రామీణ సమాజాల రాకతో, సింధు సరస్వతి లోయల్లో తొలి కాంశ్యయుగ నాగరికతకి పునాది పడింది. ఋగ్వేదంలోని సంఘటనలనూ, ఇతివృత్తాలనూ హరప్పా సంస్కృతి నేపధ్యంలో రాతపరమైన ఆధారాలతో నిరూపించలేము. కానీ మన ఇతిహాస పురాణ సంప్రదాయంలోని రాజుల వంశావళుల కాలనిర్ణయాన్ని బట్టి, వేదాల్లోని వృత్తాంతాలే ఆధారంగా, కొంతవరకూ ఆ నాగరికత బాల్యదశలో, అంటే క్రీపూ. 3000కి ముందు వచ్చిన పరిణామాలని అంచనా వేయవచ్చు.

దేవీతమా నదీతమా సరస్వతీ
సత్లూజ్, యమునా నదుల కలయిక వల్ల ఏర్పడిన ఒకానొక మహానది, హరప్పా నాగరికతకి కేంద్రంగా ఉండిందని చెప్పడానికి అనేక శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయి. నేడు హర్యానా, రాజస్తాన్, పాకిస్తాన్‌లోని చోలిస్తాన్ ప్రదేశాల్లో ‘గగ్ఘర్’, ‘హక్రా’ అనే పేర్లతో పిలువబడే వర్షాధారపు నది, ఒకప్పుడు జీవనదిగా హిమాలయాల నుంచి అరేబియా సముద్రం వరకూ ప్రవహించిందనీ, దానినే వేదాల్లో, పురాణాల్లో సరస్వతి అని సంబోధించారనీ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. సత్లూజ్, యమునల ఎగువ నీరు, ఈ నది ద్వారా పాకిస్తాన్‌లోని చోలిస్తాన్ ఎడారి ప్రవేశించి, సింధునదికి సమాంతరంగా ప్రవహించి, నేటికీ ఆ నది దిగువ పాయగా మిగిలి ఉన్న ‘నారా’ నదిగా కచ్ వద్ద సముద్రంలో కలిసింది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ చిత్రాలు, భూగర్భజలాల విశ్లేషణల ద్వారా పురాయుగంలో ఆ నది ప్రవహించిన మార్గాన్ని కొంతవరకూ ఊహించవచ్చు (పటం). ఇండియా, పాకిస్తాన్ దేశాల పురాతత్వ శాస్త్రజ్ఞులు ఆ నదీమార్గంలో వెలుగులోకి తెచ్చిన వెయ్యికి పైగా హరప్పా నాగరికతకి చెందిన గ్రామీణ, పట్టణ ఆవాసాలు ఆ మహానది దిశని నిర్ద్వంద్వంగా నిరూపిస్తాయి.   
సంప్రదాయక వాజ్ఞ్మయంలో ఆ నదికి ఉన్న ప్రాముఖ్యం మరో నదికి లేదు. ఋగ్వేదం, ‘దేవీతమా! నదీతమా! సరస్వతీ!’ అంటూ ఆ నదినే కీర్తించింది. పురాణాలు, ఒకప్పటి ఆ మహానది భూగర్భంలో కలిసి అదృశ్యమైందని చెబుతాయి. క్రీపూ. 3వ సహస్రాబ్ది చివరి ప్రాంతంలో సత్లూజ్ నది తన ప్రవాహదిశ మార్చుకొని పశ్చిమంగా పయనించి సింధూనదిలో కలిసింది. యమున ప్రవాహం కూడా సరస్వతికి ఉపనది అయిన దృషద్వతి (నేటి చౌతాంగ్) నుండి వేరుపడి తూర్పుగా సాగి గంగ ఉపనది అయింది. దానితో సరస్వతీ పరివాహక క్షేత్రంలో ఏర్పడ్డ క్షామం వల్ల ఆ ప్రాంతంలోని జనావాసాలకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మనకి ప్రస్తుతమైన హరప్పా నాగరికతా క్షేత్రపు భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవాలంటే, ఆనాటి నదీ పరివాహక మార్గాలు, కాలానుగుణంగా వాటిలో వచ్చిన మార్పులూ కొంత ఆకళింపు చేసుకోవడం అవసరం.

ముగింపు
వేద వాజ్ఞ్మయంలో మరో ప్రాముఖ్యత కల్గిన నది, ‘సరయూ నది. నేడు గంగ ఉపనదిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిపించే గోగ్రా/సర్జూ నదికి మరోపేరు సరయు. పురాణ వంశావళుల్లోని చరిత్ర హరప్పాయుగానికి చెందివుంటే, సరయూనది ఉనికి గంగామైదానంలో ఉండేందుకు వీలులేదు. క్రీపూ. 1000కి ముందు గంగామైదానానికి నాగరికత విస్తరించలేదు.
మన వంశానుక్రమణికల కాలనిర్ణయాన్నిబట్టి పరిణత హరప్పాయుగాన్ని, పురాణాల్లోని త్రేతాయుగానికి సరితూచాం. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశపు రాజులు చక్రవర్తులుగా కనిపిస్తారు. హరప్పా నాగరికత పుట్టుకని అర్థం చేసుకొనేందుకు, సరయూ తీరంలోని ఇక్ష్వాకుల ముఖ్యపట్టణమైన, ‘అయోధ్యని గుర్తించక తప్పదు. మన వాజ్ఞ్మయంలో అందుకు సంబంధించిన ఆధారాలు, వచ్చే సంచికలో పరిశీలిద్దాం.
*

No comments:

Post a Comment