Tuesday, March 24, 2015

Chacchinalla Dibba

మన పురాణాల్లో నిజాలు
సాయి పాపినేని
జయశ్రీ నాయని

 
చచ్చినవాళ్ళ దిబ్బ - ఒక కేస్ స్టడీ
అదొకప్పటి మహాపట్టణం!
నేటి పాకిస్తాన్, సింధ్ ప్రాంతంలోని 'మొహెంజొదారో'. ఐదువేల సంవత్సరాల క్రితమే సింధూనదీతీరంలో పరిఢవిల్లిన భారతీయ నాగరికతకి చిహ్నం. స్థానికుల భాషలో మొహెంజొదారో అంటే అర్థం 'చచ్చినవాళ్ళ దిబ్బ' (Mound of the Dead). క్రీపూ. 2900 నుండి 2400 వరకూ ఎంతో వైభవాన్ని కళ్ళజూసిన ఆ పట్టణం అసలు పేరు మనకి తెలియదు.
పురావాస్తుశాస్త్రజ్ఞులు ఇప్పటివరకూ మొహెంజొదారోలో ఒకేఒక దిబ్బలో 240 హెక్టేర్లు అంటే 1200 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు. అదిగాక మరో ఆరు సింధునాగరికతకి చెందిన దిబ్బలని ఇంకా కదిలించలేదు. అవికూడా ఇప్పుడు తవ్వకాలు జరిపిన ప్రదేశానికి ఐదుమైళ్ళ పరిధిలోనే ఉన్నాయి. అంటే ఒకనాటి మహానగరంలో భాగంగానే ఉండివుంటాయని అనుకోవాలి. శిధిలాల్లో గృహ సముదాయాలని బట్టి, పురాతత్వవేత్తలు అప్పటి నగర జనాభా అంచనా వేసారు. ఆ ఏడు శిధిలాల సమూహంలో ఆనాడు నివసించిన మొత్తం జనాభా రెండు లక్షల పైచిలుకే ఉండివుండవచ్చు. క్రీపూ. 2000 నాటికి ప్రపంచ జనాభా 5 కోట్లకి మించి ఊండదని మానవశాస్త్రజ్ఞులు చెప్తారు. అంటే ప్రపంచ జనభాలో 0.05% ప్రజలు ఈ ఒక్క నగరంలోనే నివసించారు. ఈనాడు ప్రపంచంలో అత్యంత జనసామర్ధ్యం గల బీజింగ్, న్యూయార్క్, వంటి నగరాల జనాభా ప్రపంచ జనాభాలో భాగంగా చూస్తే, 0.03% దాటదు. అంటే, క్రీపూ 2500 ప్రాంతంలో, ప్రపంచమంతా వెదికినా మొహెంజొదారో అంత పెద్ద పట్టణం లేదు.
అంతటి మహానగరం నేటికి 4000 యేళ్ళ క్రితం పతనమై పాటిదిబ్బగా మారింది. మనకి దాని పేరు కూడా తెలీదు. 'చచ్చినవాళ్ళ దిబ్బ' అని గర్వంగా పిలుచుకుంటున్నాం. ఆ నగరం బతికి ఉన్న కాలంలో మరి దాని పేరేంటి? మొహెంజొదారో పట్టణం మాత్రమే కాదు. సింధునాగరికతా క్షేత్రంలో అటువంటి నగరాల శిధిలాలు ఎన్నో గత వందేళ్ళలో వెలుగుచూసాయి. భారతీయుల చరిత్ర చాలా ప్రాచీనమైనదనీ, మన సాంస్కృతిక వారసత్వం ఎన్నో యుగాలనుండీ వచ్చిందనీ చంకలు గుద్దుకుంటాం. కానీ ఒకనాడు ప్రపంచానికే తలమానికమై, ఒక వెలుగు వెలిగిన మన నగరాల పేర్లేవో మచ్చుకైనా తెలీదు. ఇదీ మన దౌర్భాగ్యం!
జిజ్ఞాస ఉన్నా మనకి ఎక్కడ వెదకాలో తెలియదు.
1. మన వేదవాజ్ఞ్మయంలో, పురాణేతిహాసాల్లో ఏమైనా సమాధానాలున్నాయా?
2. ఆనాటి సమకాలీన సమాజాల్లో, ఆ నాగరికత జ్ఞాపకాలేమైనా మిగిలి ఉన్నాయా?
3. చారిత్రక శాసనాలు, సాహిత్యంలో ఆధారాలేమైనా దొరుకుతాయా?
