Sunday, April 19, 2015

Mahabharat Times


మన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని
చరిత్రలో మహాభారతం
రాత మొదలైనప్పుడే చరిత్ర మొదలౌతుంది. అంటే లభ్యమైన ఆధారాలని బట్టి అలెక్జాండర్ రాకముందు భారతదేశానికి చరిత్ర లేదనే చెప్పాలి. మనం చదవగల్గిన రాతల్లో మొట్టమొదటిది భట్టిప్రోలులో దొరికిన రేకుముక్క, తరువాత అశోకుడు దేశమంతా చెక్కించిన శాసనాలు. అంతకు ముందుతరాల వాళ్ళు రాతపరంగా మనకేమీ మిగల్చలేదు.
ఈజిప్టు ఎడారుల్లోని రాళ్లపైన చెక్కిన రాతలు చెక్కుచెదరలేదు. మధ్య ఆసియాలో రాసి దాచిపెట్టిన మృణ్మయ ఫలకాల లైబ్రరీలు నిక్షేపంగా ఇప్పటికీ ఉన్నాయి. కానీ మనకలాంటి అదృష్టం లేదు. మనవాళ్లకి రాయడం తెలీదా, అంటే అదేమీ కాదు. క్రీపూ. 3000 నాటి కుండపెంకులు, మరో రెండు శతాబ్దాల అనంతరం హరప్పా సంస్కృతి ఆవాసాల్లో దొరికిన ముద్రలమీదా మనకి అర్థంకాని అక్షరాలు ఉన్నాయి. వేదవ్యాసుడు భారతం చెబుతుంటే వినాయకుడు దానిని రాసిపెట్టాడని మన కథలు చెబుతాయి. కానీ క్రీశ. 3వ శతాబ్దికి ముందటి రాతప్రతులేవీ మనకి లభ్యం కాలేదు. ఎంతోమంది రాజులూ చక్రవర్తులూ ఉన్నా చేసిన గొప్పలు రాళ్లపై చెక్కించిన వాళ్లు చాలా కొద్దిమంది. అందువల్ల మన ప్రాచీన సంప్రదాయంలోని పూర్వీకుల సమాచారాన్ని సమకాలీన రాతలూ శాసనాల ద్వారా నిరూపించడం సాధ్యంకాదు.

 

