Wednesday, April 1, 2015

Do Indians have any Historical Sense?


మన పురాణాల్లో వాస్తవికత
సాయి పాపినేని
జయశ్రీ నాయని

 
భారతీయులకి చారిత్రక స్పృహ లేదా?

 

అదే నాటి మేధావుల తీర్మానం!
18వ శతాబ్దంలో పాశ్చాత్య వలసవాదులకి భారతీయ సమాజం ఒక శిలాజంలా కనిపించింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా, కాలంచెల్లిన అచారాలూ గుడ్డి నమ్మకాలతో ఎదుగూబొదుగూ లేని జీవితాలు వెళ్లదీసే హిందువుల పట్ల చులకనభావం ఆనాటి మేధావి వర్గంలో కూడా చోటుచేసుకుంది. పరస్పర వైరం అసూయలతో పిల్లీ పిల్లీ తగవుల్లా దేశాధికారాన్ని బంగారు పళ్లెంలో అర్పించడం, భారతీయులపై వారికున్న దురభిప్రాయం మరింత బలపడటానికి దోహదం చేసింది. ఇక చరిత్ర విషయానికొస్తే మహమ్మదీయ చరిత్రకారుల గ్రంధాలు మధ్యయుగానికే పరిమితమయ్యాయి. ప్రాచీనచరిత్ర, బ్రాహ్మణ మతగ్రంధాల్లోని ప్రక్షిప్తాలు, కల్పనల మధ్య మరుగున పడిపోవడం, నాటి హిందూ అగ్రవర్ణాల్లో వాటిలోని వాస్తవికతపై అవగాహన లేకపోవడం వల్ల వెలుగు చూడలేదు.
మరో ముఖ్యకారణం అనాటి పాశ్చాత్యుల్లో కూడా మానవుడి ప్రాచీనతపై అవగాహన లేకపోవడం. ప్రాధమికంగా, పాశ్చాత్యులు క్రైస్తవులు. బైబిల్లో చెప్పినట్లు దేవుని సృష్ఠి క్రీస్తుకి నాలుగువేల సంవత్సరాల ముందు జరిగిందనే ఆనాటి నమ్మకం. అంతకు వేలయేళ్ల ముందే భారతదేశంలో రాజ్యాలు, రాచరికాల గురించి చెప్పే, భారతీయ ఇతిహాసాలూ పురాణాల్లోని వృత్తాంతాలు వారికి నమ్మసక్యం కాకపోవడమే కాదు, హాస్యాస్పదంగా తోచాయి. ఆ విధంగా నాటుకున్న దురభిప్రాయం తరువాతి కాలంలో డార్విన్ సిద్ధాంతం, ఆ పైన మారిన మానవశాస్త్ర నేపధ్యంలో కూడా తొలగిపోలేదు.
విలియమ్ జోన్స్, మాక్స్ మ్యూల్లర్ వంటి వారి కృషి పాశ్చాత్యుల్లో సంస్కృత సాహిత్యం, వైదిక సంస్కృతులపై జిజ్ఞాస కలిగించింది. సంస్కృతానికి, ప్రాచీన ఐరోపా నాగరిక భాషలైన గ్రీక్, ల్యాటిన్, ఇంకా జర్మన్, ఇంగ్లీష్‌వంటి వాడుక భాషలతో ఉన్న సామీప్యం ఆనాటి మేధావులు, భాషాశాస్త్రజ్ఞులు గుర్తించారు. కానీ భారతీయ భాషలను ఆ ఇండోయూరోపియన్ భాషా వృక్షానికున్న చిటారు కొమ్మలుగా సిద్ధాంతీకరించి వాటి మూలాలను ఇండియాలో కాక ఇతర ప్రాంతాల్లో వెదికారు. వాటిలో ఇండోయూరోపియన్ భాషలకి తూర్పు ఐరోపా మూలస్థానమని, ఆర్యుల దండయాత్రల వల్ల ఆ భాషలు అనేక ప్రాంతాల్లో వ్యాపించాయనే సిద్ధాంతం ప్రాచుర్యాన్ని పొందింది.
ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్యులు అనబడే సంచారజాతులు బుద్ధునికి నాలుగు శతాబ్దాల ముందు వాయవ్య భారతదేశంలో ముందుగా ప్రవేశించి, తమ నమ్మకాలనూ ఆచారాలను తూర్పు, దక్షిణ దిశలుగా వ్యాపింపజేసారు. కనుక వేద వాజ్ఞ్మయం, పౌరాణిక సంప్రదాయాలు, క్రీపూ. మొదటి సహస్రాబ్దికి చెందినవిగా నిర్ధారించారు. కానీ ఇరవయ్యో శతాబ్దపు తొలి రోజుల్లోనే ఈ సిద్ధాంతానికి ఒక కొత్త సవాలు ఎదురయింది. సింధూనదీలోయలో 'హరప్పా, మొహెంజొదారో'' పట్టణాల శిధిలాలు వెలుగులోకి వచ్చాయి. పురాతత్వవేత్తలు అక్కడ దొరికిన ముద్రల ఆధారంగా అది ప్రాచీన సుమేరియా, ఈజిప్టులకి సమకాలీనం అంటే క్రీపూ. 3వ సహస్రాబ్దికి చెందిన నాగరికతగా నిరూపించారు. అయినాసరే అప్పటికే ఆమోదం పొందిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని, దానిపై అధారపడిన కాలనిర్ణయాన్ని పునఃపరిశిలించేందుకు పాశ్చాత్య మేధావివర్గమే కాదు భారతీయ చరిత్రకారులు కూడా నిరాకరించారు. దానికి ముఖ్యకారణాలు రెండు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ఒకవైపు పశ్చాత్యుల, భారతీయ అగ్రవర్ణాల ఆభిజాత్యాన్ని నిరూపిస్తే, మరోవంక బ్రాహ్మణేతరులూ, దళితులూ భారతదేశపు మూలవాసులన్న వాదనని బలపరుస్తుంది.
ఆ నేపథ్యంలో భారతీయ పురాణ, ఇతిహాసాల్లో కొన్ని చారిత్రక సత్యాలు ఉన్నాయనీ, వేద వాజ్ఞ్మయంలో, పురాణాల్లోని గాథలు చారిత్రక ఘటనలపై ఆధారపడినవనీ వాదించిన వాళ్లు కొందరు లేకపోలేదు. కానీ ఎగిరే విమానాలు, పదితలల రాక్షసులు, మానవుడో జంతువో తేలని దేవుళ్లతో నిండిన ఆ గాథలు పుక్కిటి పురాణాలే కానీ వాస్తవాలెలా అవుతాయి? దానికి తోడు ఆర్యుల దండయాత్రల తరువాత క్రీపూ. 1400 నుండీ 900 వరకూ భారతదేశంలో చిన్నచిన్న గ్రామీణ జనావాసాలు తప్ప పరిణతి చెందిన నాగరికత ఆనవాళ్లు పురాతత్వవేత్తలకు ఎక్కడా దొరకలేదు. సంస్కృత సాహిత్యం గురించి ఎంతో పరిశోధన చేసిన మ్యక్‌డొనెల్, భారతీయ ప్రాచీన సాహిత్యం గురించి ఈ విధంగా సెలవిచ్చాడు…
"History is the one weak spot in Indian literature. It is, in fact, nonexistent. The total lack of historical sense is so characteristic, that the whole course of Sanskrit literature is darkened by the shadow of this defect, suffering as it does from an entire absence of exact chronology."

అంతే, భారతీయ ఇతిహాసపురాణాల సంప్రదాయం ఉత్త బూటకమనీ, చిన్నచిన్న తగాదాలని మహాయుద్ధాలుగా చిత్రించడం ఆనాటి పౌరాణికుల, కవుల కల్పనా చాతుర్యమేగానీ నిజంకాదనీ, భారతీయులకి చారిత్రక స్పృహ లేదనీ తేల్చి పారేసారు. 