'మన ఇతిహాసపురాణ సంప్రదాయంలో నిజం ఉంది,' అనే నమ్మకంతో, గతంలోకి ప్రయాణం చేసి, మన చరిత్రకందని చిరునామాలు కొన్ని వెలికితీయడమే ఈ శీర్షిక ఉద్దేశ్యం. మనకి అందుబాటులో ఉన్న ఆధారాలని మరోసారి తిరగతోడటం ద్వారా ఆనాటి నాగరికతకి చెందిన స్థలనామాలు, చారిత్రక వృత్తాంతాలపై కొంచెం వెలుగుని ప్రసరింప జేయడం సాధ్యమనే మా విశ్వాసం. ఈ వ్యాసంలో, పరస్పర విరుద్ధమైన దృక్పథాలూ సిద్ధాంతాల జోలికిపోకుండా, 'మొహెంజొదారో' నగరానికి మాత్రమే పరిమితమైన విషయాలను ఉదాహరిస్తూ, మేమనుసరించబోయే విధానాన్ని, ఒక 'కేస్ స్టడీ' మాదిరిగా పాఠకులకు పరిచయం చేస్తున్నాం.

భారతీయ వాజ్ఞ్మయం
భాషాపరిణామ శాస్త్రాన్ని బట్టి ఋగ్వేదంలోని భాష, క్రీపూ. 1500 ప్రాంతానికి చెందినదని చరిత్ర పాఠ్యపుస్తకాలు చెప్తాయి. అయితే మన వేదాల్లో, పురాణేతిహాసాల్లో పేర్కొన్న సంఘటనలు కొన్ని, అంతకంటే ప్రాచీనమైనవని శాస్త్రజ్ఞులు అంగకరిస్తారు. యుగారంభం క్రీపూ. 3102లో జరిగిందనే మరొక వాదం ఉంది. మన పురాణాల్లో భారతదేశం పాలించిన వివిధ రాజవంశాల వివరాలు ఉన్నాయి. ఆదిపురుషుడైన మనువు నుంచి చరిత్రలో మనకి తెలిసిన రాజుల వరకూ వివిధ వంశాల పట్టికలు ఉన్నాయి.
మనువు నుండీ మగధ రాజు చంద్రగుప్తమౌర్యుని వరకూ పురాణాల్లో ప్రకటించిన వివిధ సూర్య చంద్రవంశ రాజుల జాబితాతో 138 తరాల రాజులు ఉన్నారు. రాజుల పరిపాలనా కాలాల సరాసరి గణిస్తే, ఒక్కొక్క రాజు పరిపాలనాకాలం సుమారు 18 నుంచీ 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆ సంఖ్యనిబట్టి లెక్కకడితే, ఆ రెండు వంశాలకీ ఆద్యుడైన మనువు తేదీ, క్రీపూ 2800 [(138తరాలుX18ఏళ్లు)+క్రీపూ321] కంటే వెనక్కి పోతుంది. పురాణాల్లోని రాజవంశాల వివరాలూ, తేదీలు మరో వ్యాసంలో వివరిస్తాము. క్రీపూ. 2800 సింధునాగరికత కాలానికి చెందుతుంది కనుక, ప్రస్తుతానికి, మన సాంప్రదాయక వాజ్ఞ్మయంలో, సింధునాగరికత నాటి సంఘటనలూ, వ్యక్తి, స్థలనామాలు నిక్షిప్తమై ఉండటానికి అవకాశం ఉందని గ్రహిస్తే చాలు. అలాంటి స్థలనామాలు కొన్ని ఇక్కడ పరిశీలిద్దాం.
మన పురాణాల్లో ఏడు ముఖ్యపట్టణాల ప్రసక్తి ఉంది. అవి అతి ప్రాచీనకాలంలో ఎంతో వైభవంగా అలరారిన పట్టణాలు. ఆ పట్టణాల నేపధ్యంలో సాగిన అనేక కథలూ గాధలూ ఉన్నాయి.
అవి... అయోధ్యా, మథురా, మాయా, కాంచీ, కాశీ, అవంతికా, ద్వారవతి.

 

 
1.అయోధ్య: సూర్య వంశస్థులైన ఇక్ష్వాకుల రాజధాని.
2.మథుర: యాదవుల ముఖ్యపట్టణం.
3.మాయ: మయాసురుని సముద్రాంతరమైన పట్టణం.
4.కాంచి: కంచుతో నిర్మించబడ్డ నగరం, వేద వాజ్ఞ్మయంలో లోహనిర్మిత పురాల ప్రస్తావన ఉంది.
5.కాశి: ఇదీ కాంశ్యనిర్మితమే, విశ్వానికే రాజధానిగా కీర్తించబడ్డ నగరం.