ఋగ్వేదం
ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి గ్రంధం ఋగ్వేదం. ప్రాచీన రాతప్రతులు లేకపోయినా ఒకరి నోట పలికింది మరొకరుగా, ఛందస్సు, శ్రుతి, క్రమం తప్పకుండా తరతరాలుగా సాగిన సంప్రదాయం. వేదాల్లో భాష పురాతనం. ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు దేశం నలుమూలలా వివిధ శాఖల్లో, చరణాల్లో సేకరించిన ఋక్కుల క్రమంలో కానీ, ఛందస్సులో కానీ, పదజాలంలో కానీ తేడాలు లేవు. ఉచ్ఛారణలో కొంత తేడాలున్నా బెంగాల్, వారణాశి, కంచి, ద్వారక, ఎక్కడైనా సరే మూలపదార్థంలో తేడాలేదు. అంటే వేలయేళ్లు, తరాలు గడిచినా ఆ సంహితలు మార్పులూ చేర్పులూ లేకుండా నిలిచాయి. భాషాపరిణామ శాస్త్రాన్ని అనుసరించి కూడా ఇండోయూరోపియన్ సాహిత్యంలో ఋగ్వేద సంహిత మొదటిది. ఋగ్వేద కాలానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ వాటిలో సామ్యంలేదు. మరీ సాగదీసి క్రీపూ 6వ సహస్రాబ్దికి ముందే అన్న వాదనలు పక్కనపెడితే, ఋగ్వేదరచన క్రీపూ. 4000 తరువాత జరిగిందనే సుభాష్ కక్ వంటి వారి ప్రతిపాదనల్లో కొంత నిజం ఉండి ఉండొచ్చు.
మన పురాణాల్లోని అంతర్గత సమాచారాన్ని బట్టి, ఋగ్వేదం మహాభారత యుద్ధకాలానికి ముందే ఉంది. పరాశరుడి కుమారుడైన కృష్ణుడనే ఋషి మూలవేదాన్ని మూడుగా విభజించి స్థిరీకరించాడు. అందుకే అతడిని 'వేదవ్యాసుడు' అంటాము. ఈ వేదవ్యాసుడి ప్రసక్తి వేదాల్లో లేదు. అంటే వామదేవ వశిష్ఠాది ఋషుల్లా, కవి ఉషానుడిలా ఆయన వేదాలు రాయలేదు, అప్పటికే ఉన్న ఋక్కులని సేకరించి క్రమబద్ధం చేసాడు. ఆ తరువాతే నాల్గవవేదమైన అథర్వణవేదం వేదత్రయానికి జోడించబడింది. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, వివిధ వేదాంగాలూ జతపర్చబడ్దాయి. ఈ ప్రక్రియ కొన్ని శతాబ్దాలుగా సాగింది.
వేదవాజ్ఞ్మయంలోని కొన్ని వ్యక్తినామాలు, భౌగోళికాంశాలు మనకి పురాణాల్లో కూడా తారసపడ్తాయి. అందుకని వేదాలని చరిత్రకి ముఖ్యాధారాలుగా స్వీకరించలేము. ఎందుకంటే ఇతిహాసపురాణ సంప్రదాయంలో అతిముఖ్య పాత్రధారులైన రాముడు, కృష్ణుడు వంటివారు వేదాల్లో కనపడరు. రావణవధ, మహాభారతయుద్ధం వంటి సంఘటనల ప్రసక్తి వేదాల్లో లేదు. అయితే, వేదవ్యాసుడి వృత్తాంతాన్నిబట్టి ఋగ్వేదం అతడి ముందుకాలానికి, మిగిలినవి ఆ తరువాత కాలానికి చెందినా, పురాణ సంప్రదాయానికి సంబంధంలేకుండా స్వతంత్రంగా రచించబడ్డాయి. వేదవ్యాసుడు మహాభారతయుద్ధ కాలానికి చెందిన వాడు. ఆదిపురాణమూ, 'జయ' అనబడే భారతేతిహాసమూ అతడి కాలానికే చెందాయి. కాబట్టి ఆ కాలానికి చెందిన పరిస్థితులపై అవగాహన కల్గితేనే ఈ రెండు భిన్న సంప్రదాయలపై ఏదైనా ఒక అభిప్రాయానికి రాగలం.

 

భారతయుద్ధం ఎప్పుడు జరిగింది?
మన చరిత్ర పుస్తకాల్లో ఆర్యులు తమ వలస క్రమంలో సింధులోయ, పంజాబ్ ప్రాంతాలని దాటి తూర్పు దిశగా యమునా నదీ ప్రాంతానికి ఆపైన గంగా మైదానానికీ విస్తరించారని చదువుకున్నాం. క్రీపూ. 14. 13 శతాబ్దాల్లో ఉపఖండంలో ప్రవేశించి కురుక్షేత్రం చేరేసరికి వాళ్లకి మూడు నాలుగు వందలయేళ్ళు పట్టింది.
కాబట్టి క్రీపూ. 11, 9 శతాబ్దాల మధ్య ఆ జనజాతుల్లో జరిగిన చిన్న స్పర్థని తరువాతి కాలంలో కవుల, కాల్పనికులు పెద్ద కావ్యంగా మార్చారనీ; వేదాల్లోనూ, వివిధ వేదాంగాల్లోనూ మహాభారతయుద్ధ ప్రసక్తి లేకపోవడానికి కూడా కారణం అదేనని తేల్చారు.
ఈ కాలాన్ని పురాతత్వశాస్త్రం రీత్యా చూస్తే భారతయుద్ధం హరప్పా నాగారికత పూర్తిగా పతనమైన తరువాత, గంగామైదానంలో పట్టణీకరణకి కొన్ని శతాబ్దాల ముందు జరిగినట్లవుతుంది. తవ్వకాల్లో నేటి ఢిల్లీ చుట్టుపక్క ప్రాంతాల్లో కొన్ని జనావాసాలు బయటపడిన మాట వాస్తవమే. వాటిలో దొరికిన మృణ్మయపాత్రల శకలాలు అంటే కుండపెంకులని బట్టి వాటిని Painted Grey Ware (PGW) సంస్కృతి అంటారు. ఈ సాంస్కృతిక స్తరం క్రీపూ. 1100 - 800 మధ్య కాలానికి చెందినది. అదే మహాభారతకాలానికి చెందిన సంస్కృతి అని ఎక్కువమంది ఆమోదించారు.
ప్రొ. బి.బి. లాల్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో ఒక గుట్టపై శాస్త్రీయ పద్ధతుల ద్వారా తవ్వకాలు జరిపారు. క్రీపూ. 1200 నుంచీ క్రీశ. 15వ శతాబ్ది వరకూ అంటే దాదాపు 2300ల యేళ్లు అక్కడ జనం నివసించిన ఆధారాలు కనుగొన్నారు. దానికే హస్తినాపురమని నామకరణం కూడా చేసేసారు. ఆ తవ్వకాల్లో బయటపడ్డ స్తరాల వివరాలు కింద పట్టికలో చూడవచ్చు.

