Friday, June 19, 2015

Island of Black Berries

Iమన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని
నేరేటి లంక
జంబూద్వేపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే ...
పౌరాణిక సంప్రదాయంలో మన చిరునామా ఇలా మొదలౌతుంది. చారిత్రక వాస్తవాలని గ్రహించేందుకు వంశావళుల కాలనిర్ణయంతో బాటూ ఆనాటి భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం కూడా అవసరం.
పురాణాల్లోని మౌలికమైన అంశాలు క్షత్రియ సంప్రదాయానికి చెందినవి.
కనుక అవి క్షత్రియుల వాస్తవిక చరిత్రని సూచిస్తాయి. కానీ కాలక్రమేణా అవి బ్రాహ్మణ మతగ్రంధాలుగా రూపాంతరం చెందాయి. ఎన్నో అద్భుత గాథలు ప్రక్షిప్తాలుగా చొరబడ్డాయి. ప్రస్తుత మన్వంతరానికి చెందిన వంశానుక్రమణికల తేదీలు హరప్పా నాగరికత, ఆ తదనంతర సంస్కృతికి చెందినవిగా సహేతుకంగా నిరూపించబడింది. దానికన్నా ముందరి కాలానికి చెందిన వాస్తవాలను తెలుసుకోవాలంటే మనం ఆ అద్భుత గాధలను ఆశ్రయించక తప్పదు. ఇటువంటి ఐతిహ్యాలు పురాణాల్లోనే కాక వైదిక సంప్రదాయంలో కూడా ఉన్నాయి. కానీ వాటి ఆధారంతో చారిత్రక వాస్తవికతని నిరూపించడం హేతుబద్ధం కాదు. వంశానుక్రమణికలకు అనుబంధంగా, మన పురాణ సంప్రదాయంలోని భౌగోళిక సమాచారంలో కొంత చారిత్రక వాస్తవికత నిలిచి ఉంది. ప్రాచీన భౌగోళికాంశాలు, వాతావరణానికి సంబంధించిన వివరాల్లో పౌరాణికులకి, పురాణవేత్తలకీ ఆసక్తి కనపడదు. కొత్త ప్రదేశాలకు, స్థలాలకూ ప్రాచీన సంప్రదాయంలోని పేర్లు పెట్టడం జరిగినా ఆ మార్పులూ చేర్పులు సులభంగానే గుర్తించవచ్చు. భౌతిక పురాతత్వ సంస్కృతుల పరిధులు దాటకుండా, పురాణాల్లో ప్రస్తావించిన భౌగోళిక వివరాలు పరీశీలించడం ద్వారా కొంతవరకూ చారిత్రక నిజాలని వెలికి తీయవచ్చు.