6.అవంతిక: నర్మదాతీరంలో బలిచక్రవర్తి పూర్వరాజధాని.
7.ద్వారవతి:శ్రీకృష్ణునిచే నిర్మించబడి, కలియుగా రంభంలో సముద్రగర్భంలో కలిసింది.

 
ఈ నగరాల్లో కొన్ని మనకి తెలిసినవే. పురాతత్వ శాస్త్రజ్ఞుల తవ్వకాలను బట్టి, అక్కడ బయటపడ్డ శిధిలాల ప్రాచీనత పరిశీలిద్దాం (పటం). వీటిలో ఏవైనా క్రీపూ 1500కు ముందు కాలానికి చెందినవి ఉన్నాయేమో చూద్దాం.

 
అయోధ్య:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఫైజాబాద్‌లోని వివాదస్పదమైన స్థావరమే అయోధ్య అని నమ్మకం. తవ్వకాల్లో మొగల్ కాలానికి ముందటి కొన్ని నిర్మాణాలు కనుగొన్నారు. కానీ ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధయుగానికి అంటే క్రీపూ. 600 తరువాతి కాలానికి చెందిన శిధిలాలే కానీ, అంతకు ముందు కాలాలవి ఎక్కడా కనపడవు.
మథుర:
యమునాతీరంలో ఆగ్రాకి వాయవ్యంగా ఉంది. చారిత్రక యుగంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నగరం. కానీ క్రీపూ. 900కి ముందు ఆ ప్రాంతంలో నాగరికత మొదలైన ఆనవాళ్ళు దొరకవు.
కాంచి:
తమిళనాడులో మద్రాస్‌కు పశ్చిమాన అనేక దేవాలయాలతో కూడిన పట్టణం. క్రీశ. 3వ శతాబ్ది నుండీ పల్లవుల ముఖ్యపట్టణంగా కనిపిస్తుంది. నగరనిర్మాణ ప్రక్రియ దక్షిణాంధ్ర, తమిళనాడుల్లో క్రీపూ 300కు ముందు కనపడదు.
కాశి:
గంగాతీరంలో తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి. వాజ్ఞ్మయంలో ఈ పట్టణ ప్రస్తావనల్ని బట్టి, ఈ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన క్షేత్రంగా భావిస్తాం. కానీ ఇప్పటి వారణాసి నగరంలోగానీ ఆ ప్రాంతంలోగానీ క్రీపూ. 800 ముందు పట్టణనిర్మాణపు ఆనవాళ్ళు కనిపించవు.
అవంతిక:
నర్మదా క్షిప్రానదుల సంగమంలో ఉన్న ఉజ్జయినీ పట్టణమే అవంతిక అనే అభిప్రాయం ఉంది. ఈ ప్రాంతంలో క్రీపూ. 2000కి ముందే సింధునాగరికత స్థావరాలను కనుగొన్నారు. పురాణాల్లోని అవంతి సింధునాగరికతకి చెందిన స్థావరం అనుకుంటే తప్ప, దీనిని అవంతికగా అమోదించలేము.
ద్వారావతి:
పశ్చిమ గుజరాత్ తీరంలో ద్వారక పట్టణం వద్ద భారతీయ సముద్రాంతర్గత పురాతత్వవేత్తలు, ప్రొ. షికారిపుర రంగనాథరావు ఆధ్వర్యంలో, సముద్రగర్భంలోని ఒక నగరం శిధిలాలను కనుగొన్నారు. ఈ శిధిలనగరం సింధునాగరికతా సమూహానికి చెందినది. క్రీపూ. 1500 ప్రాంతంలో ఆకస్మాత్తుగా సముద్రంలో మునిగిపోయి పతనమైందని రేడియో ధార్మిక కార్బన్ 14 డేటింగ్ పద్ధతిద్వారా నిర్ధారించారు.
ద్వారక ముంపుకి గురైన తేదీ, ప్రస్తుత చర్చకి చాలా ఆవశ్యకం. మన వాజ్ఞ్మయాన్ని అనుసరించి చూస్తే పైన ఉదాహరించిన నగరాలన్నీ ద్వారావతికంటే ముందు కాలానికి చెందినవే. మొట్టమొదటి పురాతత్వ సర్వే అధ్యక్షుడు, కన్నింఘాం, బౌద్ధయుగానికి చెందిన అవే పేర్లుగల పట్టణాల ఉనికిని గుర్తించాడు. పురాతత్వ ఆనవాళ్ళ ప్రకారం అవన్నీ ద్వారక ముంపుకు గురైన పిదప నిర్మించబడ్డవే. సింధునాగరికత చివరిదశకీ, ఈ పట్టణాల ఆవిర్భావానికీ మధ్య ఐదు శతాబ్దాల పైగా అంతరం ఉంది. అయినా కన్నింఘాం నిర్దారణలను తప్పుబట్టలేము.