 

స్తరం
తేదీలు
సంస్కృతి అవశేషాల వివరాలు
V
క్రీశ. 11 -15 శతాబ్దాలు
ఢిల్లీ సుల్తానుల నుండి మొఘల్ చక్రవర్తుల కాలపు అవశేషాలు, బాల్బన్ సుల్తాను ముద్రించిన నాణెం, కొన్ని జైన ప్రతిమలు.
ఖాళీ
IV
క్రీశ. 2 - 3 శతాబ్దాలు
రాగి, ఇనప పనిముట్లు, యౌధేయ, మథుర రాజుల నాణేలు, బోధిసత్త్వ మైత్రేయ విగ్రహపు తల, బ్రాహ్మి అక్షరాలున్న కుండ పెంకులు.
ఖాళీ
III
క్రీపూ. 6 - 3 శతాబ్దాలు
NBPW సంస్కృతికి చెందిన మృణ్మయ శకలాలు, కొలిమిలో కాల్చిన ఇటుకలతో కట్టిన ఇళ్ళూ, మురుగు కాలువలు. విద్ధాంక నాణేలు.
ఖాళీ
II
క్రీపూ. 11 - 8 శతాబ్దాలు
PGW సంస్కృతికి చెందిన పెంకులు, మట్టిగోడలతో కట్టిన పూరిళ్లు, ఒక కాలిన ఇటుక, కొన్ని పూసలు, గాజు గాజులు, మట్టిబొమ్మలు, గుర్రం, పంది, పశువుల ఎముకలు.
ఖాళీ
I
క్రీపూ. 1200
అక్కడక్కడా కొన్ని జేగురు రంగు కుండపెంకులే (OCP) కానీ ఎటువంటి కట్టడాలూ లేవు.
ప్రకృతిసిద్ధమైన ఒండ్రుమట్టి

 