ప్రాచీన భారత చారిత్రక సంప్రదాయం
ఇప్పటికి నూటఇరవై యేళ్ల క్రితం, ఇంకా హరప్పా నాగరికత వెలుగు చూడని రోజుల్లో, కలకత్తాలో జడ్జిగా పనిచేస్తున్న ఎఫ్.ఇ. పర్జిటర్ అనే మేధావి, మార్కండేయపురాణంలో నిక్షిప్తమైన భౌగోళిక విశేషాలపై పరిశోధన మొదలెట్టాడు. అందులోని క్షత్రియ వంశావళులూ, ఆనాటి కథల్లోని సమకాలీన రాజుల రాజ్యాల వివరాలు అతడి జిజ్ఞాసని పెంచాయి. ఆ కథలూ, గాథలూ, యుద్ధాలూ, వివాహాలు, నిజమైన చారిత్రక సంఘటనలపై ఆధారితమేమో అనే సందేహం కలిగింది. అంతే అష్ఠాదశ పురాణాలూ, మహాభారతం, రామాయణం, హరివంశం మొదలైన గ్రంధాల్లోని వంశానుక్రమణికలపై పరిశోధన సాగించాడు. ఒక్కొక్క గ్రంధంలోని వివరాలు మిగిలిన వాటితో సరిచూసుకుంటూ, ప్రక్షిప్తాలనీ కల్పనలనీ పక్కనపెడుతూ, ముప్ఫై యేళ్ళు సాగిన ఆ ప్రయత్నంలో, రాయల్ ఆసియాటిక్ సొసైటీ పత్రికలో వ్యాసాల ద్వారా, భారతీయ ఇతిహాసపురాణ వాజ్ఞ్మయంలోని చారిత్రకతని నిర్ధారించే అనేక విషయాలు వెలికి తీసాడు. ఆతడి పరిశోధనల సారాంశం ANCIENT INDIAN HISTORIC TRADITION అనే గ్రంధంగా 1922లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌వారిచే ప్రకటించబడింది.
కానీ వంశావళుల్లోని తరాలను బట్టి భారతదేశంలో క్షత్రియ రాజుల రాచరికం క్రీపూ. 2200 ప్రాంతంలోనో అంతకు పూర్వమో మొదలై ఉండవచ్చని అంచనా వేసాడు. అది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి, ఆనాటి భాషా శాస్త్రజ్ఞుల కాలనిర్ణయానికీ విరుద్ధం. కనుక ఆ సిద్ధాంతాలని వ్యతిరేకించక, ఆనాటి కాలనిర్ణయాన్ని పునఃపరిశీలించాలేమో అనే సందేహాన్ని మాత్రం వ్యక్తపరిచి ఊరకున్నాడు.
వందేళ్లు గడిచాయి.
ఆవిధంగా చరిత్రకారులు బుట్టదాఖలు పర్చిన ఇతిహాసపురాణ సంప్రదాయాన్ని తిరగదోడి, వాటిలోని చారిత్రక వాస్తవాలను ఆధునిక యుగంలో వెలుగులోకి వచ్చిన పురాతత్వ వివరాలకు అనుసంధానం చేసి, తరచి చూసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. గ్రీక్ రోమన్ నాగరికతలు కళ్లుతెరవక ముందే చరిత్రని రికార్డ్ చేసే సంప్రదాయం ఇండియాలో ఉంది. అందులో నిజానిజాలపై దృష్టి పెట్టక 'భారతీయులకి చరిత్రపై అవగాహన లేదు' అనే అబద్దాన్ని పెంచిపోషించారు.