కొత్త ఊర్లకు పాతపేర్లు
ప్రజలు ఒక ప్రదేశాన్నుంచి మరొకచోటుకి వలసపోయినప్పుడు వాళ్ళు వదిలి వచ్చిన ప్రాంతపు జ్ఞాపికగా, కొత్తగా కట్టుకున్న ఊళ్ళకి పాతపేర్లు పెట్టుకోవడం ఆనవాయితీ. ఈ ప్రక్రియకి అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్, థాయ్‌లాండ్‌లోని అయోధ్య, తమిళనాడులో మధుర ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సింధునాగరికత పతనానంతరం అక్కడి ప్రజలు తూర్పులో గంగా పరివాహక ప్రాంతానికి వలస వచ్చినట్లు పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. అలా వలస వచ్చిన ప్రజలు కొత్తగా స్థాపించిన పట్టణాలకి పాత పేర్లే పెట్టుకొనే అవకాశం ఉంది. కనుక 'మృతులదిబ్బ', 'రాకాసులకోట' వంటి పేర్లతో నేడు పిలువబడుతున్న సింధునాగరికతకి చెందిన కొన్ని స్థావరాల అసలు పేర్లు, మన పురాణేతిహాసాల్లో పేర్కొన్న నగరాలవే అయ్యేందుకు అవకాశం ఉంది కదా? ఏదైనా నిర్ధారణకి వచ్చేముందు మొహెంజొదారో ప్రాంతానికి మాత్రమే చెందిన చారిత్రక ఆధారాలు కొన్ని ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.

 
జెండ్ అవెస్తా
ఈనాటి జొరాస్ట్రియన్స్ లేదా పార్సీలు అని పిలువబడే, ప్రవక్త జరాతృష్ట్రుడి అనుయాయుల ప్రాచీన మతగ్రంధం పేరు 'అవెస్తా'. అవెస్తా 'జెండ్' అనే ప్రాచీన భాషలో రాయబడింది. జెండ్ భాషకీ, ఋగ్వేదంలోని 'వాక్కు' అనబడే ప్రాచీన సంస్కృత రూపానికీ చాల దగ్గర సంబంధం ఉంది. ఇవి రెండూ ఒకే కాలానికి చెందినవని భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయం. జెండ్ అవెస్తాలోని మొదటి ప్రకరణం, వెన్డిదాద్‌లో ఆనాటి భౌగోళిక జ్ఞానం కొంత పొందుపరచబడింది. వాళ్లకి తెలిసిన భూభాగాన్ని పదహారు ప్రాంతాలుగా విభజించి చూపడం జరిగింది. ఇవి వాయవ్యం నుండి ఆగ్నేయ దిశగా, మధ్యధరా సముద్ర ప్రాంతంనుండి ఇరాన్ పీఠభూమి మీదుగా వాయవ్య భారతదేశం వరకూ సాగుతాయి. వీటిలో ఆఖరి మూడు ప్రదేశాలు భారత ఉపఖంఢానికి చెందినవి. యధాతథంగా వెన్డిదాద్‌లో ఆ ప్రాంతాల ప్రస్తావనల తెలుగు అనువాదం ఇలా ఉంది:
1     వారెణ (వారణ): 'అందుకే థ్రేటోన (వృత్రఘ్న=ఇంద్రుడు) జన్మించాడు, అహిదాహకుని (వృత్రాసురుని) సంహరించాడు. ఆపైన వచ్చిన ఆంగ్రమైన్యు (దేవతల నాయకుడు) అతడే మృత్యువు, క్షుద్ర మంత్రమహిమచే అతడు చేసిన ప్రతిసృష్టి వల్ల స్త్రీలకు వికృతమైన సంతతి, విదేశీయులైన రాజులవల్ల అణచివేత కలిగాయి.'
2     హప్తహిందస్ (సప్తసింధు): 'ఆపైన వచ్చిన ఆంగ్రమైన్యు, అతడే మృత్యువు, క్షుద్ర మంత్రమహిమచే చేసిన ప్రతిసృష్టి వల్ల స్త్రీలకు వికృతమైన సంతతి, భరింపలేని వేడి కలిగాయి.'
3     రంఘా (రస): 'అక్కడి ప్రజలకు తలలు ఉండవు. ఆపైన వచ్చిన ఆంగ్రమైన్యు అతడే మృత్యువు, క్షుద్ర మంత్రమహిమచే చేసిన ప్రతిసృష్టి వల్ల క్షామం కలిగింది. దానికి కారకులు దేవతలే.'