జంబూద్వీపం

అంటే నేరేడు చెట్ల లంక!
వంశావళుల్లో ఎందరో రాజులు, ఎన్నో వంశాలు. వాళ్లలో కొందరు మాత్రమే చక్రవర్తులుగా చెప్పబడ్డారు. చక్రవర్తి అనే పదానికి, 'జంబూద్వీపాన్ని అంతటినీ ఏకఛత్రం కింద పాలించిన రాజు' అనే అర్థం చెప్పవచ్చు. చారిత్రక యుగంలో అశోకుడు సమస్త జంబూద్వీపానికి చక్రవర్తిగా పిలువబడ్డాడు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు తప్ప అశోకుని రాజ్యం భారత ఉపఖండమంతా విస్తరించి కనిపిస్తుంది. కనుక జంబూద్వీపానికి భారత ఉపఖండమనే అర్థం చెప్పవచ్చు. కానీ పురాణాలు సూచించే కాలంలోని నాగరికత హరప్పా క్షేత్రానికే పరిమితమై కనిపిస్తుంది. ప్రాగ్‌హరప్పా యుగంలో, అంటే క్రీపూ. 3200కి ముందు కాలంలోని నాగరికత పరిధులను మరింత కుదించవలసి వస్తుంది. పురాణాల్లోని వివరాలనుబట్టి ఆనాటి భౌగోళిక జ్ఞానాన్ని అంచనావేద్దాం.
మన పురాణాల్లో భూమిని ఏడు ద్వీపాలుగా విభజించారు. అందులో జంబూద్వీపం, మనదైతే దాని చుట్టూ మరో ఆరు ద్వీపాలని సూచించారు. ముఖ్యంగా ద్వీపాల ఉనికిని గురించి శోధించిన పాశ్చాత్య మేధావులు, 'మనవి ఉత్త పుక్కిటి పురాణాలనీ, వాటిలో చారిత్రక సత్యం సూన్యమనీ,' అన్నారు. కొందరు పురాణాల్లో సూచించినది విశ్వాంతరాళాలకి చెందిన అలౌకిక ఖగోళ విశేషాలే కాని సహజ భౌగోళిక జ్ఞానం కాదన్నారు. వాస్తవానికి పురాణాల్లోని ద్వీపాల వర్ణనలను పరిశీలిస్తే అవి నిర్దిష్టంగా భూమిమీద కనిపించే ప్రకృతిని, వాతావరణాన్నీ సూచించేవే కానీ ఏవో నక్షత్ర మండలాల్ని గురించి కాదని గ్రహించవచ్చు. ఈ ఏడు ద్వీపాలూ భూతలంలో వివిధ ఖండాల చలనంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పులని సూచిస్తాయనే ఆధునికులూ ఉన్నారు, వీరికి ఆధారం, 1912 లో ఆల్ఫ్రెడ్ వెజెనర్ అనే భౌగోళికశాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్లేట్స్ టెక్టానిక్స్ సిద్ధాంతం. ఈ వాదం పూర్తిగా అసంబద్దం. ఎందుకంటే జంతు పరిణామ దశల్లో మానవుడి ఆగమనానికి 5 కోట్ల సంవత్సరాల ముందే వివిధ భూఖండాలు ప్రస్తుత స్వరూపానికి వచ్చాయి. ఇక ఈనాటి వరల్డ్ మ్యాప్‌ని పక్కనపెట్టుకొని పురాణాల్లోని సప్తద్వీపాలు, మనకి తెలిసిన ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణమెరికాలు, ఆస్ట్రేలియా, అంటార్కటికా అనే సప్తఖండాలే అనేవాళ్లు లేకపోలేదు. చెప్పుకోడానికి బాగున్నా ఇది హాస్యాస్పదం. పై వాదాలని పక్కనపెట్టి, సప్తద్వీపాలు చరిత్రలో మన పూర్వికులకి తెలిసిన కొన్ని ప్రాంతాలని సూచిస్తాయనే, ఎక్కువమంది ఆమోదించిన సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం. కానీ ఈ కోవకి చెందిన మేధావులు కూడా సప్తద్వీపాల వివరాలని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా ప్రతిపాదించారు. ముఖ్యమైనవి కింద పట్టికలో చూడవచ్చు.

 
ద్వీపాలు
జంబూ
ప్లక్ష
కుశ
శాల్మలి
క్రౌంచ
శక
పుష్కర
ప్రతిపాదనలు
ఉత్తర భారతదేశం
బర్మా
ఇండొనేసియా దీవులు
మలేసియా
దక్షిణ భారతదేశం
ఇండోచైనా
చైనా మంగోలియా
భారతదేశం
ఆసియా మైనర్
ఇరాన్
మధ్య ఐరోపా
పశ్చిమ ఐరోపా
గ్రేట్ బ్రిటన్
ఐస్‌‌ల్యాండ్
భారతదేశం
గ్రీకుదేశాలు
అరేబియా తీరదేశాలు
సర్మేటియా
ఆసియా మైనర్
స్కిథియా
తుర్కిస్తాన్