ప్రొ. బి.బి. లాల్ వాదం ప్రకారం మహాభారతయుద్ధం పై పట్టికలోని రెండవ స్తరంలో జరిగింది. అంటే కౌరవుల రాజధాని నగరంలో ఇళ్లు రెల్లుగడ్డిపై తాపడం చేసిన బంకమన్ను భవంతులు. అందుకే భారతయుద్ధం రెండు ఊళ్లమధ్య జరిగిన ముఠా తగాదా కంటే గొప్పది కానేరదని తీర్మానించారు. ఈ తేదీ మ్యాక్స్ మ్యూల్లర్ పండితుడి అంచనాకి కూడా సరిగ్గా సరిపోతుంది.
అతడి అంచనా ప్రకారం వేదవాజ్ఞ్మయంలోని వేదాంగాలు, సూత్రాలు బౌద్ధానికి సమకాలీనం కనుక అవి క్రీపూ. 6వ శతాబ్దం తరువాత లిఖించబడ్డాయి. వేద సంహితలు బౌద్ధయుగానికి ముందువి. వాటిలో బ్రాహ్మణాలు రాయడానికి సుమారు 'రెండొందల' యేళ్ళు వేసుకుంటే, అది క్రీపూ. 800 అవుతుంది. ఇక ఋగ్వేదం కాక మిగిలిన మూడింటికి మరో 'రెండొందలేళ్లు', అంటే క్రీపూ. 1000. ఋగ్వేదం భారతానికి ముందుంది కనుక, భారతయుద్ధం క్రీపూ. 1000 - 800 ప్రాంతంలో జరిగి ఉండాలని సూచించాడు. బుహ్లర్, వింటర్నీట్జ్, జాకోబీ వంటి ప్రముఖులు మ్యాక్స్ మ్యూల్లర్ చేసిన 'రెండొందలేళ్ల' ప్రతిపాదనని ఆనాడే సందేహించారు. స్వతంత్రంగా వేదాలకి క్రీపూ. 2000కి ముందటి కాలాన్ని ప్రతిపాదించారు. మ్యాక్స్ మ్యూల్లర్ కూడా వారితో అంగీకరిస్తూ, తాను ప్రతిపాదించిన తేదీలు ఒక హైపాథెసిస్ మాత్రమే, అంటే అసలు నిజం తేలేవరకూ ఉజ్జయింపుగా పరిగణించుటకే అన్నాడు.
మరి భారతయుద్ధం తేదీ గురించి ఇతర అభిప్రాయాలు చూద్దాం.
క్రీశ. 7వ శతాబ్దిలో ఆర్యభట్టు ప్రాచీన గ్రహస్థితుల ప్రమాణాలని అనుసరించి యుగారంభం క్రీపూ. 3102లో ప్రారంభమైందని సెలవిచ్చాడు. ఇదే తేదీ రెండవ పులకేశి కాలపు అయ్యవోలు శాసనంలో కూడా కనిపిస్తుంది. అది కలియుగారంభమనీ, భారతయుద్ధానంతరమే కలియుగం ప్రవేశించింది కనుక యుద్ధం క్రీపూ. 3100 ముందు జరిగిందనే ఒక వాదం ప్రచారంలోకి వచ్చింది. కలియుగమంటే చీకటియుగం. క్రీపూ. 3100 నుండి భారతీయుల కాంశ్యయుగ నాగరికతలో ప్రగతి కనిపిస్తుంది కానీ వెనుకబడటం కనపడదు. మరి అదేలా? ఆర్యభట్టు యుగారంభం అన్నాడే కానీ కలియుగారంభం అనలేదు. కాబట్టి ఆ తేదీని కాసేపు పక్కన పెడదాం.
భవిష్యపురాణంలో కౌశాంబి, అయోధ్య, మగధల క్షత్రియ వంశావళులు ఉన్నాయి. (పట్టిక) పట్టికలో పరీక్షిత్తుకి ఐదవ తరంవాడైన 'నిచక్షువు' రాజధానిని హస్తినాపురం నుంచి కౌశాంబికి మార్చాడు. ఈ మూడు రాజవంశాలనూ చైద్యక్షత్రియులు అన్నారు. అంటే వీళ్ల మూలపురుషులు చేది ప్రాంతంనుండి వచ్చి గంగానదీ మైదానంలో రాజ్యాలు స్థాపించారు. కానీ వీరందరూ మహాభారతవీరుల సంతతిగా చెప్పుకున్నారు.


