Saturday, May 23, 2015

Harappan Ages & Yuga Cycle


మన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని
హరప్పా - యుగం
ఇంతకు ముందు సంచికలో మహాభారతయుద్ధకాలం తుది హరప్పా నాగరకత స్తరాలకి (క్రీపూ. 1460 ముందు) చెందినది అని ప్రతిపాదించాము. మన ఇతిహాసపౌరాణిక సంప్రదాయంలో భారతయుద్ధం ద్వాపరయుగం చివరలో సంభవించింది. క్షత్రియ వంశావళుల్లో, ఆ యుద్ధంలో పాల్గొన్న రాజులకి పూర్వులైన దాదాపు 95 తరాలు కనిపిస్తాయి. ఒక్కొక్క తరానికీ 18 యేళ్లనుకుంటే, సూర్య చంద్రవంశాల మూలపురుషుడైన మనువు, క్రీపూ. ముప్ఫై రెండవ శతాబ్ది మధ్యకాలానికి చెందుతాడు (1460+(94 X 18) = 3152). ఈ తేదీ హరప్పా యుగం ఆరంభదశకి సరిగ్గా సరిపోతుంది.
కనుక వంశావళుల క్రమం, వివిధ రాజుల మధ్య సమకాలీనతలు, సంబంధిత గాథల్లోని నిజానిజాలు శోధించే ముందు, హరప్పా నాగరికతపై ఇప్పటి వరకూ పురాతత్వ శాస్త్రజ్ఞులు వెలుగులోకి తెచ్చిన అంశాలను ఒకసారి పునఃపరిశీలించడం అవసరం.

 

హరప్పా నాగరికత
1920లో దయారామ్ సాహ్‌నీ హరప్పాలో, 1921లో రఖల్‌దాస్ బెనర్జీ మొహెంజొదారోలో, జరిపిన తవ్వకాల ఆధారంగా, 1924లో అప్పటి పురాతత్వ సర్వే డైరెక్టర్, జాన్ మార్షల్ సింధులోయలో కనుగొన్న పురాచారిత్రక నాగరికత గురించి అధికారికంగా ప్రకటించారు. మొట్టమొదటి స్థావరాలు సింధునది పరివాహక క్షేత్రంలోవి కనుక ఆ నాగరికత 'ఇండస్ వ్యాలీ సివిలిజేషన్‌' అనే పేరుతో ప్రపంచానికి పరిచయమయింది. గత 90యేళ్లలో ఆ నాగరికతకి చెందిన 1022 కి పైగా స్థావరాలు పురాతత్వవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు 400 నేటి పాకిస్తాన్‌లో ఉంటే, 600 పైగా భారతదేశంలో ఉన్నాయి. ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ సరిహద్దులోని షోర్తుగాయ్ నుండి, దక్షిణాన ఎగువ గోదావరి తీరంలోని దైమాబాద్ వరకూ, పశ్చిమాన బలుచిస్తాన్ ఇరాన్ సరిహద్దులోని సుక్తజెన్‌డోర్ నుండి, తూర్పున గంగా మైదానంలోని ఆలంగిర్‌పూర్ వరకూ 9 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి, ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పురాతనమైన కాంశ్యయుగ సంస్కృతిగా వెలుగులోకి వచ్చింది. వాటిలో అధిక సంఖ్యలో స్థావరాలు, గగ్ఘర్, హక్రా లోయలో ఉన్నాయి. గగ్ఘర్ నదే ఒకప్పటి సరస్వతీ నది అని శాస్త్రజ్ఞులు అంగీకరించారు. కాబట్టి సింధులోయ నాగరికతకి సరస్వతీ సంస్కృతి లేదా సింధుసరస్వతీ నాగరికతగా పేరుమార్చాలని కొందరు ప్రతిపాదించారు. కానీ ఈ నాగరికత సింధు సరస్వతి ప్రాంతాలకే పరిమితం కాదు. అత్యధిక సంఖ్యలో గుజరాత్‌లో బయటపడ్డ స్థావరాలకీ సింధు సరస్వతులకీ సంబంధం లేదు. పురాతత్వశాస్త్రంలో మొట్టమొదట వెలుగులోకి వచ్చిన స్థావరం పేరు ఆ సంస్కృతికి పెట్టడం ఆనవాయితీ. కాబట్టి ఆ నాగరికతని 'హరప్పా నాగరికత' అనడమే సమంజసం.
క్రీపూ. 3200 నుంచీ 1400 వరకూ కనిపించే ఈ సంస్కృతిని పురాతత్వవేత్తలు మూడు కాలవిభాగాలు చేసారు.