అడపాతడపా ఎవరైనా ఈ విషయం ఎత్తినా, అవి హిందుత్వం, ధార్మిక వాదాలుగానే ముందుకొచ్చాయి. 'అన్నీ వేదాల్లో ఉన్నాయిష,' అంటూ హిందూమతం ప్రాచీనతని సాహిత్యంలోని గ్రహాలూ గ్రహణాలు, మంత్రాలూ మహిమల ఆధారంగా వేల, లక్షల యేళ్ల వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాల వల్ల కొన్ని హేతుబద్ధమైన వాదనలకి కూడా ధార్మికత రంగు పులమడం సులభమయింది.

పురాణాలు
పురాణమనే పదానికి అర్థం పూర్వపు అంటే పాతకాలపు కథ. అలాగే ఇతిహాసం అంటే 'ఇలా నిజంగా జరిగింది' అనే అర్థం. వ్యాసుడు లోమహర్షణుడనే సూతుడికి పురాణాన్ని మొట్టమొదటగా చెప్పాడని ప్రతీతి. వ్యాసుడంటే మహాభారతకాలానికి చెందినవాడు. కానీ మనకి దొరికిన పురాణాల రాతప్రతులు క్రీశ. మూడవ శతాబ్ది తరువాతవే. పురాణాలని రాయడం తిరగరాయడం అనే ప్రక్రియ ఈనాటికీ సాగుతూనే ఉంది. పురాణమంటే ఏమిటి? ఎలా ఉండాలి అంటే లాక్షణికులు ఈవిధంగా చెప్పారు.
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ
వంశ్యానుచరితంచైవ పురాణం పంచలక్షణం
అంటే సృష్టి, వినాశనం, ప్రతిసృష్టి అనే చక్రం, ఒక్కొక్క మనువుయొక్క వంశాలు, వాటికి సంబంధించిన కథలు, అనే ఐదు అంశాలు పురాణాల్లో తప్పకుండా ఉండాలని నిర్ధారించారు. కానీ అన్ని పురాణాలూ ఈ సూత్రాన్ని పాఠించాయా, అంటే లేదు. దానికితోడు కాలానుగుణంగా వాటిలో అనేక ప్రక్షిప్తాలు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకి, మత్స్యపురాణం ఈ ఐదు అంశాలతోబాటూ బ్రహ్మవిష్ణుమహేశ్వరుల, సూర్యచంద్రుల వంటి దేవతల మాహాత్మ్యాలని, ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలు సాధించే ఉపాయాలనీ కూడా జతపర్చింది. ఇక వాయుపురాణంలో వర్ణాశ్రమధర్మం అంటే ఏయే కులాల వాళ్లు ఏ పనులు చేయాలో, నదులూ, యాగాలూ, వ్రతాలూ, దానాలూ, దేవుళ్ల మాహాత్మ్యాలూ, భక్తి జ్ఞాన యోగాలూ, ఇలా ధార్మిక సంబంధమైన అన్ని విషయాలూ జోడించింది. ఒక్కొక్క పురాణం ధార్మిక విషయాలకి ఎన్సైక్లోపీడియాలుగా మారాయి. మూలపురాణంలోని అసలు ఉద్దేశ్యం మరుగునపడింది.
వేదవ్యాసుడు ఆనాడు సూతులనుండీ, మాగధులనుండీ సేకరించిన 'పాత' విషయాలని క్రోఢీకరించి, ఆ 'ఆదిపురాణం' గురించి లోమహర్షణుడికి ఈ విధంగా చెప్పాడు.