అహిదాహక లేదా వృతాసురునికీ ఇంద్రునికీ జరిగిన యుద్ధం గురించి ఋగ్వేదంలో వివరించబడింది. కానీ ఆ యుద్ధం జరిగిన ప్రదేశం ఎక్కడో ఋగ్వేదం చెప్పలేదు. జరాతృష్ట్ర మాత్రం ఆ సంఘటన 'వారణ' అనబడే ప్రదేశంలో జరిగిందని చెప్పాడు. వృత్రాసురవధ వేదవాజ్ఞ్మయంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. వెన్డిదాద్‌వలన 'వారణ' ప్రాంతం సప్తసింధుకి (హప్తహిందస్) పశ్చిమంగా ఉందని తెలుస్తుంది. ఋగ్వేదంలో సప్తసింధులోయలోని అనేక నదుల వివరాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వితస్థ, అశికిని, పరుష్ణి, విపాశ, శతుద్రి, సరస్వతి, దృషద్వతి నదులు. వీటిలో మొదటి ఐదు పంజాబ్‌లో ప్రవహించే సింధునది ఉపనదులైన ఝీలం, చీనాబ్, రావి, బియాస్, సత్లూజ్ నదులు. సరస్వతీ, దృషద్వతులు హర్యానా, రాజస్తాన్లలో ప్రవహించే వర్షాధారపు నదులు.
దీన్నిబట్టి, సప్తసింధుప్రాంతానికి పశ్చిమంగా ఉన్న సింధునదీ ప్రాంతమే 'వారణ'గా గుర్తించవచ్చు. మన పురాణేతిహాసాల్లోని అతి పవిత్ర క్షేత్రాల్లో ఒకటి 'వారణావతం'. కాశీ, వారణాసి దానికి పర్యాయనామాలు. వేదాల్లోని దేవతల్లో ముఖ్యుడైన వరుణుడికీ నీటికీ ఉన్న సంబంధం కూడా సింధునదికి, వారణావతానికి ఉన్న సంబంధాన్ని కొంత బలపరుస్తుంది. జెండ్ అవెస్తాలోని ప్రస్తావన మాత్రమే ఆధారంగా మన ఇతహాస పురాణ సంప్రదాయంలోని వారణావతం లేదా వారణాసిని, గంగాతీరంలోగాక సింధునదీతీరంలో ఉందని ప్రతిపాదించాలంటే, ఆ వాదనని బలపరిచే మరిన్ని చారిత్రక ఆధారాలు శోధించాల్సిన అవసరం ఉంది.

 
గ్రీకు గ్రంధం - ఇండిక
భారత ఉపఖండంలోని వాయవ్యప్రాంతం గురించి మొట్టమొదటి చారిత్రక ఆధారాలు, అలెక్జాండర్ దండయాత్ర పిమ్మట రాయబడ్డ గ్రీకు పుస్తక ప్రతుల్లో దొరుకుతాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఆరియన్ సంకలనం చేసిన 'అనబాసిస్ అలెక్జాండ్రై' అనబడే గ్రంధం. దానిలో 8వ అధ్యాయం 'ఇండిక' అనే పేరుతో ప్రసిద్ధం. సింధునదీ ప్రాంతంలో అలెక్జాండర్, అతని సైన్యాధ్యక్షుల సాహసాలు, ఆ ప్రదేశపు ప్రత్యేకతకూ, వింతలూ ఎన్నో ఆ గ్రంధంలో వివరించబడ్డాయి. ఈ పుస్తకంలోని వివరాలే ఆధారంగా ఒక నిర్ణయానికి రావడం పద్ధతి కాకపోయినా, ఆ గ్రంధంలోని చెదురుమదురు సమాచారాన్ని కూడా ఎంతో యధాతథంగా చరిత్రకారులు స్వీకరించారు కనుక మనం అదే చేద్దాం.