 

క్రీపూ 3200 - 2600
తొలి హరప్పాయుగం
ప్రాంతీయ సంస్కృతుల యుగం
క్రీపూ. 2600 - 2000
పరిణత హరప్పాయుగం
ఏకీకరణ యుగం
క్రీపూ. 2000 - 1400
తుది హరప్పాయుగం
వికేంద్రీకృత సంస్కృతుల యుగం

 
ఒక్కొక్క కాలవిభాగం దాదాపు ఆరొందల ఏళ్లు కొనసాగింది. తొలి యుగం ఈ నాగరికతా క్షేత్రంలో పట్టణీకరణ ఆరంభదశ. దీనిలో ముఖ్యంగా మూడు భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. ఆ వైవిధ్యం పరిణత హరప్పా యుగంలో కనిపించదు. పట్టణాలు మహానగరాలుగా అభివృద్ధి చెందటం, లిపి, వస్తు సంస్కృతిలో సామ్యత కానవస్తుంది. మూడవ దశలో హరప్పా మూలప్రాంతంలో పట్టణీకరణ క్షీణించి పరిధుల్లో కొనసాగడమేగాక ఆయా ప్రాంతాల్లో కొత్తపట్టణాల ఆవిర్భావం కూడా జరిగింది. క్రీపూ 1400 తరువాత ఈ సంస్కృతి పూర్తిగా పతనమైంది. మరో ఆరొందల యేళ్లవరకూ ఉత్తరభారతదేశంలో ఏమాత్రమూ ప్రగతి కనిపించదు.
క్రీపూ. 1400 మహాభారత యుద్ధాంతర కాలానికి సరిపోతుందని కొన్ని ఋజువులతో క్రిందటి వ్యాసంలో చూపించాము. భారతయుద్ధానికి ముందుకాలాన్ని ఇతిహాసపురాణ సంప్రదాయం మూడు యుగాలుగా విభజిస్తుంది. అవి కృత, త్రేతా, ద్వాపర యుగాలు. వంశావళుల్లో మనువు నుంచి కార్తవీర్యార్జునుని (పరశురాముడి) వరకూ కృతయుగం, హరిశ్చంద్రుని నుండి శ్రీరాముని వరకూ త్రేతాయుగం, భీమసాత్వతుని నుంచీ బలరాముని వరకూ ద్వాపరయుగం అని పురాణాలు ముక్తకంఠంతో చెప్తాయి. 

క్షత్రియ వంశావళుల్లో అయోధ్యకి చెందిన సూర్యవంశపు 94వ రాజు బృహద్బలుడు. ఇతడు భారతయుద్ధంలో అభిమన్యుడిచే చంపబడ్డాడని సంప్రదాయం. కనుక అతడు క్రీపూ. 1460కి చెందుతాడు. అతడికీ శ్రీరాముడికీ మధ్య 29 తరాల అంతరం ఉంది. తరానికి 18 యేళ్ల వంతున శ్రీరాముడు క్రీపూ. 2000 కి చెందాలి. అంటే పురాణల్లోని ద్వాపరయుగం పురాతత్వవేత్తల తుది హరప్పా యుగానికి సరిపోతుంది. ఇక శ్రీరాముడికీ హరిశ్చంద్రునికీ మధ్య 29 తరాల అంతరం ఉంది. అంటే పురాణల్లోని త్రేతాయుగం క్రీపూ. 2600 నుంది 2000వరకూ అంటే పరిణత హరప్పా యుగానికి సరితూగుతుంది. రామరాజ్యంగా ఈనాటికీ మనం చెప్పుకొనే త్రేతాయుగం, పురాతత్వ ప్రమాణాల రీత్యా, అసమానమైన ప్రగతికి అద్దంపట్టే పరిణత హరప్పాయుగంతో సరితూగడం మన ఇతిహాసపురాణ సంప్రదాయంలోని వాస్తవికతని ఋజువుచేస్తుంది.
భారతీయ చారిత్రక సంప్రదాయంలోని రాజుల సమకాలీనతల ఆధారంగా పర్జిటర్ నిర్మించిన వివిధ వంశాల క్రమాన్ని ఈ వ్యాసానికి అనుబంధంగా అందిస్తున్నాం. ఏ. ఎల్. భాషం తదితరులు పరిశోధనల ద్వారా నిరూపించిన రాజ్యకాలాల సరాసరి పరిమితులని జోడించడం ద్వారా, వంశావళుల్లోని వ్యక్తుల రాజ్యకాలాలని రమారమిగా సూచించడం జరిగింది. ఈ తేదీలకి ఎటువంటి శాసనాధారాలు లేవు. కానీ కొన్ని భౌగోళిక అంశాలు, సమకాలీన సమాజాల్లో దొరికిన ఆధారాలు, హరప్పా నేపధ్యంలో కాలానుగుణంగా వచ్చిన మార్పులు, పురాణ సంప్రదాయంలోని గాథల సంఘటనల తేదీలను బలపరుస్తాయి.
ముందుగా పట్టికలో ఇచ్చిన తేదీలను సమకాలీన సమాజాల్లో దొరికిన చారిత్రక ఆధారాలతో బేరీజు వేద్దాం.