ఆఖ్యానైశ్చపి ఉపాఖ్యానైర్ గాథాభిః కల్ప జోక్తిభిః
పురాణ సంహితాం చక్రే పురాణార్థ విశారదః
అంటే, జరిగిపోయిన ఆఖ్యానాలూ, ఉపాఖ్యానాలు, కథలూ ఒక వరుసలో కాలక్రమాన్ని అనుసరించి చెప్పడమే పురాణం అన్నాడు. ప్రాధమికంగా పురాణాలంటే రాజుల చరిత్రలు. వంశపారంపర్యంగా రాజవంశాల చరిత్రలూ, ప్రశస్తులూ, వీరగాథలూ సేకరించి, ముఖ్యమైన సందర్భాల్లో వాటిని గానంచేసే రాజోద్యోగులని సూతులూ, మాగధులూ అంటారని కౌటిల్యుడి అర్థశాస్త్రం వల్ల తెలుస్తుంది. ఆదిపురాణాన్ని కూడా ఈ సూతులనుండే గ్రహించి సంకలనం చేసానని వ్యాసుడే చెప్పాడు. కనుక పురాణాలు మొదట్లో క్షత్రియ సంప్రదాయం, బ్రాహ్మణ సంప్రదాయం కాదు. ఆ పురాణంలోని విషయాలు మహాభారతయుద్ధంతో సమాప్తమవుతాయి. తరువాతి రాజుల వివరాలు భవిష్యపురాణంలో పొందుపర్చబడ్డాయి. భవిష్యపురాణం ఒక బ్రహ్మంగారి కాలజ్ఞానంలా సాగుతుంది. రాబోయేకాలాన్ని వివరిస్తూ వ్యాసుడే చెప్పినట్లు ఏనాటికానాడు జోడించబడ్డాయి.
మొదట్లో పురాణాలు ధార్మిక భాషయైన సంస్కృతంలో కాక వ్యావహారిక ప్రాకృతంలో ఉండి ఉండవచ్చు. శ్లోకాల ఛందస్సు వాటిలో వాడబడిన కొన్ని పదాలని బట్టి చూస్తే మొదట ప్రాకృతంలో రచించబడ్డ శ్లోకాలు పిదప సంస్కృతీకరించబడ్డాయనే అనుమానం కలుగకమానదు. ఉదాహరణకి మత్స్య వాయు పురాణాల్లో 'నీరామిత్రాత్తు క్షేమక' అనే పదబంధం నీరమిత్రుడి పిమ్మట క్షేమకుడు అనే అర్థంతో చెప్పబడింది. ఇందులో 'క్షే' కి ముందు 'తు'కారం గురువు అవుతుంది. అదే ప్రాకృతంలో అయితే క్షేమకుడు, ఖేమకుడు అవుతాడు. అప్పుడు 'నీరామిత్రాత్తుఖేమక'లో 'తు' లఘువై ఛందస్సుకి సరిపోతుంది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు. 'చకారకుక్షి' వ్యాసుడి పురాణాల్లో తుకారాలూ, చకారాలు ఎక్కువగా ఉండటానికి, ప్రాకృత శ్లోకాలను, సంస్కృతంలో తిరగరాయడమే ఒక కారణం కావచ్చు.
మరొకటి లిపి. వాయు బ్రహ్మాండ పురాణాల్లో ఏదో ప్రాచీన లిపి నుండి తిరగరాయడంలో ఎదురైన ఇబ్బందులు కనిపిస్తాయి. పురాణాల తొట్టతొలి ప్రతులు గుప్తులకాలపు బ్రాహ్మిలో ఉన్నాయి. మౌర్యుల బ్రాహ్మికి దీనికీ పెద్ద తేడా లేదు. కాబట్టి కొన్ని ప్రాచీన ప్రతులు బ్రాహ్మిలో కాక వేరే లిపిలో ఉండటానికి ఆస్కారం ఉంది. అది వాయవ్యదేశంలో వాడుకలో ఉన్న ఖరోష్ఠి కావచ్చు లేదా అంతకు ముందరి సింధునాగరికత లిపి కావచ్చు. ఏదైనా హరప్పా లిపిని చదవగల్గితే నిర్దిష్టంగా చెప్పొచ్చు.