చంద్రగుప్తమౌర్యునికి ముందు నందరాజులు 90 యేళ్లు, వారికి ముందు పదిమంది శైశునాగులు 163 యేళ్లు, ఐదుగురు ప్రాద్యోతులు 152 యేళ్ళు రాజ్యం చేసారు. అంతకు ముందు బ్రాహద్రథుల్లో భారతయుద్ధం తరువాత ఆరవతరం వాడైన 'సేనాజిత్తు', అయోధ్య వంశంలో నాల్గవరాజు 'దివాకరుడు', కురుపాంచాల వంశపు నిచక్షువు తండ్రి 'అధిసీమకృష్ణుడి' సమకాలీనులు. అధిసీమకృష్ణుని యాగశాలలో భవిష్యపురాణం మొట్టమొదటిసారి చెప్పబడిందని ఐతిహ్యం. నిచక్షువుకీ ప్రద్యోతుడికీ మధ్య అంతరం 16 తరాలు. తరానికి 18 యేళ్లు కేటాయిస్తే 288 యేళ్లు. అంటే కోశాంబి రాజ్యస్థాపన (321+90+163+152+288=1014) క్రీపూ. 1014లో జరిగినట్లు. ఆ తేదీ గంగామైదానంలో పట్టణీకరణ శైశవదశకి సరిగ్గా సరిపోతుంది. ఆ తేదీకి ఐదు తరాల ముందు కోశాంబికి 400 మైళ్లు వాయవ్యంలో కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది అనుకోవాలి.
కానీ, పురాతత్వశాస్త్రజ్ఞుల తవ్వకాలు పరిశీలిస్తే క్రీపూ. 1400 తరువాత ఉత్తరభారతదేశంలో పట్టణాలు పూర్తిగా క్షీణించాయి. మరో ఐదు శతాబ్దాలవరకూ చెదురుమదురుగా కనపడే గ్రామీణ ఆవాసాల సంఖ్య కూడా చాలా తక్కువ. దీన్నిబట్టి ఆనాడు దేశంలో జనసంఖ్య కూడా బాగా తగ్గివుండాలి. రాజస్తాన్‌లోని పుష్కర, దిద్వానా సరోవరాల అడుగున ఒండ్రుమట్టి స్తరాల్లోని పుప్పోడి రేణువుల సంఖ్య ఇన్ఫ్రారెడ్ ల్యూమినిసెన్స్ పద్ధతి ద్వారా పరిశీలించిన మియాకీ యూనివర్సిటీ (జపాన్) శాస్త్రజ్ఞులు, అదే కాలంలో వృక్షసంపద కూడా క్షీణించిందని ప్రతిపాదించారు. కనుక మహాభారతంలో కనిపించే రాజకీయ వాతావరణాన్నిబట్టి, ఆ యుద్ధం క్రీపూ. 1400 తరువాత, 800కి ముందూ జరిగి వుండటానికి అవకాశం తక్కువ.
తుదిహరప్పా యుగం
ఇక పురాణాల్లోని మగధ రాజవంశాల పట్టికలో మహాపద్మనందుని ప్రసక్తి ఇలా ఉంది.
మహాపద్మ అభిషేకత్ స్తు యావజ్జన్మ పరీక్షితః
ఏవం వర్ష సహస్రంతు జ్ఞేయం పంచదశుత్తరం
అంటే పరీక్షిత్తు తరువాత 1050 సంవత్సరాలకి మహాపద్మనందుడి రాజ్యాభిషేకం జరిగింది. నవనందులు 90 యేళ్ళు రాజ్యం చేసారు. ఆ తరువాత ఆఖరి నందరాజుని వధించి చంద్రగుప్తుడు క్రీపూ. 321లో అధికారంలోకి వచ్చాడని అందరూ అంగీకరించినదే (321+90+1050=1461). పరీక్షిత్తు యుద్ధానంతరం పుట్టాడు. అదే నిజమైతే, భారతయుద్ధం 1460కి కొంత ముందు జరిగిందనుకోవాలి.
ఈ తేదీని సమర్ధించే ఆధారాలేమైనా ఉన్నాయా? నిరూపణలకి ముందు పురాతత్వ ఆధారలనుబట్టి ఆనాటి పరిస్థితులని అంచనా వేద్దాం.
క్రీపూ. 1900 నుంచి 1400 వరకూ ఆ ప్రాంతంలో లభించే పురాతత్వ సంస్కృతులను 'తుదిహరప్పా యుగం' అంటారు. క్రీపూ. 1900 నాటికి సింధులోయలో హరప్పా సంస్కృతి క్షీణదశ ఆరంభమైంది. హరప్పా, మొహెంజొదారో వంటి పట్టణాలు అప్పటికే పతనమయ్యాయి. దాని కారణాల గురించి చరిత్రకారుల్లో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఆ కాలంలో నదీ పరివాహక మార్గాల్లో వచ్చిన మార్పులు ఒక ముఖ్యకారణంగా కనిపిస్తాయి. అక్కడి మానవ సమూహాలు వలసపోక తప్పలేదు. వలసలు ముఖ్యంగా తూర్పు, దక్షిణ దిశల్లో సాగాయి.