ఇండికలో వివరించబడ్డ 'వరుణశిల' కథ (The Story of the Rock of Aornus) మన వాదానికి కొంత పనికొస్తుంది. స్థానికుల కథనం ప్రకారం, 'హేరాక్లెస్' అనే దేవుడు మూడుమార్లు ప్రయత్నించి విఫలమైన ఆ శిలపై, అలెక్జాండర్ ఒకే ఒక ప్రయత్నంలో విజయం సాధించాడని అనబాసిస్ రచయిత తెలిపాడు. దానిపై వ్యాఖ్యానంలో అలెక్జాండర్ వరుణశిల గురించి ప్రగల్భాలు పలికాడని ఆరియన్ రాసాడు. ఆ కార్యంలో అలెక్జాండర్‌కి స్థానికులనుండి ఎటువంటి ప్రతిఘటనా ఎదురవలేదట! వరుణశిలకి ఎంత ప్రాచీనత ఉన్నా అలెక్జాండర్ కాలానికి అదొక పతనం చెందిన కోట మాత్రమేననీ, ఆ ప్రాంతంలో నివసించే 'సిబీ' అనబడే జనజాతి కూడా అలెక్జాండర్‌తో యుద్ధానికి రాలేదని ఇండికలోని కథనం వల్ల తెలుస్తుంది. అలెక్జాండర్ వంటి యోధుడు గొప్పలు పోవడానికి, ఆ వరుణశిల ప్రాముఖ్యం ఏమిటి? ఆ పట్టణాన్ని 'డైయోనిసస్' అనబడే గ్రీకు దేవుడు అప్పటికి 6040 సంవత్సరాల క్రితం అంటే క్రీపూ. 6363లో స్థాపించాడనే స్థానికుల సమాచారాన్ని కూడా ఆ గ్రంధంలో పొందుపర్చారు.
డైయోనిసస్, శివునికీ; హేరాక్లెస్‌, విష్ణువు లేదా వాసుదేవునికి ప్రతిరూపాలుగా భావిస్తారు. డైయోనిసస్‌చే (శివుడు) స్థాపించబడ్డ పురంపై, హేరాక్లెస్ (విష్ణువు) మూడుమార్లు దాడి చేసినట్లు చెప్పడం, ఋగ్వేదంలో (4-18-11) ఇంద్రుడు, వృత్రాసుర సంహారానికి విష్ణువు సహాయాన్ని కోరుతూ, పెద్ద అడుగులతో వృత్రుడి పురంపై దాడి చేయమని ప్రోత్సహించే ఘట్టంలో ప్రతిధ్వనిస్తుంది. విష్ణువు వేసేవి మూడడుగులనే అంశం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఈ వరుణశిల ఎక్కడుంది? స్ట్రాబో రచించిన జాగ్రఫీ అనే రోమన్ గ్రంధంలో ఈ విధంగా ఉంది.
'When Alexander, at one assault, took Aornus, a rock at the foot of which, the Indus River flows, his exalters said that Heracles thrice attacked this rock and thrice was repulsed; and that the Sibae were descendants of those who shared with Heracles in the expedition, and that they retained badges of their descent…'
పై వాక్యం నుండి మనకి రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి వరుణశిల సింధునది తీరంలో ఉందని, రెండు 'శిబ' లేదా శివ అనే జనజాతి అదే ప్రాంతంలో నివసించేవారని. ఈనాటికీ 'శిబి' అనబడే పట్టణం మొహెంజొదారో సమీపంలో, శిధిలాలనుండి క్వెట్టాలోయకి వెళ్ళే మార్గంలో ఉంది. కనుక ఇండికలో చెప్పబడిన వరుణశిల, మొహెంజొదారో ప్రాంతానికి చెందినదే అనుకోవచ్చు.

చైనా రికార్డులు
ఇక చైనాలో దొరికిన చారిత్రక రికార్డులు మరికొన్ని ఋజువులు సూచిస్తాయి.
క్రీశ. 7వ శతాబ్దంలో యువాన్ చువాంగ్ అనే బౌద్ధభిక్షువు తన యాత్రావిశేషాలు గ్రంధస్తం చేసాడు. డ-డాంగ్-సి-యు-కి (డాంగ్ చక్రవర్తి కాలానికి చెందిన పశ్చిమదేశాల విశేషాలు) అనబడే ఆ గ్రంధంయొక్క ప్రతులు అనేక బౌద్ధారామాలలో దొరికాయి. ఆనాటి భారతదేశాన్ని చైనీయులు షిన్-తూ, సిన్-టౌ, కన్-తు, యువాన్-తు, టియెన్-గ్యు, టియెన్-ఝౌ, యిన్-తు అని అనేక పేర్లతో పిలిచారు. యువాన్ యాత్రికుడు మాత్రం భారతదేశపు సరియైన పేరు 'యిన్‌తు' అనీ, అది హిందువుల భాషలో చంద్రునికి (ఇందు) పర్యాయమనీ చెప్పాడు. కానీ యువాన్ యాత్రికునికి 800 సంవత్సరాల ముందే, క్రీపూ 120లో బాక్ట్రియాకి దూతగా వచ్చిన చాంగ్ చియెన్ అనే చైనా దేశస్థుడు బాక్ట్రియాలో భారతదేశాన్ని 'కాన్-సి' లేదా 'కాట్-చి' అని పిలుస్తారని రాసాడు. బాక్ట్రియా వాయవ్య భారత ఉపఖండానికి సరిహద్దు దేశం. ఈ రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య రాజకీయ సంబంధాలు, వలసలు ప్రాచీన కాలం నుంచీ సాగాయి. కనుక చైనాభాషలోని ఆధారాలనుబట్టి బయటి ప్రపంచంలో ఇండియాకి ఉన్న అతి ప్రాచీననామం 'కాశి' లేదా 'కాన్శి'. కాశి వారణాసికి మరోపేరన్న విషయం తెలిసిందే కదా?