 
వీటిలో పురాణాల్లో సూచించిన భౌగోళిక, వాతావరణ విషయాలపై దృష్టికంటే 20వ శతాబ్ది మేధావుల బౌగోళిక జ్ఞానమే ఎక్కువ కనిపిస్తుంది. పురాణల్లోని షోడశరాజచరిత్రలో కృత, త్రేతాయుగాల్లో జంబూద్వీపాన్ని పాలించిన 16మంది చక్రవర్తుల ప్రస్తావనలు ఉన్నాయి. మనం అనుసరించిన కాలక్రమం ప్రకారం వీరందరు క్రీపూ. 3200 నుంచి 2000 మధ్యకాలానికి చెందుతారు. అంటే వాళ్ళు పాలించిన జంబూద్వీపం హరప్పా నాగరికత క్షేత్రంగా భావించవచ్చు. సప్తద్వీపాల నైసర్గిక, వాతావరణ వివరాలను బట్టి వాటిని హరప్పా నాగరికత పరిసర ప్రాంతాలుగా గుర్తించడం సమంజసం. పురాణాలు, ఈ ద్వీపాల ఆనవాళ్లు చెప్పేటప్పుడు వాటి పరిసరాల్లో 'మేరుపర్వతం', 'క్షీరసాగరం' వంటి భౌగోళిక ప్రదేశాలను తెలుపుతాయి. కనుక ముందుగా ఆయా ద్వీపాల గుర్తింపుకు కీలకమైన మేరుపర్వతం, క్షీరసాగరాల ఉనికిపై అవగాహన అవసరం.
 మేరుపర్వతం
1966లో 'జాగ్రఫీ ఆఫ్ పురాణాస్' రచించిన ప్రొ. ఎస్ ఎమ్ అలీ వంటి ఆధునిక శాస్త్రజ్ఞులు మేరువు ఉపఖండానికి ఉత్తరాన పామీర్‌ముడి ప్రాంతంగా అభిప్రాయపడ్డారు. పురాణాల్లోని మేరువు, మొట్టమొదటి మానవ సమాజాల ఉనికి, జంబూద్వీపమనే నాగరికతా క్షేత్రానికి నాభి వంటిది. అలాంటి మేరువు ఎక్కడో మారుమూల జనసంచారం లేని పామీర్ పర్వతాలపై ఉందంటే నమ్మలేము. పామీర్ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు 7.0 to 8.3 °C. అంటే వ్యవసాయిక సమాజాలే కాదు సంచార పశుపాలక సమూహాలు సైతం స్థిరనివాసం ఏర్పరుచుకోవడం కష్టం.
ఉత్తరదిశాధిపతి కుబేరుడి నగరం పేరు 'అలకా'పురి. ఇది మేరువు పాదపీఠంపై ఉన్నదని సంప్రదాయం. గంగ ఉపనదుల్లో ప్రధానమైన అలకనంద హిమాలయాల్లో మానససరోవరం వద్ద పుట్టి ఉత్తరాంచల్ రాష్ట్రంలో గంగానది చేరుతుంది. కనుక మానసరోవర ప్రాంతాన్ని, మేరువుగా గుర్తించిన వాళ్లూ ఉన్నారు. కానీ పురాణాల్లోని అలకాపురి ఒక అభివృద్ధి చెందిన పట్టణం, సంపదకి నిలయం, వాణిజ్యానికి పేరుగన్నది. కనుక ఎక్కడో హిమాలయాల్లో ఉండటానికి అవకాశం లేదు. మొట్టమొదటి వ్యావసాయిక సమాజాలు అంటే నవీనశిలాయుగపు సమాజాలు సముద్రమట్టం నుండి 1000 మీటర్ల కంటే తక్కువ ఎత్తున కనిపిస్తాయి. కాబట్టి మేరువు ఉనికిని నవీన శిలాయుగపు స్థావరాలకు దగ్గరగా, వాణిజ్యాభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో వెదకక తప్పదు.