ఇప్పటి సత్లూజ్, యమున మధ్యప్రాంతంలో సుమారు 550 హరప్పా తుదిదశ ఆవాసాలు వెలుగుచూసాయి. ఇవన్నీ క్రీపూ. 1900 నుండి 1400 మధ్యకాలానికి చెందినవి. వేదవాజ్ఞ్మయంలో సత్లూజ్, యమునల మధ్య ప్రాంతానికి మధ్యదేశం అని పేరు. భారతయుద్ధభూమి కురుక్షేత్రం అక్కడే ఉంది. ఈ ప్రదేశం క్రీపూ. 1500 ప్రాంతంలో ఉత్తరభారతదేశపు నాగరికతకి కేంద్రబిందువు. భారతకథలోని ముఖ్యరాజ్యాలైన కురు, పాంచాల దేశాలు (కౌరవపాండవులు, ద్రుపదుడు) అదే ప్రాంతానికి చెందినవి. కథలో ప్రముఖ పాత్రధారులై వైవాహిక సంబంధాలు నెరపిన మద్ర (మాద్రి), గాంధార (గాంధారి), మత్స్య (విరటుడు) దేశాలు మధ్యదేశానికి పశ్చిమంగా ఒకప్పటి హరప్పా నాగరికతా మూలప్రాంతంలో తక్కువ ప్రాముఖ్యంతో కనిపిస్తాయి. ఇక గుజరాత్, సింధూ తీరప్రాంతం (సైంధవుడు-దుస్సల భర్త), మాల్వా, వింధ్యశ్రేణి ప్రాంతంలో మరో తుదిహరప్పా నాగరకతా క్షేత్రం కనిపిస్తుంది. యాదవ రాజ్యాలైన, ద్వారక (కృష్ణుడు), చేది, విదర్భ(కుంతిభోజుడు) ఈ ప్రాంతానికి చెందినవే. భారత కథలోని ముఖ్యులు, వారితో వైవాహిక సంబంధాలు నెరపిన రాజ్యాలన్నీ భౌగోళికంగా తుది హరప్పా యుగపు నాగరికత విస్తరించిన ప్రాంతాలకే పరిమితమై కనిపిస్తుంది (పటం). కనుక భారతయుద్ధం తుదిహరప్పాయుగపు చివరిదశలో అంటే క్రీపూ. 15వ శతాబ్దిలో జరిగి ఉండేందుకు అవకాశం ఉంది.