మొహెంజొదారో
మొహెంజొదారో
ఇక మన చర్చకి సంబంధించి యువాన్ చువాంగ్ తెలిపిన విషయాలేవో చూద్దాం. అతడు సింధునది తీరంలో 'u-to-ka-han-ťu' అనే పట్టణాన్ని దర్శించాడు. ఆ పేరుని అనువాదకులు (థామస్ వాట్టర్స్ ప్రభృతులు) 'ఉదకఖండ', లేదా 'ఉదఖండ'గా నిరూపించారు. అక్కడి విశేషమేమంటే, యువాన్ యాత్రికుడు ఆ పట్టణానికి దగ్గరలో కొండపైన ఒక స్తూపం, దిగువన మహాదేవుని (శివుడు) ప్రతిరూపమైన నీలిరంగు గండశిలని దర్శించినట్లు రాసాడు. (పటంలో మొహెంజొదారో శిధిలాల గుట్ట శిఖరంపై క్రీశ. 1వ శతాబ్దికి చెందిన బౌద్ధస్తూపం చూడవచ్చు) సియుకిలో (3-VII) ఆ ప్రదేశంయొక్క వివరాలు థామస్ వాట్టర్స్ అనువాదంలో ఇలా ఉన్నాయి.
'ఉదకఖండకి ఉత్తరంగా కొండలూ నదులూ దాటి 600 లి (120 km) వెళితే ఉద్యాన (Wu-chang-na) అనే ప్రాంతం వస్తుంది. ఆది 'శుభవాస్తు' (Su-p'o-fa-su-tu) అనే నదిలోయలో ఉంది.'
యువాన్ యాత్రికుడు దర్శించిన ప్రదేశాలని నిర్ధారించేందుకు అసామాన్యమైన కృషి చేసిన మేజర్ జనరల్ కన్నింఘాం ఉద్యాన ప్రాంతాన్ని కాశ్మీర్లో లేదా స్వాత్ నది ప్రాంతంలో సూచించాడు. కానీ స్వాత్‌నదికి మన సంస్కృత వాజ్ఞ్మయంలో పేరు 'సువాస్తు'. యువాన్ యాత్రికుడు చెప్పిన 'శుభవాస్తు', క్వెట్టా లోయలో కిర్తార్ పర్వతాల్లో పుట్టిన 'షోభ్' (Zhob) నది అయ్యేందుకే అవకాశం ఎక్కువ. అతడు చెప్పినట్లే ఈ ప్రదేశం, మొహెంజొదారోకి 120 km దూరంలో ఉంది. యువాన్ సూచించిన మరో అంశం కూడా ఈ వాదాన్ని బలపరుస్తుంది. ఉదకఖండకి దగ్గరలో ఆ యాత్రికుడు 'బ్రాహ్మణస్థల' (Pὁ-lo-mên-tu-lo) అనే మరో పట్టణాన్ని సూచించాడు. మొహెంజోదారో సమీపంలోనే సింధ్ రాష్ట్రంలో 'బ్రాహ్మణాబాద్' పట్టణం నేటికీ ఉంది.
ఇంతకీ ఈ ఉదకఖండ పేరు పట్టుకొని ఎందుకీ రభస?
మన యువాన్ యాత్రికుడు ఈ ఉదకఖండ ప్రాంతానికి సంబంధించిన కథ ఒకటి చెప్పాడు. అదేమంటే, ఒకానొకప్పుడు ఒక మహారాజు, వాగ్దానానికి బద్ధుడై, తన భార్యా పిల్లల్ని ఆ ఊళ్ళోనే అమ్ముకున్నాడట! ఆ కథ మనకీ తెలిసిందే! ఆ మహారాజు త్రేతాయుగంలో శ్రీరాముడి పూర్వీకుడైన హరిశ్చంద్రుడు. కానీ ఆ చక్రవర్తి భార్యనీ కొడుకునీ అమ్ముకున్నది వారణాసిలో అని పురాణాలు చెబుతాయి. కొంచెం తేడాతో అదే కథచెప్పే 'రాహులజాతక' అనే బౌద్ధ జాతకకథ, వారణాసికి చెందిన ఏకశృంగుడనే ఋషిని ప్రస్తావిస్తుంది. యువాన్ యాత్రికుడు ఆ ఋషి ఉదకఖండ ప్రాంతానికే చెందినట్లు రాసాడు.