అలకాపురి రాజు కుబేరుడు యక్షుడు. గంధర్వులకు అధిపతి. అత్యంత సంపన్నుడు. అతడు పుట్టుకతో అలకాపురికి చెందలేదు. పురుకుత్సుని కాలంలో సముద్రంలోని లంకను వదిలి, కొండల్లో కాపురం పెట్టాడు. ఆ అలకాపురికే మరికొన్ని పేర్లున్నాయి. అవి వసుస్థలి, వసుధర, ప్రభాస (ప్రభాసుడు అష్టవసువుల్లో ఎనిమిదవ వాడు). మేరువు ప్రాంతపు మూలవాసులు వసువులు. వసు అనే పదం 'వస' అంటే `గోవు లేదా సంపద' నుంచి వచ్చింది. వసువు పదానికి సంపన్నుడు అనే అర్థం. తరువాతి కాలంలో వసుంధర భూమికి పర్యాయపదంగా కనిపిస్తుంది. వాస్తు అనే పదానికి అర్థం కూడా నివాసయోగ్యమైన స్థలం. వాస్తుశాస్త్రం ముందుగా పట్టణాల నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం. ఈ అంశాలను బట్టి ఈ వసుస్థలి పశుపాలక వ్యవస్థనుండి మొట్టమొదటి పట్టణీకరణదిశగా ఎదిగిన ప్రదేశంగా భావించవచ్చు. సింధులోయకి వాయవ్యంగా విస్తరించిన హిందుకుష్-కిర్తార్ పర్వత శ్రేణుల్లోని ముఖ్యమైన కనుమ మార్గాలు ఖైబర్, బోలాన్ కనుమలు. ఈ రెండు కనుమల్లో పుట్టిన సింధు ఉపనదులు, స్వాత్, శోబ్ నదులు. స్వాత్ నదికి వేద వాజ్ఞ్మయంలోని పేరు సువాస్తు. అలాగే శోభ్ నదిని యువాన్ చువాంగ్ 'సు-పొ-ఫొ-సు-తు' (శుభవాస్తు)గా పిలిచాడు. కనుక ఈ రెండు కనుమలకు దారితీసే మార్గాల్లో అలకాపురిని అన్వేషించాలి. ముందుగా చారిత్రక ఆధారాలు చూద్దాం.
క్రీపూ. 2400 ప్రాంతంలో సుమేరియాకి చెందిన 'లుగుల్‌బండా' అనే రాజు తూర్పుదిశగా ఎన్నో పర్వతాలు లోయలూ దాటి అరట్ట అనే దేశానికి వెళ్ళిన కథ అక్కడియన్ మృణ్ఫలకాల్లో ఉంది. అరట్ట, సింధు ప్రాంతానికి చెందిందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆ కథలో 'ఉమ్మేరు' అనే కనుమ వద్ద అతడు పరివారంనుండి దూరమైయ్యాడు. ఆ ఉమ్మేరు ఒక సరిహద్దు చెక్‌పోస్ట్. సింధులోయకీ ఇరాన్ పీఠభూమికి మధ్య ఖైబర్, బోలాన్ కనుమల గురించి ముందే ప్రస్తావించాం.
గ్రీక్ గ్రంధం ఇండికలో అలెక్జాండర్ దండయాత్రలో పుష్కలావతి (పెషావర్) నగరానికి వెళ్ళే మార్గంలో 'మేరుస్' అనబడే పర్వతం వివరణ ఇలా ఉంది. "And the mountain near the city, on whose foothills Nysa is built, is called Merus because of the incident at Dionysus' birth..."
ప్రాచీన గ్రీకు దేవుడు డైయొనిసస్‌ని శివుడితో పోలుస్తారు. ఋగ్వేదంలోని రౌద్రబ్రాహ్మణం సృష్ఠి కార్యానికి రుద్ర/అగ్ని దేవుడినే బాధ్యునిగా చూపెడుతుంది. గ్రీకు వాజ్ఞ్మయంలో డైయొనిసస్‌ వ్యావసాయిక సమాజాలకు మూలపురుషుడు. చంద్రగు
ప్తునికి 6042 సంవత్సరాల ముందు డైయొనిసస్‌ మేరు ప్రాంతానికి వచ్చినట్లు స్థానికుల సమాచారమని ఇండికలో చెప్పబడింది. అంటే క్రీపూ. 6363 నాటికే మేరు పర్వత ప్రాంతంలో నవీనశిలాయుగం ఆరంభమై ఉండాలి.