కలియుగం
మన పురాణాలు శ్రీకృష్ణుడు అవతారం చాలించడంతో కలియుగం ఆరంభమయిందని చెప్తాయి. యాదవుల్లో ముసలం పుట్టి ఆ జాతి ప్రాముఖ్యం కోల్పోవడం, వారి ముఖ్యపట్టణమైన ద్వారక సముద్రపు ఉప్పెనలో మునిగిపోవడం, కలియుగారంభంలోనే జరిగాయి. మన ఇతిహాస పురాణ సంప్రదాయం ప్రకారం ఈ సంఘటనలు భారతయుద్ధం తరువాత కొద్దికాలానికే జరిగాయి. గుజరాత్ పశ్చిమతీరంలో సముద్రాంతర పురాతత్వ పరిశోధనల్లో వెలుగుచూసిన ద్వారకా నగరం గురించి ఇంతకు ముందు కూడా ప్రస్తావించాము. ప్రొ. షికారీపుర రంగనాథరావ్ ఆద్వర్యంలో, గోవాలోని న్యాషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫి సంస్థ 2001 నుంచీ 2009 వరకూ జరిపిన పరిశోధనల్లో, నేటి ద్వారక వద్ద సముద్రగర్భంలో ఆరు కిలోమీటర్ల నిడివిలో తుదిహరప్పా కాలపు రేవు పట్టణాన్ని కనుగొన్నారు. పురాతత్వ అవశేషాలు, రేడియో కార్బన్ కాలనిర్ణయాన్ని బట్టి ఆ పట్టణం క్రీపూ. 1520 తరువాత 1400కు ముందు సముద్రంలో మునిగిపోయింది. ఆ మునిగిన పట్టణమే కృష్ణుని రాజధాని ద్వారక అయితే, అది మనం ప్రతిపాదించిన మహాభారతయుద్ధ కాలాన్ని నిరూపిస్తుంది.
భారతీయ ప్రాచీన చారిత్రక సంప్రదాయానుసారం యుద్ధానంతరం ఆదిపురాణ సంకలనం జరిగింది. అది భారత యుద్ధంతో పరిసమాప్తం అయింది. తరువాత కలియుగానికి చెందిన వంశావళులని చెప్పే భవిష్య పురాణం, మొదటిసారిగా అధిసీమకృష్ణుని కాలంలో (క్రీపూ. 1014) చెప్పబడిందని పైన ప్రస్తావించాం. అంటే ఈ రెండు పురాణ సంప్రదాయాల మధ్య నాలుగు శతాబ్దాల కాలవ్యవధి ఉండాలి. ఆ నాలుగు వందల యేళ్లలో రాజులు, రాజ్యాల ప్రసక్తి లేదు. వంశావళుల్లో గాయబ్‌ అయిన ఈ నాలుగు శతాబ్దాల్లో ఉత్తరభారతదేశంలో పరిస్థితులు ఒకసారి పరిశీలిద్దాం. పురాతత్వ ఆధారాలనుబట్టి అదొక చీకటి యుగం. క్రీపూ 1400 తరువాత హరప్పా సంస్కృతి పూర్తిగా పతనమైంది. అక్కడక్కడా వెలికివచ్చిన గ్రామీణ ఆవాసాలు తప్ప పట్టణాల జాడే కనుపించదు. క్రీపూ 15వ శతాబ్ది ముందు 500 పైగా పట్టణ గ్రామీణ స్థావరాలున్న ప్రాంతంలో మచ్చుకి 20 గ్రామీణ ఆవాసాలు కూడా వెలుగుచూడలేదు. జనసంఖ్య తగ్గింది. వ్యవసాయం వృక్షసంపదా క్షీణించాయి. మళ్లీ క్రీపూ. 10వ శతాబ్ది వరకూ ఏమాత్రమూ ప్రగతి కనిపించదు. అభివృద్ధి చెందిన పట్టణాలు క్రీపూ 8వ శతాబ్ది వరకూ కనపడవు.