వంశావళుల ప్రాచీనత
వంశావళుల వివరాలు దాదాపుగా అన్ని ప్రాచీన పురాణ ప్రతుల్లో ఒకేవిధంగా ఉన్నాయి. ఇప్పుడు లభ్యంకాని మూలగ్రంధంలోని క్షత్రియ వంశావళుల క్రమం నిర్ణయించేందుకు వాయు, బ్రహ్మాండ, బ్రహ్మ, మత్స్య, విష్ణుపురాణాలూ, పద్మపురాణంలో 5వ స్కంధం ముఖ్యంగా పనికొస్తాయి. మిగిలినవాటిలో మార్పులూ చేర్పులూ ఎక్కువ. మహాభారతం, హరివంశం కూడా కొంతవరకూ సహకరిస్తాయి. పురాణాల్లోని క్షత్రియ వంశాలని ముఖ్యంగా సూర్య చంద్ర వంశాలుగా విభజించవచ్చు. ఐక్ష్వాకులే కాక వైదేహ, వైశాలి రాజులు కూడా సూర్యవంశస్థులే. ఇక చంద్రవంశపు రాజుల్లో పురు, యాదవ వంశావళులు ముఖ్యమైనవి. మొదట్లో ఆనవ, తుర్వశ, దృహ్యు వంశాలు, తరువాత భరత, కురు, పాంచాల వంశాలు, భవిష్యపురాణంలో ఛేదీయులు, ఇలా శాఖోపశాఖలుగా విస్తరించి కనిపిస్తుంది.
అయోధ్య రాజధానిగా ఇక్ష్వాకుని సంతతిలో మనువు నుంచి మహాభారతయుద్ధం వరకూ వరుసగా 90 మంది రాజులు రాజ్యం చేసారు. ఇక కలియుగంలో హస్తినాపురం, కౌశాంబి రాజధానులుగా అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు నుంచీ క్షేమకుడి వరకూ 30 మంది చంద్రవంశపు రాజులు కనిపిస్తారు. తరువాత కౌశాంబి మగధలో విలీనమయింది. పదిమంది శైశునాగులు, తొమ్మిదిమంది నందులూ పరిపాలించిన తరువాత చంద్రగుప్తమౌర్యుడు రాజయ్యాడు. అంటే చంద్రగుప్తుడికీ మనువుకీ 138 తరాల అంతరం ఉంది. ప్రఖ్యాత చరిత్రకారుడు, లండన్ యూనివర్సిటీలో భారతీయ చరిత్ర అధ్యాపకుడు అయిన ఏ.ఎల్.బాషం భారతదేశపు ప్రాచీన, మధ్యయుగాల హిందూ రాజవంశాలని, శాసనాల ఆధారంగా అధ్యయనంచేసి, భారతదేశపు ప్రాచీన, మధ్యయుగాల రాజుల పరిపాలనా కాలం, సగటున 19 సంవత్సరాలుగా అంచనావేసాడు. (పట్టిక)
శాసనాలు రాజుల రాజ్యాభిషేకాన్ని గుర్తించినా వాళ్లు చనిపోయిన లేదా పదవీవిరమాణ చేసిన సంవత్సరాలు అన్నిచోట్లా దొరకవు. కనుక ఒకరాజు పదవీకాలం మరో రాజ్యకాలంపై ఓవర్‌ల్యాప్ కావడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా స్టాటిస్టిక్స్ లోని స్టాండర్డ్ డీవియేషన్ వలన పైన చెప్పిన పదవీకాలాలని కొంతవరకూ కుదించక తప్పదు. కాబట్టి హిందూ రాజుల సగటు రాజ్యకాలం 18 యేళ్ళుగా నిర్ణయించవచ్చు.
పౌరాణిక వంశావళుల ప్రకారం చంద్రగుప్తమౌర్యుని నుండి వెనక్కి వెళితే మనువు అతడికి 138 తరాల ముందటివాడని ముందే వివరించాము. ఒక పదవీకాలానికి 18 యేళ్లుగా లెక్కగడితే 138 తరాలకి 2484 యేళ్లు అవసరం. చంద్రగుప్తుడు, అలెక్జాండర్ సమకాలీనుడని, క్రీపూ. 320 ప్రాంతంలో రాజ్యానికి వచ్చాడని గ్రీక్ సాహిత్యంలో ఆధారాలున్నాయి. కాబట్టి పౌరాణిక వంశావళుల్లోని మూలపురుషులు ఎంతలేదన్నా క్రీపూ. 2800 కి ముందుకాలం వాళ్ళవుతారు. 