పురాతత్వ శాస్త్రజ్ఞులు, కిర్తార్ పర్వత శ్రేణిలో బోలాన్ కనుమ దిగువన సముద్రమట్టానికి 800 మీటర్ల ఎత్తున 'శోభ్' లోయలో 'మెహర్‌గఢ్' పట్టణానికి సమీపంలో నవీనశిలాయుగ నాగరిక స్థావరాన్ని' కనుగొన్నారు. ఇది భారత ఉపఖండంలోనే కాదు 'ప్రపంచంలోనే మొట్టమొదటిది. అక్కడ క్రీపూ. 9000కు ముందే సంచార జనజాతుల ఆనవాళ్లున్నాయి. క్రీపూ. 6500 ప్రాంతానికి అదొక స్థిరమైన గ్రామీణ ఆవాసంగా 200 హెక్టేర్లలో అభివృద్ధి చెందింది. ప్రపంచ నాగరికతకి బీజమని చెప్పబడే 'ఫర్టైల్ క్రెసెంట్‌' భూభాగానికి చెందిన, అన్తోలియాలో 'చతల్‌హుయుక్', పాలస్తీనాలో 'జెరికో' వంటి ప్రాచీన ఆవాసాల కంటే కాస్త ముందే భారత ఉపఖండంలో నాటుకున్న విత్తనం, మెహర్‌గఢ్. ఇటుకలతో వరుసల్లో నిర్మించిన గిడ్డంగులు, మాతృదేవతారాధన, ఇంద్రనీలం, చంద్రకాంతం, కురువిందం, వైఢూర్యం వంటి మణులతో చేసిన ఆభరణాలు, సూక్ష్మశిలా పరికరాలు, బార్లీ, గోధుమ పంటలే కాక పత్తి విత్తనాలు, ఆవు, గొర్రె, మేక మొదలైన పశువుల పెంపకం, మెహర్‌గఢ్ సంస్కృతిని ఆనాటి ప్రపంచంతో పోలిస్తే ఒక అద్భుతంగా భావించవలసిందే. సింధులోయవంటి సమీప ప్రదేశాల్లో అప్పటికింకా వేటాడటం, ప్రకృతిసిద్ధంగా దొరికే ఆహారాన్ని పోగుచేయడం ద్వారా జీవనం సాగించే ప్రాచీన శిలాయుగపు జనజాతులకి ఆ 'మెరక' ప్రాంతంలో పశువులని పెంచుతూ పంటలు పండిస్తూ, స్థిరమైన కట్టడాలలో నివసించేవాళ్లు, మానవాతీతులుగా, వారి జీవన విధానం ఒక అద్భుతంగా కనిపించడంలో ఆశ్చర్యమేమీలేదు. ద్రవిడ భాషల్లో 'మేల్' అనే పదప్రయోగానికి అర్థాలు పశ్చిమం, ఎగువ ప్రదేశం అని మనకు తెలుసు. మెరక అనే తెలుగు పదానికీ 'మేరుక' అనే పదానికీ ఉన్న సామ్యం గుర్తించదగినదే. అక్కడియన్ భాషలో కూడా మేరు పదానికి ఎత్తైన ప్రదేశం అనే అర్థం ఉంది. సుమేరియా ఫలకాల్లోని మేలుహ్హ, మేలుఖ్క అనే పదాలు మేరుక రూపాంతరాలే. ఈనాటికీ జంబూద్వీపానికి చిరునామా 'మేరోర్దక్షిణదిగ్భాగే' అనే చెప్పుకుంటాం.
కనుక ఈ మెహర్‌గఢ్ ప్రాంతమే మేరుపర్వత స్థానమని నిర్ధారణకి వచ్చే ముందు, పురాణాల్లో మేరువు వర్ణనలని మరోమారు పరిశీలిద్దాం. మేరుపర్వతం గుండ్రంగా ఉంటుందనీ, షట్భుజమనీ, అష్టభుజమని, త్రికోణమనీ అనేక వర్ణనలు ఉన్నాయి. వేర్వేరు దిక్కులనుండి, ప్రదేశాలనుండీ చూసినప్పుడు భిన్నంగా కనిపించడం ఒక కారణమై ఉండవచ్చు. గర్గ సంహితలో మేరువు ఒక జడలా వంకరలు పోతూ పొడవుగా ఉన్నట్లు వర్ణించబడింది. దీన్నిబట్టి మేరువు ఒక పర్వతంగా కాక పర్వతశ్రేణిగా కూడా భావించవచ్చు. ఏదియేమైనా, ప్రపంచంలో అతి ప్రాచీన పట్టణీకరణ కేంద్రమైన కిర్తార్, హిందుకుష్ పర్వతశ్రేణిలోనే మేరువు ఉనికిని గుర్తించడం సమంజసం.