 

మెసోపొటేమియా
క్రీపూ. 3200 నాటికి, ఇరాక్‌లోని యూఫ్రేటస్, టైగ్రిస్ నదుల లోతట్టు ప్రాంతంలో సుమేరియన్ నాగరికత, ఎగువ టైగ్రిస్ ప్రాంతంలో వికసించిన అక్కడియన్ సంస్కృతుల్లో, అభివృద్ధి చెందిన పట్టణాలు, విదేశ వాణిజ్యం, పరిణతి చెందిన మతవిశ్వాసాలు కనిపిస్తాయి. ఆనాటి పరిస్థితులని గ్రహించేందుకు దోహదపడే ముద్రికలూ, ప్రాచీన లిపిలో రచించిన మృణ్మయ ఫలకాలు దొరికాయి. హరప్పా నాగరికతా క్షేత్రంతో ఆ సంస్కృతులకి వాణిజ్య సంబంధాలు కొనసాగాయనడానికి ఈ రెండు ప్రాంతాల్లో దొరికిన ముద్రలే సాక్షం.
సుమేరియాలో తుది గ్రామీణ సంస్కృతుల కాలాన్ని 'ఉరుక్' యుగంగా వ్యవహరిస్తారు. ఈ యుగం క్రీపూ. 3100 ప్రాంతంలో అంతమై తొలి రాచరిక వ్యవస్థకి (జండెట్ నసర్) శ్రీకారం చుట్టబడింది. అదే కాలంలొ సంభవించిన పెద్ద జలప్రళయాన్ని గురించి ఆ సంస్కృతిలో కథలు ఉన్నాయి. శురుప్పాక్ అనే ప్రదేశంలో పురాతత్వ శాస్త్రజ్ఞులు జరిపిన తవ్వకాల్లో క్రీపూ. 3100 నాడు ఆ ప్రాంతం గొప్ప ముంపుకు గురియైన ఆనవాళ్ళు కనుగొన్నారు. ఆ వరద స్తరానికి ముందు ఉరుక్ సంస్కృతి, తరువాతి స్తరాలు తొలిరాచరికపు సంస్కృతిని సూచిస్తాయి. మన పురాణాల్లో మనువు కథ (మత్స్యావతారం) కూడా అలాంటి జలప్రళయాన్ని గురించి చెబుతుంది. మన పట్టికలోని మనువు కాలం శురుప్పాక్ జలప్రళయానికి సరితూగుతుంది. మనువు సంతతితో ఆరంభమైన సంప్రదాయక రాచరికం, తొలి హరప్పా సంస్కృతిలో మొదలైన ప్రగతికి సరిపోతుంది.