ముగింపు:
ఋగ్వేదంలో వృతాసురుడు మాత్రమే కాక మరో అసురుడైన శంబరాసురుడి ముఖ్యపట్టణం పేరు ఉదవ్రజం. ఇంద్రుడు ఆ పట్టణాన్ని జయించడానికి కూడా విష్ణువుని సహాయం అర్థించడం పురాణాల్లో ఉంది. ఉదవ్రజం అంటే నీటితో చుట్టబడిన జలదుర్గం అనే అర్థం చెప్పుకోవచ్చు. వృతాసురుడు నీరు ప్రవహించకుండా అడ్డుపడినట్లూ, అతడిని సంహరించి ఇంద్రుడు నీటిని విడుదల చేసినట్లుగా ఋగ్వేదం వర్ణిస్తుంది. ఈ రెండు వృత్తాంతాల్లో పోలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పురాణాల్లో వారణాసి కూడా 'వారణ, అశి' అనే రెండు నదుల మధ్య ఉన్న జలదుర్గమని చెప్పబడింది. వారణాసి శివునికి నెలవైన పవిత్ర క్షేత్రం. అక్కడి శివుడు విశ్వనాథుడు. అంటే ఆ నగరం విశ్వానికే తలమానికమైనది. క్రీపూ. 2900 నుంచీ 2400 వరకూ మొహెంజొదారో నగరం కూడా ఆనాటి ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా ఒక వెలుగు వెలిగింది.
ఆ మొహెంజొదారో అసలు పేరు జరాతృష్ట్రుడు చెప్పిన 'వారణా' నగరమా? అలెక్జాండర్ పట్టుకున్న 'వరుణ'శిలా? హరిశ్చంద్రుడు ఆలుబిడ్డలు అమ్ముకున్న వారణాసియా? ఋగ్వేదంలో నూరు పురాలకి రాజధానియైన శంబరుని ఉదవ్రజమా? యువాన్ యాత్రికుని ఉదకఖండమా? లేక ప్రాచీన చైనీయుల కాశీ పురా?
భౌగోళికాంశాలనుబట్టి జెండ్ అవెస్తాలోని వారణ నగరం సప్తసింధు ప్రాంతానికి పశ్చిమంగా ఉంది. ఇండికా, జాగ్రఫీల్లోని 'వరుణశిల', సియుకిలో యువాన్ యాత్రికుని 'ఉదకఖండ', సింధునది తీరంలో ఉన్నాయి. గ్రీకు కథనాల్లో శివ (Sibae) జాతీయులు అలెక్జాండర్ నౌకాదళ నాయకుడు నియార్కస్‌కి, సత్లూజ్ నదికీ, సింధూ నదీముఖానికి మధ్య తారసిల్లారు. ఇక వాజ్ఞ్మయపరంగా చూస్తే శంబరాసురవధ, వృత్రాసురవధ ఋగ్వేదకాలానికి చెందిన సంఘటనలు. హరిశ్చంద్రుడు, శ్రీరామునికి ముందుతరాలకి చెందినవాడు. ఈనాడు మనకి తెలిసిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణం పురాతత్వశాస్త్రరీత్యా క్రీపూ. 800కి ముందు కాలంలో లేదు. ఒకవేళ అదే ప్రాచీనుల వారణాసి అనుకోవాలంటే శ్రీరాముడు, బుద్ధునికి తరువాతి కాలానికి చెందినవాడని అంగీకరించాల్సి వస్తుంది. అది అసంబద్దం.
కనుక నేడు `చచ్చినాళ్ళదిబ్బ'గా పిలువబడే మొహెంజొదారో శిధిలనగరమే ఆనాటి కాంశ్యయుగ నాగరికతలో విశ్వానికే రాజధానిగా విరాజిల్లి, వారణావతం, వారణాసి లేదా కాశి అనే పేర్లతో పిలువబడి ఉండాలి.
మన వేదవాజ్ఞ్మయంలో, పురాణేతిహాసాల్లో నిక్షిప్తమై ఉన్న మరెన్నో నిజాలని ఈ శీర్షిక ద్వారా వచ్చే సంచికనుండీ మీకందించడానికి ప్రయత్నిస్తాము.
*