క్షీరసాగరం

సప్తద్వీపాల ఉనికిని గుర్తించేందుకు పురాణాల్లోని మరొక ముఖ్యమైన భౌగోళికాంశం, పాలసముద్రం. సాగరమధనం వృత్తాంతంలో చారిత్రకత ఉందోలేదో చెప్పలేము. కానీ ఆ కథ ఇతివృత్తం, పురాణాల్లో వర్ణనలూ, క్రీపూ. 2000 ముందుకాలంలోని భౌగోళిక పరిస్థితులు, గుజరాత్‌లోని కచ్ కడలిమలుపే (Gulf of Kutch) క్షీరసాగరం కావచ్చని సూచిస్తాయి. పురాతత్వ గవేషణల ఫలితాల్లో కూడా, ఈ అభిప్రాయాన్ని సమర్ధించే కొన్ని అంశాలున్నాయి. 
  1. వాయుపురాణం, మేరువుయొక్క ఒక శిఖరం పాలసముద్రంలో విసిరివేయబడిందని, అదే మంధర పర్వతమనీ చెప్తుంది. ఈనాటికీ కచ్ కడలిమలుపులోని కదీర్ బెట్ (కదీర్ ద్వీపం)లో హరప్పా నాగరికతకి చెందిన ప్రముఖ పట్టణం 'ధోలవీరా' తావులోని, ఒక ముఖ్యమైన యేరు పేరు 'మందర్'.
  2. సాగరమధనం కథలో విష్ణువు అదే పర్వతాన్ని కచ్చప రూపంలో (తాబేలు) వీపుపై మోసాడు. కచ్ఛపద్వీపమే కచ్.
  3. విష్ణువు నివాసమైన వైకుంఠం పాలకడలిలో ఉంది. భాగవత సంప్రదాయపు తొలి చారిత్రక ఆనవాళ్లు గుజరాత్ ప్రాంతంలోనే లభించాయి. విష్ణువు ఆఖరి అవతారమైన శ్రీకృష్ణుని నగరం ద్వారక అక్కడకి సమీపంలోనే ఉంది.
  4. బరోడాలోని సాయాజీరావ్ యూనివర్సిటీ పురాతత్వ శాఖవారి గవేషణల్లో కచ్ తీరంలో 'కీర్‌సార' అనే స్థావరం వెలుగుచూసింది. అది హరప్పా యుగానికి చెందిన రేవు. 'కీర్‌సార' సంస్కృత పదం 'క్షీరసాగరాని'కి రూపాంతరం. ఇది కూడా క్షీరసాగరపు ఉనికిని సూచిస్తుంది.