ముగింపు
క్రీపూ. 1300 ప్రాంతంలో ఆర్యులనబడే ఐరోపా జాతులు భారతదేశంలో ప్రవేశించాయని మన పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చెప్తున్నాయి. పురాణ వంశావళులనిబట్టి, ఈ తేదీలు అంగీకరిస్తే భారతదేశంలో ఆర్యుల ఆగమనం మరో 1500 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాలి. పురాతత్వ ఆధారాలని అనుసరిస్తే ఆకాలం హరప్పా నాగరికత నేపథ్యానికి చెందుతుంది. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ఈ తేదీలు చెల్లవు. అయితే, ఆ వలస సిద్ధాంతం ప్రతిపాదించి రెండు వందల యేళ్లు కావస్తున్నా పురాతత్వశాస్త్రం కానీ, ఆధునిక మానవ జన్యుశాస్త్రం కానీ అందులో నిజాన్ని నిర్ధారించలేకపోయాయి.
కానీ మన చారిత్రక సంప్రదాయంలోని తొలి రాజుల తేదీలూ, వివరాలూ హరప్పా నాగరికతకే చెందినవని చెప్పాలంటే పురాణాల్లో అంతర్గతంగా లభించే భౌగోళిక, సామాజిక అంశాలు, రాజుల కథలూ మాత్రమే చాలవు. సమకాలీన చారిత్రక ఆధారాలని శోధించాలి. అవి లభ్యం కాని పక్షంలో ప్రాచీన రాచరికాలకూ హరప్పా నాగరికతకూ ముడిపెట్టడం శుష్కవాదమే అవుతుంది.
ఇక ఆధునిక శాస్త్రీయ పద్ధతుల వల్ల పురాతత్వశాస్త్రంలో వచ్చిన ప్రగతి అంతా ఇంతా కాదు. వాటి ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయాలేమైనా ఈ వాదాన్ని సమర్ధిస్తాయేమో చూడవచ్చు. దురదృష్టవశాత్తు హరప్పా నాగరికత శిధిలాల్లో దొరికిన ముద్రలపైనున్న లిపి మనకింకా కొరకరాని కొయ్యగానే మిగిలింది. అందువల్ల హరప్పా నాగరికత ఆవాసాలు, అవశేషాలూ ఒక నేపధ్యంగా పనికొస్తాయేమో కానీ పౌరాణిక రాజవంశాలకూ, ఆ నాగరికతకూ ఉన్న సంబంధాన్ని నిరూపించలేవు.
ముందుగా అంతర్గత సమకాలీనతలూ, గాథలనుబట్టి వంశానుక్రమణికల విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి (హైపాథెసిస్) రావడం అవసరం. ఆపైన చారిత్రకాధారాలతో బేరీజు వేసుకొని ఋజువులు కనిపిస్తేనే మన సంప్రదాయక వాజ్ఞ్మయంలో ఎంతోకొంత వాస్తవం ఉందని వాదించవచ్చు. లేని పక్షంలో మన సంస్కృత సాహిత్యంలో చారిత్రక స్పృహ లేదన్న మ్యక్‌డొనెల్ అభిప్రాయానికి తలవొగ్గవలసిందే.
ప్రాచీన భారతీయ చారిత్రక సంప్రదాయంలోని వాస్తవికతను నిరూపించే మా ప్రయత్నాన్ని వచ్చే సంచికనుండీ ఈ శీర్షికలో మీతో పంచుకుంటాము.
*

No comments:

Post a Comment