 
అక్కడియన్ మృణ్ఫలకాల్లోని 'ఎన్‌మెర్కర్' అనే సుమేరియా రాజు కథలో 'అరట్ట' అనే తూర్పు దేశపు ప్రసక్తి ఉంది. అరట్ట సింధునది ప్రాంతానికి చెందినదని భౌగోళిక ఆధారాలే కాక మహాభారతంలోని ప్రస్తావనలు కూడా సూచిస్తాయి. ఎన్‌మెర్కర్ 'ఉరుక్' రాజవంశానికి చెందినవాడు. అతడి రాజ్యకాలంలో అరట్ట దేశంలో నదీదేవత ఆగ్రహం వల్ల గొప్ప కరువు చోటుచేసుకుందట. అరట్ట దేశానికి రాజైన 'అల్ సగ్యుర్ అన్న' ఎన్‌మెర్కర్‌కి ధాన్యం రూపేణా కప్పం చెల్లించమని వర్తమానం పంపాడని కథనం. మన పురాణాల్లో సగర చక్రవర్తి కాలంలో వచ్చిన క్షామం, అతడి నూర్గురు లేదా 65వేలమంది కుమారులు శాపగ్రస్తులు కావడం, సగరుని మునిమనవడు భగీరథుడు గంగని భువికి దించి వారికి శాపవిముక్తి కలిగించడం చదువుకున్నాం. క్రీపూ. 2500-2400 ప్రాంతంలో సత్లూజ్ నది పశ్చిమానికి మళ్ళి సింధునదిలో కలవడం వల్ల సరస్వతీ పరివాహక క్షేత్రంలో కరువు వచ్చినట్లు ప్రముఖ పురాతత్వవేత్త 'రైక్స్' కూడా సూచించాడు. అదే సమయంలో మొహెంజొదారో ప్రాంతంలో వరదల కారణంగా మట్టి మేటవేసిన సూచనలు కూడా కనిపిస్తాయి. ఈ రెండు పరిణామాలకీ కారణం నదీ ప్రవాహ దిశలో వచ్చిన పెనుమార్పే. కాబట్టి ఎన్‌మెర్కర్ కథలోని అల్ సగ్యుర్ అన్న, మన పురాణ వంశావళుల్లోని సగరుడు ఒకరే అనుకోవచ్చు. మన పట్టికలో సగరుని రాజ్యకాలం క్రీపూ. 2432 - 2414. సుమేరియాపై అక్కడియన్ రాజు సార్గన్ దాడి క్రీపూ. 2250 ప్రాంతంలో జరిగిందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దానికి ఏడు తరాల ముందువాడు ఎన్‌మెర్కర్. అంటే అతడు కూడా 25వ శతాబ్దం చివరి దశకి చెందుతాడు. సగరుని కాలం ఎన్‌మెర్కర్ కాలానికి సరిపోతుంది.

కనుక మెసోపొటేమియాకి చెందిన పై రెండు ఆధారాలు మన పట్టికలోని కాలక్రమాన్ని, ఇతిహాసపురాణ సంప్రదాయంలోని క్షత్రియ వంశావళులు హరప్పా నాగరికత నేపధ్యానికి చెందిననే ప్రతిపాదనని సమర్ధిస్తాయి.
ముగింపు
క్షత్రియ వంశావళులు హరప్పా నాగరికత నేపధ్యానికి చెందినవి అనే ఈ వాదంతో ముందుకెళ్లాలంటే, ముందుగా ఆర్యుల వలస సిద్ధాంతానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలని పరీశీలించడం ఆవశ్యకం. హరప్పా నాగరికత మొగ్గతొడగక ముందే వాయవ్య భారత ఉపఖండంలో స్థానిక వ్యావసాయక పశుపాలక సంస్కృతులు కనిపిస్తాయి. ఆ భిన్న సంస్కృతుల కలయిక, సమకాలీన బాహ్య సమాజాలతో సంబంధాలు, హరప్పా నాగరికతగా రూపొందేందుకు దోహదం చేసాయి. వంశావళుల్లోని క్షత్రియ సంప్రదాయాన్ని పక్కన పెడితే, వేదవాజ్ఞ్మయంలో, పురాణ ఐతిహ్యాలలో, ఆ వ్యవస్థలకీ పరిణామాలకీ చెందిన కొన్ని సూచనలు కనిపిస్తాయి. హరప్పా యుగానికి చెందిన చరిత్ర విశ్లేషించే ముందు ఆ నాగరికతకి పునాదిగా పనిచేసిన ప్రాగ్‌హరప్పా సంస్కృతులని, అప్పటి భౌగోళిక నేపధ్యాన్ని వచ్చే సంచికలో పరిశీలిద్దాం.
*