కచ్ కడలిమలుపు పురాతన కాలంలో పాలసముద్రంగా పిలువబడటానికి కారణాలు ఆనాటి భౌగోళిక స్వరూపంలో వెదకాలి. వేదవాజ్ఞ్మయంలో, పురాణాల్లో సరస్వతి అనబడ్డ ఒక పెద్ద నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. హిమాలయాల్లో పుట్టి సాగరంలో కలిసే ఈ నదిని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ చిత్రాలు, థార్, చోలిస్తాన్ ఎడారుల్లో భూగర్భజలాలపై జరిపిన పరిశోధనలు, ఆ ప్రాచీన నదీ పరివాహక్షేత్రంలొ అసంఖ్యాకంగా వెలుగుచూసిన హరప్పా నాగరికత స్థావరాలు, ఎగువ యమునా ప్రాంతంనుండి కచ్ కడలిమలుపు వరకూ క్రీపూ. 2000కు ముందు ప్రవహించిన మహానది ఆనవాళ్లను నిరూపిస్తాయి. సింధునది ఉపనదుల్లో అతి పెద్దదైన సత్లూజ్, గంగ ఉపనదియైన యమున ఎగువనీరు కలుపుకొని సిందునదికి సమాంతరంగా ప్రవహించి కచ్ కడలిమలుపులో కలిసింది. ఆ నదినే 'దేవీతమా నదీతమా సరస్వతీ' అని వేదాలు వర్ణించాయి. సింధు, సరస్వతీ అనబడే ఈ రెండు మహానదుల నుండి వచ్చిచేరే మంచినీటి వల్ల కచ్ కడలిమలుపులోని నీటిలో ఉప్పు శాతం తగ్గి అదొక ప్రత్యేకమైన పర్యావరణ క్షేత్రంగా ఆవిర్భవించింది. దానినే మన పూర్వికులు పాలసముద్రంగా పిలవడంలో ఆశ్చర్యమేమీలేదు. హరప్పా నాగరికతా క్షేత్రపు సముద్ర వాణిజ్యానికి అదే ముఖద్వారం. సముద్ర వాణిజ్యంపై ఆధిపత్యం కొరకు దేవతలు, అసురుల మధ్య స్పర్ధ, సాగరమధనం కథకి మూలమనే వాదం కూడా ఉంది. అనేక రేవుపట్టణాలతో అద్భుతమైన విలాస వస్తువులకు నెలవైన కచ్ ప్రాంతమే, క్షీరసాగరం అయేందుకు అవకాశం ఉంది. ఈ ఆధారాలనుబట్టి కచ్ కడలిమలుపే క్షీరసాగరం అనుకుంటే, పురాణాల్లోని సప్తద్వీపాల వివరాలు కొత్త కోణంనుండి చూడవచ్చు. 


సప్తద్వీపాలు


సప్తద్వీపాల వర్ణనల్లోని ప్రత్యేక వాతావరణం, స్థానిక వృక్షజాతులు, నదులు, మొదలైన భౌగోళిక అంశాల్లో, ప్రక్షిప్తాలు చొరబడే అవకాశం తక్కువ. పైన ప్రస్తావించినట్లు, హరప్పా నాగరికతా క్షేత్రం సమీపంలో ఆ ద్వీపాల ఉనికిని గుర్తించే ప్రయత్నం చేద్దాం. (పట్టిక)

ముగింపు

జంబూద్వీపం హరప్పా క్షేత్రం అనుకుంటే, దానికి ప్రకృతి, ఖనిజ వనరులను అందిస్తూ, నాగరికత క్షేత్రం చుట్టూ విస్తరించిన ప్రదేశాలని మిగిలిన ఆరు ద్వీపాలు సూచిస్తాయి. హరప్పా నేపధ్యంలో దొరికిన వస్తువుల ముడిపదార్ధాలకీ ఈ ప్రాంతాలకీ సంబంధముంది. హరప్పా వణిజులు ఆ ప్రాంతాల్లో నివసించే నవీనశిలాయుగ సమాజాలతో లావాదేవీలు జరిపిన ఆధారాలున్నయి. కనుక ఇతిహాసపురాణ సంప్రదాయంలోని జంబూద్వీపాన్ని హరప్పా నాగరికతా క్షేత్రంగా నిర్ధారించవచ్చు. ఆ జంబూద్వీపంలోని భౌగోళిక వివరాలు, నదీనదాలు, జనజాతుల ప్రస్తావనలు వచ్చే సంచికలో చూద్దాం.
*