అవే పరిస్థితులని పురాణాలు కూడా ఏకరువు పెట్టాయి. రాజ్యాలు నశించాయి, గ్రామాలు పట్టణాలూ వల్లకాళ్లయ్యాయి, ఋషులకూ, బ్రాహ్మణులకూ అడవుల్లోని ఆశ్రమాలే దిక్కయ్యాయి. బిచ్చమేసే దాతలు కరువయ్యారు. ఇక వేద వాజ్ఞ్మయంలో ఆరణ్యకాలు అదే కాలంలో రచించబడ్డాయి. ఇతివృత్తాలు కూడా పట్టణాలు, రాజులు, యజ్ఞయాగాదుల ప్రస్తావనలు కాక తాత్వికవాదాలు, పరలోక చింతనల్లో పడ్డాయి. ఇక పురాణాల విషయానికొస్తే, రాజులే లేని కాలంలో వందిమాగధులకి భుక్తి ఏపాటికి? మళ్లీ నాగరిక సమాజం పునరుద్ధరించబడే వరకూ ఆ సంప్రదాయం కూడా మూలబడింది. అడవుల్లో కందమూలాలు తింటూ, సరైన ప్రతిఫలం లేకపోయినా సంప్రదాయాన్ని సజీవంగా ఉంచిన ఆనాటి ఆశ్రమవాసులు ధన్యులు. వారికి ముందుయుగాల్లోని కథలూ గాధలూ, సంస్కృతి ఒక అద్భుతంగా కనిపించింది. వాటితో బేరీజు వేస్తే ఆనాటి సాంఘిక పరిస్థితులు అన్ని అంశాల్లో పతనం చెంది కనిపించాయి. ఆ చీకటియుగానికే 'కలియుగం' అని పేరుపెట్టారు. తరువాతి కాలంలో కొన్ని శతాబ్దాల అనంతరం వచ్చిన ప్రగతి కూడా ముందుయుగాల్లో అద్భుతంగా చిత్రించబడ్డ వృత్తాంతాల ముందు దిగదుడుపే అయింది.
ముగింపు
భారతయుద్ద కాలాన్ని గురించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ముఖ్యమైన ప్రతిపాదనలు రెండు:
1.    అర్యభటుడు ప్రతిపాదించిన యుగారంభం - క్రీపూ. 3102
2.    మాక్స్ మ్యూల్లర్ తదితరుల PGW సంస్కృతి - క్రీపూ. 900
క్రీపూ. 3100 నుంచీ హరప్పా తొలియుగం నాగరికతలో ప్రగతి కనిపిస్తుందే కానీ క్షీణదశని సూచించదు. అదే విధంగా క్రీపూ. 900 నుంచీ ఉత్తరభారతదేశపు జనపథాల్లో రెండవ పట్టణీకరణ మొదటిదశ ఆరంభమయింది. పురాతత్వ ఆధారాలను బట్టి చూస్తే ఈ రెండు తేదీలూ ఇతిహాసపురాణ సంప్రదాయంలో వివరించబడ్డ పరిస్థితులతో ఏకీభవించవు.
కనుక పౌరాణిక వాజ్ఞ్మయంలో సూచించబడ్డ క్రీపూ. 1461 తేదీ మహాభారత యుద్ధకాలానికి చెందిన భౌగోళిక, సామాజిక పరిస్థితులకి, ఆనాటికి చెందిన పురాతత్వ ఆధారాలకీ సరిపోతుంది. ద్వారక పరిశోధనల్లో లభ్యమైన కార్బన్ 14 తేదీలు, సరస్వతీ, దృషద్వతీ లోయల్లో, గుజరాత్‌లో అసంఖ్యాకంగా వెలుగుచూసిన తుదిహరప్పా యుగపు గ్రామీణ పట్టణ స్థావరాలు ఈ తేదీని బలపరుస్తాయి. అంతేగాక భాషాపరిణామ శాస్త్రాన్ని బట్టి చూసినా వేదవ్యాసుడి ద్వారా భారత యుద్ధకాలంలో సంకలనం చేయబడ్డ సంహితల్లోని భాష అదే కాలానికి చెందుతుంది.
భారతీయ ప్రాచీన చారిత్రక సంప్రదాయంలో అంతకు ముందటి క్షత్రియ వంశావళులని, సమకాలీన సామాజిక, రాజకీయ సమాచారాన్ని, గాధలని పరిశీలించి, అవి హరప్పా యుగపు భౌగోళిక, పురాతత్వ ఆధారాలతో సరితూగితే మన ఇతిహాసపురాణ వాజ్ఞ్మయంలోని చారిత్రక వాస్తవికతపై ఒక నిర్ణయానికి రాగలం. ఆ ప్రయత్నం వచ్చే సంచికలో చేద్దాం.
*

No comments:

Post a Comment